logo

గమ్యం అంచున ఆగిన పయనం

వైరా మండలంలోని స్నానాలలక్ష్మీపురంలో తన బంధువుల ఇంట జరిగే దశదిన కార్యక్రమానికి చింతకాని మండలం పందిళ్లపల్లికి చెందిన ఏసు దుర్గ(45) తన మరిది ప్రసాద్‌ బండిపై సోమవారం బయల్దేరింది. కొణిజర్ల మండలం పల్లిపాడు దాటగానే

Published : 25 Jan 2022 04:06 IST

వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ముగ్గురి మృతి

వైరా, కొణిజర్ల, న్యూస్‌టుడే: తాము ఒకటి తలిస్తే విధి ఇంకోటి తలచింది. గమ్యానికి కొద్ది దూరంలో ఉండగా చోటుచేసుకున్న వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ముగ్గురు వ్యక్తులు అసువులు బాశారు. పది కిలోమీటర్ల దూరంలోపే ఈ ఘటనలు చోటుచేసుకోవటం గమనార్హం. మృతుల్లో ఇద్దరు మహిళలు. సమీప బంధువుల దశదిన కార్యక్రమంలో పాల్గొనేందుకు వెళ్తుండగా ఒకరు, కుమార్తెను తీసుకుని ఇల్లు చేరే సమయంలో ఇంకొకరు ప్రమాదంలో బలయ్యారు. విధి నిర్వహణకు వెళ్తూ రాత్రివేళ గుర్తుతెలియని వాహనం ఢీకొని మరో వ్యక్తి మృతి చెందాడు.


కర్మకు వెళ్తుండగా..

ఏసు దుర్గ(పాతచిత్రం)

వైరా మండలంలోని స్నానాలలక్ష్మీపురంలో తన బంధువుల ఇంట జరిగే దశదిన కార్యక్రమానికి చింతకాని మండలం పందిళ్లపల్లికి చెందిన ఏసు దుర్గ(45) తన మరిది ప్రసాద్‌ బండిపై సోమవారం బయల్దేరింది. కొణిజర్ల మండలం పల్లిపాడు దాటగానే ఎగుడు దిగుడుగా ఉన్న ప్రాంతంలో ద్విచక్ర వాహనం అదుపు తప్పడంతో దుర్గ రోడ్డుపై పడిపోయింది. అదే సమయంలో వెనకనుంచి వస్తున్న లారీ ఆమెపై ఎక్కి కొద్ది దూరం ఈడ్చుకు వెళ్లడంతో శరీరం చూడలేనంత దారుణంగా ఛిద్రమై అక్కడికక్కడే మృతి చెందింది. పది నిమిషాల్లో గమ్యం చేరుతుందనగా ఊహించని ప్రమాదంలో విగత జీవిగా మారింది. అన్నం ఫౌండేషన్‌ నిర్వాహకులు మృతదేహాన్ని ఖమ్మంలోని ప్రభుత్వాసుపత్రికి తరలించారు. మృతురాలికి భర్త, ఇద్దరు కుమారులున్నారు. కొణిజర్ల పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.


కుమార్తెను తీసుకెళ్తూ..

కృష్ణకుమారి

కుమార్తెను ఇంటికి తీసుకెళ్తుండగా చోటుచేసుకున్న రోడ్డు ప్రమాదంలో ఓ మహిళ విగత జీవిగా మారింది. ఈ ఘటన వైరా సమీపంలోని శాంతినగర్‌ వద్ద సోమవారం చోటుచేసుకుంది. ఖమ్మం నుంచి వైరా మండలం పాలడుగు వెళ్తున్న ద్విచక్ర వాహనం, వెనక నుంచి వస్తున్న మరో ద్విచక్ర వాహనం ప్రమాదవశాత్తూ ఢీకొన్నాయి. ఘటనలో పాలడుగు వెళ్లే వాహనంపై వెనక కూర్చున్న కేసగాని కృష్ణకుమారి (38) రోడ్డుపై పడి తలకు బలమైన గాయాలయ్యాయి. ఆమెను ఖమ్మం తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందింది. కూతురి చదువు కోసం ఖమ్మంలో ఉంటున్న వీరి కుటుంబం స్వగ్రామం వెళ్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. మృతురాలికి భర్త, ఇద్దరు కుమార్తెలున్నారు. ప్రమాద సమయంలో భర్త నర్సింహారావు బండి నడుపుతుండగా మధ్యలో కుమార్తె కూర్చుంది. సెలవులు కావటంతో స్వగ్రామానికి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. మరో వాహనంపై ఉన్న మహిళకు స్వల్ప గాయాలయ్యాయి.


గుర్తుతెలియని వాహనం ఢీకొని..

నారపోగు రాయప్ప

తనికెళ్ల సమీపంలో గుర్తు తెలియని వాహనం ఢీకొని సోమవారం రాత్రి వ్యక్తి చనిపోయాడు. తనికెళ్లకు చెందిన నారపోగు రాయప్ప(38) ఓ ప్రయివేటు కళాశాలలో వాచ్‌మెన్‌గా పని చేస్తున్నాడు. విధి నిర్వహణలో భాగంగా రాత్రి 8.30 గంటల సమయంలో గ్రామం నుంచి కళాశాలకు కాలినడకన వెళ్తుండగా గుర్తు తెలియని వాహనం ఢీకొంది. తీవ్ర గాయాలైన అతను అక్కడికక్కడే మృతిచెందాడు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని