logo

ఆటకెళ్లి.. అనంతలోకాలకు..

అల్లారుముద్దుగా పెంచుకున్న పిల్లలు.. స్నేహితులతో ఆడుకుంటామని చెప్పి వెళ్లారు. ఇళ్లకు వస్తారనుకుంటే తిరిగిరాని లోకాలకు వెళ్లారని తల్లిదండ్రులు గుండెలవిసేలా రోదించారు. నగరంలోని బ్రాహ్మణ బజారులో మంగళవారం సాయంత్రం చెట్టు కూలిపడటంతో

Published : 19 Jan 2022 05:48 IST

చిన్నారుల మృతితో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరు


ఆయుష్‌ మృతదేహం వద్ద రోదిస్తున్న తండ్రి ప్రకాశ్‌

ఖమ్మం నేరవిభాగం, న్యూస్‌టుడే: అల్లారుముద్దుగా పెంచుకున్న పిల్లలు.. స్నేహితులతో ఆడుకుంటామని చెప్పి వెళ్లారు. ఇళ్లకు వస్తారనుకుంటే తిరిగిరాని లోకాలకు వెళ్లారని తల్లిదండ్రులు గుండెలవిసేలా రోదించారు. నగరంలోని బ్రాహ్మణ బజారులో మంగళవారం సాయంత్రం చెట్టు కూలిపడటంతో ఇద్దరు చిన్నారులు మృత్యువాత  పడగా నలుగురు ప్రాణాపాయం నుంచి బయటపడ్డారు.

మరో మూడు రోజుల్లో  పుట్టినరోజు

మరో మూడురోజుల్లో(ఈనెల 22న) మల్వాడి దిగాంత్‌శెట్టి(11) పుట్టినరోజు వేడుకలను జరిపేందుకు  రెండు రోజుల నుంచి తల్లిదండ్రులు ఎంతో సంతోషంగా షాపింగ్‌ చేస్తున్నారు. దిగాంత్‌కు ఇష్టమైన వస్తువులు, దుస్తులు కొనుగోలు చేస్తున్నారు. పెళ్లైన ఐదేళ్లకు పుట్టిన ఏకైక సంతానం కావడంతో కుమారుడంటే ఎనలేని ప్రేమ. దీంతో వారు జన్మదిన వేడుకలను ఎంతో ఘనంగా నిర్వహించాలని సన్నాహాలు చేసుకుంటున్నారు. ఇంతలోనే తన కొడుకు దూరమయ్యాడని తెలిసి వారు బోరున విలపించారు. కర్నాటక రాష్ట్రానికి చెందిన మల్వాడి దినకర్‌శెట్టి, షీల దంపతులు పదిహేనేళ్ల క్రితం ఖమ్మం వచ్చి స్థిరపడ్డారు. దినకర్‌శెట్టి ఖమ్మంలోని ఓ ఉడిపి హోటల్‌లో క్యాషియర్‌గా పనిచేస్తున్నాడు.

సెలవుల్లో  ఇంటి వద్దే ఉంటూ..

పాఠశాలలకు సెలవులు ఇవ్వడంతో పిల్లలంతా ఇళ్ల వద్దే ఉంటున్నారు. వారంతా బ్రాహ్మణబజారుకు చెందిన 12ఏళ్లలోపు చిన్నారులు. రోజులాగే ఆడుకోవడానికి బయటకు వెళ్లారు. ఒకటి, ఆరో తరగతులు చదువుతున్న రాజ్‌పుత్‌ ఆయుష్‌, మల్వాడి దిగాంత్‌, కంచర్ల సాయిఆర్యన్‌(4వ), కొల్లపల్లి సాకేత్‌(7వ), రాజ్‌పుత్‌ అనుమోలు(3వ), చరణ్‌సాయి(7వ) సాయంత్రం ఆ ప్రాంతంలో ఒక వస్త్రదుకాణానికి సంబంధించిన ఖాళీ స్థలంలో క్రికెట్‌ ఆడుకుంటున్నారు. ఈ స్థలం 20 రోజుల క్రితం వరకు మూసి ఉండగా, ఇటీవలే వాహనాల పార్కింగ్‌ కోసం తెరిచారు.  

కూలిన చెట్టును తొలగిస్తున్న అగ్నిమాపక, నగరపాలక సిబ్బంది

గోడ నాని  కూలిన చెట్టు

శిథిల గోడపై రావి చెట్టు పెరిగి పెద్దదైంది. పక్కనే మరో చిన్న చెట్టుంది. ఇటీవల వర్షాలకు గోడ నానింది. అటువైపు వెళ్లిన బంతిని వెదుతుకుతున్న సమయంలోనే వేళ్లతో సహా చెట్టుకూలి కొమ్మలు, గోడ మీదపడటంతో దిగాంత్‌శెట్టి, ఆయుష్‌ అక్కడికక్కడే మృతి చెందారు. ఆయుష్‌పై చెట్టు కాండం పడటంతో తల మట్టిలో కూరుకపోయింది. దాన్ని తొలగించడం ఆలస్యం కావడంతో ఊపిరాడక అక్కడిక్కడే మృతిచెందాడని స్థానికులు చెబుతున్నారు. మిగిలిన వారిపై గోడ పెచ్చులు, చెట్టుకొమ్మలు పడటంతో గాయాలయ్యాయి. వారిలో అనుమోలు తలకు, చరణ్‌సాయికి కాలుకి తీవ్రగాయాలు కాగా సాయిఆర్యన్‌, కొల్లపల్లి సాకేత్‌కు గాయాలయ్యాయి. సాకేత్‌ పరిస్థితి విషమించడంతో రాత్రి హైదరాబాద్‌ తరలించినట్లు సమాచారం. పోలీసులు, మున్సిపల్‌ సిబ్బంది సంఘటనా స్థలానికి అరగంట ఆలస్యంగా రావడంతో అప్పటికే స్థానికులు శిథిలాలను పక్కకు జరిపి క్షతగాత్రులను రక్షించారు. పోలీసులు అక్కడకు చేరుకున్న తర్వాత మృతదేహాలను తీశారు.  గాయపడిన పిల్లలను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. సంఘటనపై వన్‌టౌన్‌ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

* సంఘటనా స్థలాన్ని ఖమ్మం నగర మేయర్‌ పునుకొల్లు నీరజ, మున్సిపల్‌ కమిషనర్‌ ఆదర్శ్‌ సురభి, అడిషనల్‌ డీసీపీ గౌస్‌ఆలం, శిక్షణ కలెక్టర్‌ రాహుల్‌, జిల్లా అగ్నిమాపక శాఖ అధికారి జయప్రకాశ్‌ పరిశీలించారు.


మా తమ్ముడు కొమ్మల కిందే ఉన్నాడు..

మా తమ్ముడు కొమ్మల కిందే ఉన్నాడు. బయటకు తీయండి అంటూ ఆయుష్‌ అన్న అనుమోల్‌ ఆక్రందించాడు. రాజస్థాన్‌ రాష్ట్రానికి చెందిన ప్రకాశ్‌ పురోహిత్‌, కళావతి దంపతుల కుమారులు ఆయుష్‌, అనుమోల్‌. ఖమ్మం రైల్వే స్టేషన్‌రోడ్డులో ప్రకాశ్‌ కళ్లజోళ్ల దుకాణం నిర్వహిస్తూ జీవనం సాగిస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని