logo

జోరుగా జీరో వ్యాపారం

ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో మిరప ఖరీదుదారుల హవా కొనసాగుతోంది. కొంతమంది ఇష్టారాజ్యంగా కొనుగోళ్లు చేస్తున్నారు. మార్కెట్‌ పాలకవర్గాన్నిగానీ, అధికారులనుగానీ వీరు పెద్దగా పట్టించుకోరు.

Published : 25 Jan 2022 04:29 IST

 ప్రభుత్వ ఆదాయానికి భారీగా గండి

ఖమ్మం వ్యవసాయం, న్యూస్‌టుడే

ఖమ్మం మార్కెట్‌కు వచ్చిన మిరప బస్తాలు

ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో మిరప ఖరీదుదారుల హవా కొనసాగుతోంది. కొంతమంది ఇష్టారాజ్యంగా కొనుగోళ్లు చేస్తున్నారు. మార్కెట్‌ పాలకవర్గాన్నిగానీ, అధికారులనుగానీ వీరు పెద్దగా పట్టించుకోరు. నిబంధనలను అమలు చేయరు. దడవాయిల ప్రమేయం లేకుండానే నేరుగా విపణిలో కొనుగోళ్లు జరిపి సరకు తరలిస్తారు. ఈ సరకుకు పన్ను చెల్లించకపోవటం వల్ల మార్కెట్‌ పెద్ద మొత్తంలో ఆదాయం కోల్పోతోంది. మార్కెట్‌ కమిటీ లోపాలను ఆసరా చేసుకుని  సాగిస్తున్న జీరో దందాపై ‘న్యూస్‌టుడే’ ప్రత్యేక కథనమిదీ.

‘ఈ-టామ్‌’ విధానం..

మిరపలో ఈ-నామ్‌ విధానం అమలు సాధ్యం కాకపోవటంతో ప్రభుత్వం ఈ-టామ్‌’(తెలంగాణ అగ్రికల్చరల్‌ మార్కెటింగ్‌ ఎక్స్ఛేంజ్‌) విధానం అమల్లోకి తెచ్చింది. ప్రస్తుతం ఈ విధానం ద్వారానే కొనుగోళ్లు జరుగుతున్నాయి. దడవాయిలు రైతుల సరకు వివరాలను పీవోఎస్‌ మిషన్లలో నమోదు చేస్తారు. పీవోఎస్‌ మిషన్ల సమాచారం ‘ఈ-టామ్‌’కు అనుసంధానం చేసి ఉంటుంది. దీనివల్ల విపణిలో కొనుగోళ్లు పారదర్శకంగా ఉంటాయి. ఈనామ్‌ అమలు చేసిన మొదటి సంవత్సరం 2015లో 89 మంది దడవాయిలకు 89 పీవోఎస్‌ మిషన్లను సరఫరా చేశారు. అంతకు ముందు కాంటాలు మాన్యువల్‌ పద్ధతిలో జరిగేవి. పీవోస్‌ మిషన్లు వచ్చిన తర్వాత దాదాపు విపణిలో మాన్యువల్‌ పద్ధతి పూర్తిగా రద్దయ్యింది.

సాంకేతిక సమస్యలతో..

పీవోఎస్‌ మిషన్లలో ఇప్పుడు అనేక సాంకేతిక సమస్యలు తలెత్తి తరచూ మరమ్మతులకు గురవుతున్నాయి. బ్యాటరీ ఛార్జింగ్‌ ఆగటం లేదు. దీంతో దడవాయిలు కాంటాలు ఆపి ఛార్జింగ్‌ పెట్టుకునేందుకు వెళ్తుండటంతో జాప్యం జరుగుతోంది. ఇలా ప్రతి రోజూ ఇదే సమస్య నెలకొంటోంది. ఎన్నిసార్లు వీటికి మరమ్మతులు చేసినా సమస్య మాత్రం పరిష్కారం కావడం లేదు. సుమారు ఆరేళ్లు కావటంతో వీటి లైఫ్‌టైమ్‌ కూడా దగ్గరపడింది.

దడవాయిలు లేకుండా కొనుగోళ్లు

ఛార్జింగ్‌ కోసం దడవాయిలు వెళ్లే సమయాన్ని మార్కెట్‌లోని ఖరీదుదారులు సొమ్ము చేసుకుంటున్నారు. నిబంధనల ప్రకారం దడవాయి కాంటా వేస్తేనే దానికి తక్‌ పట్టీ వస్తుంది. సరకుకు చట్టబద్ధత ఉంటుంది. రైతుకు సంబంధించిన పూర్తి వివరాలు ఈ-టామ్‌ పోర్టల్‌లో నమోదై ఉంటాయి. ఇలాంటివేవీ పట్టించుకోకుండా కొంత మంది ఖరీదుదారులు దడవాయిల ప్రమేయం లేకుండా సొంత మనుషులతో మాన్యువల్‌గా కాంటాలు వేయించుకుని రైతులకు తెల్లకాగితంపై వివరాలు రాసి ఇస్తున్నారు. ఇలాంటి వాటి వల్ల రైతుకు ఏదైనా ప్రమాదం జరిగితే బీమా కూడా వర్తించే అవకాశం ఉండదు. తక్‌పట్టీ లేకుండా మార్కెట్‌లో సరకు అమ్మనట్లు ఎలాంటి ఆధారం ఉండదు. వ్యాపారి మార్కెట్‌కు చెల్లించాల్సిన ఒక శాతం పన్ను నుంచి కూడా తప్పించుకుంటున్నాడు. ఇలా నిత్యం జరిగే వ్యాపారం వల్ల మార్కెట్‌ పెద్ద మొత్తంలో ఆదాయం కోల్పోతోంది. ఉదాహరణకు సోమవారం మార్కెట్‌కు సుమారు 30వేల బస్తాలకు పైగా సరకు వచ్చింది. కానీ అధికారులు చూపించిన లెక్కల్లో మాత్రం సుమారు 21వేల బస్తాలే ఉండటం విశేషం. మిరప సీజన్‌లో బడా ఖరీదు వ్యాపారులు చేసే మాయాజాలం అంతుపట్టకుండా ఉంటుంది.

పారదర్శకంగానే మిర్చి కొనుగోళ్లు: ఆర్‌.మల్లేశం, ఖమ్మం వ్యవసాయ మార్కెట్‌ ఉన్నతశ్రేణి కార్యదర్శి.

మిరపలో జీరో అనేది అబద్ధం. ఖరీదుదారులు నేరుగా కాంటాలు వేసుకోవటం జరగదు. దడవాయిలు ఛార్జింగ్‌ పెట్టుకునేందుకు వెళ్లినప్పుడు ఆలస్యం జరుగుతుందనే ఉద్దేశంతో ఒకటి రెండు క్వింటాళ్ల తాలు బస్తాలు వేసుకుంటారు తప్ప సరకును వారే కాంటాలు వేయరు. అదీ ఒకరిద్దరు వ్యాపారులు మాత్రమే చేసే అవకాశం ఉంది. పీవోస్‌ మిషన్ల కోసం ఆర్డరు పెట్టాం. యార్డులో అన్ని కొనుగోళ్లు నిబంధనల ప్రకారం పారదర్శకంగా జరుగుతున్నాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని