logo

పద్మవ్యూహంలో చిక్కుతూ..

మావోయిస్టు రహిత తెలంగాణ లక్ష్యంగా రాష్ట్ర పోలీసులు వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. దీనిలో భాగంగా దండకారణ్యంలో సంయుక్త ఆపరేషన్లకు శ్రీకారం చుట్టారు. తెలంగాణ-ఛత్తీస్‌గఢ్‌ సరిహద్దులో తలదాచుకొంటున్న మావోయిస్టులు

Published : 19 Jan 2022 05:37 IST

ఎదురుదెబ్బలతో మావోయిస్టులు సతమతం

చర్ల, న్యూస్‌టుడే: మావోయిస్టు రహిత తెలంగాణ లక్ష్యంగా రాష్ట్ర పోలీసులు వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. దీనిలో భాగంగా దండకారణ్యంలో సంయుక్త ఆపరేషన్లకు శ్రీకారం చుట్టారు. తెలంగాణ-ఛత్తీస్‌గఢ్‌ సరిహద్దులో తలదాచుకొంటున్న మావోయిస్టులు పద్మవ్యూహంలో చిక్కేలా భద్రతా బలగాలు ప్రణాళికలు రచిస్తున్నారు.  తాజాగా ములుగు జిల్లా సరిహద్దు ఛత్తీస్‌గఢ్‌ అడవుల్లో జరిగిన ఎదురుకాల్పుల్లో ముగ్గురు అనుచరులను ఆ పార్టీ కోల్పోయింది. ఈ ఘటనలో జేఎండబ్ల్యూపీ డివిజన్‌ కమిటీ సభ్యుడు సుధాకర్‌ అలియాస్‌ రఘు అలియాస్‌ మూచికి ఉంగాల్‌ సైతం ఉన్నట్లుగా చివరి వరకు ప్రచారం సాగినా త్రుటిలో ఆయన తప్పించుకున్నట్లు తెలుస్తోంది.

వరుస ఘటనలతో..

ఇటీవల వరుస ఘటనలతో చురుకైన క్యాడర్‌ను కోల్పోవడం తెలంగాణ మావోయిస్టు పార్టీకి పెద్ద ఎదురుదెబ్బగా భావిస్తున్నారు. సుక్మా-దంతెవాడ జిల్లాల్లోని అటవీ ప్రాంతంలో డీఆర్జీ పోలీసులు, మావోయిస్టుల మధ్య జరిగిన మరో ఘటనలో ఏరియా కమిటీ సభ్యురాలు మున్నీ మృతితో ఆ ప్రాంతంలో పార్టీకి నష్టాన్ని మిగిల్చింది.

* చర్ల సరిహద్దులో గత ఏడాది డిసెంబరు 15న బత్తినపల్లి-ఎర్రంపాడు గుట్టల్లో కూంబింగ్‌ ఆపరేషన్‌కు కోసం వెళ్లిన పోలీసు బృందాలే లక్ష్యంగా మావోయిస్టులు అమర్చిన ప్రెషర్‌బాంబు పేలి ఓ కానిస్టేబుల్‌కు తీవ్రగాయాలయ్యాయి. అనంతరం భద్రతాబలగాలు అదును చూసి పెసర్లపాడు మెరుపుదాడికి దిగి దెబ్బకు దెబ్బ తీశాయి. ఈ ఘటనలో ఆరుగురు మావోయిస్టు మిలీషియా సభ్యులు మృతి చెందిన విషయం తెలిసిందే. తాజాగా పొరుగు జిల్లా సరిహద్దు కర్రిగుట్టలో పోలీసుల వేటలో ముగ్గురు మావోయిస్టులు చనిపోయారు. వెంకటాపురం, వాజేడు, ఏటూరునాగారం ఏరియాపై పట్టు సాధించే క్రమంలో దూకుడుగా కార్యకలాపాలు సాగిస్తున్న సుధాకర్‌పై నిఘా పెట్టిన పోలీసులు ఆయన్నే లక్ష్యంగా చేసుకొని కర్రిగుట్ట ఆపరేషన్‌ చేపట్టినట్లుగా తెలుస్తోంది.  

పక్కా ప్రణాళికతో..

దండకారణ్యంలో ఇటీవల భద్రతా బలగాలు పక్కా ప్రణాళికతో అడుగులు వేస్తున్నారు. తెలంగాణ సరిహద్దులో చెన్నాపురం అడవుల్లో కొత్త బేస్‌క్యాంపుతోపాటు దండకారణ్యంలో మరికొన్ని క్యాంపుల ఏర్పాటుతో మావోయిస్టులు అంతర్మథనంలో పడిపోయారు. దీంతో వారు సరిహద్దులో బీభత్సం సృష్టించేందుకు ప్రణాళికలు వేస్తున్నట్లుగా నిఘా వర్గాల ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు ఆ వ్యూహాలను తిప్పికొట్టేందుకు గ్రేహౌండ్స్‌ బలగాలను రంగంలోకి దించి జాయింట్‌ ఆపరేషన్లను కొనసాగిస్తున్నాయి. కొవిడ్‌తో ముఖ్య నేతలు, చురుకైన క్యాడర్‌ను కోల్పోవడం, తీవ్ర నిర్బంధాలు, లొంగుబాట్లతో సతమతమవుతున్న మావోయిస్టులు భవిష్యత్‌ కార్యచరణపై వేస్తున్న అడుగులను ఎప్పటికప్పుడు పసిగడుతున్న పోలీసులు వ్యూహాత్మక దాడులు చేస్తున్నారు.


లక్ష్యం వాళ్లేనా..!

తేడాది ఛత్తీస్‌గఢ్‌లోని తర్రెం అటవీ ప్రాంతంలో జరిగిన మావోయిస్టుల మెరుపుదాడిలో 22 మంది పోలీసులు ప్రాణాలు పోగొట్టుకున్న ఘటన అనతరం దండకారణ్యంలో భద్రతా బలగాలు పదునైన వ్యూహాలతో ముందుకు సాగుతున్నారు. ఆపరేషన్‌ హిడ్మాతోపాటు సరిహద్దులో ఆచితూచి కీలక జాయింట్‌ ఆపరేషన్లు చేస్తున్న భద్రతా బలగాలు మావోయిస్టుల స్థావరాలపై దాడులు చేస్తున్నాయి. తెలంగాణ మావోయిస్టు పార్టీలో చురుకైన బడే చొక్కారావు అలియాస్‌ దామోదర్‌, భద్రాద్రి కొత్తగూడెం-తూర్పుగోదావరి డివిజన్‌ కమిటీ కార్యదర్శి ఆజాద్‌లతోపాటు జేఎండబ్ల్యూపీ డివిజన్‌ కమిటీ సభ్యుడు సుధాకర్‌, చంద్రన్న, లచ్చన్న లాంటి కీలక నేతలను లక్ష్యంగా చేసుకొని భద్రతా బలగాలు తమ ఆపరేషన్లకు పదును పెట్టబోతున్నట్లు విశ్వసనీయంగా తెలుస్తోంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని