Road Accident: ఉద్యోగంలో చేరిన కొద్ది గంటల్లోనే దుర్మరణం
నందిగామ, న్యూస్‌టుడే: ప్రభుత్వ ఉద్యోగంలో చేరి ఆనందంగా తిరిగొస్తున్న ఓ వివాహిత రోడ్డు ప్రమాదంలో దుర్మరణం పాలైంది. ఆమె భర్త తీవ్రంగా గాయపడ్డాడు. కంచికచర్ల మండలం పరిటాలకు చెందిన వేముల మారుతీరావు, పాల్వంచకు చెందిన కాల్వ సావిత్రి(33) కొన్నేళ్ల క్రితం ప్రేమ వివాహం చేసుకున్నారు. మహబూబ్‌నగర్‌లో విద్యుత్తు శాఖ జూనియర్ లైన్మెన్గా సావిత్రి ఉద్యోగం సాధించారు. ఈ నెల 14న ఆమె భర్తతో కలిసి ద్విచక్రవాహనంపై మహబూబ్‌నగర్ వెళ్లి విధుల్లో చేరారు. పరిటాలకు తిరిగొస్తుండగా 15వ తేదీ తెల్లవారుజామున 2 గంటల సమయంలో నందిగామ రామన్నపేట అడ్డరోడ్డు వద్ద రహదారి పక్కనున్న రైలింగ్‌ను వీరి బైకు ఢీకొంది. వెనుక కూర్చున్న సావిత్రి తల రైలింగ్‌కు బలంగా తగిలింది. నందిగామ ప్రభుత్వ వైద్యశాలకు తరలించిన కొద్దిసేపటికే మృతి చెందింది. తీవ్రంగా గాయపడిన మారుతీరావును విజయవాడలోని ఆసుపత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు.