TS News: నా భర్త నాకు కావాలి..!
బాధితురాలితో మాట్లాడుతున్న తహసీల్దారు, ఐసీడీఎస్ పీవో
అశ్వాపురం, న్యూస్‌టుడే: ప్రేమించి పెళ్లాడిన తన భర్త తనకు కావాలంటూ ఓ యువతి మూడు రోజులుగా ఆందోళన చేస్తోంది. అశ్వాపురంలోని చినతండాకు చెందిన బానోతు దివ్య (21), స్థానిక కాల్వబజారుకు చెందిన ఆర్మీ ఉద్యోగి కాటిబోయిన నరేంద్ర ప్రేమించుకున్నారు. కులాలు వేరుకావడంతో తల్లిదండ్రులు వారి పెళ్లికి ఒప్పుకోలేదు. నరేంద్ర సెప్టెంబరులో దివ్యను హైదరాబాద్ తీసుకెళ్లి స్నేహితుల సమక్షంలో వివాహం చేసుకున్నారు. తల్లిదండ్రులను ఒప్పించి తన ఇంటికి తీసుకెళ్తానని చెప్పాడు. ఎవరి ఇళ్లకు వారు వెళ్లిపోయారు.
రోజులు గడుస్తున్నా భర్త నుంచి స్పందన లేకపోవటంతో ఇదేంటని నిలదీసింది. ఆ క్రమంలో నరేంద్ర నిరాకరిస్తుండటంతో ఈ నెల 7న బాధితురాలు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. పోలీసులు ఇద్దరికీ కౌన్సిలింగ్ ఇచ్చారు. ఉద్యోగానికి వెళ్తున్నానని, రెండు నెలల తరవాత వచ్చి దివ్యను తీసుకెళ్తానని నరేంద్ర లిఖిత పూర్వకంగా రాసిచ్చాడు. కానీ బాధితురాలు చరవాణిలో అడుగుతుంటే ఎప్పటిలాగే మాట మార్చుతున్నాడు. దాంతో తన భర్త ఇంట్లోకి రానివ్వాలని కోరుతూ నరేంద్ర ఇంటి ఎదుట కుటుంబ సభ్యులు, బంధుమిత్రులతో కలిసి దివ్య మూడు రోజులుగా ఆందోళన సాగిస్తోంది. తహసీల్దారు వి.సురేశ్‌కుమార్, బూర్గంపాడు ఐసీడీఎస్ పీవో ప్రమీలాదేవి, ఎస్సై రాజేశ్ గురువారం బాధితురాలితో మాట్లాడి న్యాయం జరిగేలా చూస్తామని హామీ ఇచ్చారు.
* లంబాడీ హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడు రాజేశ్‌నాయక్, జిల్లా అధ్యక్షుడు రామునాయక్, తెలంగాణ గిరిజన సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లకావత్ వెంకటేశ్వర్లు, గిరిజన విద్యార్థి సంఘం జిల్లా అధికార ప్రతినిధి అనిల్‌నాయక్ తదితరులు దివ్య ఆందోళనకు మద్దతు పలికారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.