logo

గులాబీ సారథులుగా తాతా, రేగా

క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేసే దిశగా అధికార తెరాస.. మరో ముందడుగు వేసింది. 2023 ఎన్నికలకు ఇప్పటి నుంచే సమాయత్తమవుతున్న గులాబీ పార్టీ క్షేత్రస్థాయిలో పటిష్ట కార్యాచరణతో ముందుకెళ్తోంది. రాష్ట్ర ఆవిర్భావం తర్వాత తొలిసారి జిల్లా పార్టీకి అధ్యక్షులను నియమిస్తూ పార్టీ అధినేత, సీఎం కేసీఆర్‌ నిర్ణయం తీసుకున్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాకు ఇద్దరు

Published : 27 Jan 2022 03:58 IST

ఈటీవీ, ఖమ్మం

సీఎం కేసీఆర్‌ను కలిసిన  మంత్రి సత్యవతి రాథోడ్‌, ఎమ్మెల్సీలు తాతా మధుసూదన్‌,

పల్లా రాజేశ్వర్‌రెడ్డి, కోరం కనకయ్య, ఎమ్మెల్యే రేగా కాంతారావు

క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేసే దిశగా అధికార తెరాస.. మరో ముందడుగు వేసింది. 2023 ఎన్నికలకు ఇప్పటి నుంచే సమాయత్తమవుతున్న గులాబీ పార్టీ క్షేత్రస్థాయిలో పటిష్ట కార్యాచరణతో ముందుకెళ్తోంది. రాష్ట్ర ఆవిర్భావం తర్వాత తొలిసారి జిల్లా పార్టీకి అధ్యక్షులను నియమిస్తూ పార్టీ అధినేత, సీఎం కేసీఆర్‌ నిర్ణయం తీసుకున్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాకు ఇద్దరు కొత్త అధ్యక్షులను ప్రకటించారు. ఖమ్మం జిల్లా సారథిగా ఎమ్మెల్సీ తాతా మధుసూదన్‌, భద్రాద్రి కొత్తగూడెం తెరాస జిల్లా అధ్యక్షునిగా పినపాక ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్‌ రేగా కాంతారావును నియమిస్తున్నట్లు కేసీఆర్‌ ప్రకటించారు. పార్టీ బలోపేతంపై చాలా రోజులుగా సుదీర్ఘ కసరత్తు చేస్తున్న కేసీఆర్‌.. జిల్లాలో పార్టీ బలోపేతానికి తీసుకోవాల్సిన చర్యలతోపాటు జిల్లా నేతల మధ్య విబేధాల నేపథ్యంలో ఆచితూచి అడుగులు వేశారు. ఉభయ జిల్లాల్లో ముఖ్య నేతల నుంచి పార్టీ అధ్యక్షుల ఎంపికపై అభిప్రాయాలు తీసుకున్నారు. రెండు జిల్లాల్లోనూ భారీగానే ఆశావహుల జాబితా పార్టీ అధిష్ఠానానికి చేరింది. అయితే.. రాష్ట్రవ్యాప్తంగా చాలా వరకు ప్రజాప్రతినిధులకే జిల్లా పార్టీ బాధ్యతలు అప్పగించిన పరిస్థితుల్లో ఖమ్మం, భద్రాద్రి జిల్లాల్లోనూ అదే ఒరవడిని కొనసాగించారు. కొత్త అధ్యక్షుల నియామకం ఉమ్మడి ఖమ్మం జిల్లా గులాబీ శ్రేణుల్లో కొత్త జోష్‌ నింపుతోంది.

సయోధ్య కుదిరేనా!

వీరి నియామకం ఉమ్మడి ఖమ్మం జిల్లా తెరాసలో ఎలాంటి పరిణామాలకు దారి తీస్తాయన్న చర్చ రాజకీయ వర్గాల్లో సాగుతోంది. ఇప్పటికే గులాబీ దళంలో కొందరు నేతలు  ఎన్నికలు వచ్చినప్పుడు తప్ప మరెప్పుడూ  వేదికలు పంచుకున్న సందర్భాలు తక్కువే. ఏ నియోజవర్గానికి వారే అన్నట్లుగా నేతలు ప్రభుత్వ, పార్టీ కార్యక్రమాలు నడుపుతున్నారు. కొందరు నేతలు పార్టీ కార్యక్రమాలకు అంటీ ముట్టనట్లుగానే ఉన్నారు. ఇతర పార్టీల నుంచి వచ్చిన నేతలు, మాజీ ఎమ్మెల్యేల మధ్య గ్రూపు రాజకీయాలకు కొదవే లేదు. ఈ పరిణామాలన్నింటి నేపథ్యంలో కొత్త సారథుల బాధ్యతలు కీలకం కానున్నాయి. పార్టీని బలోపేతం చేయాలంటే ముఖ్య నేతలందరినీ ఒకేతాటిపైకి తేవాల్సిన అవసరం ఉంది. కొత్త సారథులపై గురుతర బాధ్యత ఉందన్నది పార్టీ వర్గాల్లో సాగుతున్న చర్చ. పార్టీని బలోపేతం చేయడం ఒక ఎత్తయితే.. జిల్లాలో నేతలను ఏకతాటిపైకి తీసుకు రావడంలో జిల్లా సారథులు ఎలా సఫలీకృతమవుతారన్నది సర్వత్రా ఉత్కంఠ రేపుతుంది.

ఇద్దరికీ జోడు పదవులు

జిల్లా సారథులుగా ఎంపికైన ఇద్దరు నేతలను జోడు పదవులు వరించాయి. ఇటీవలే జరిగిన ఎన్నికల్లో ఎమ్మెల్సీగా తాతా మధుసూదన్‌ గెలిచిశాసనమండలి సభ్యుడిగా ఇటీవలే ప్రమాణ స్వీకారం చేశారు. కొద్దిరోజుల్లోనే జిల్లా పార్టీ అధ్యక్ష పదవి వరించడం గమనార్హం. ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెం మండలం పిండిప్రోలుకు చెందిన ఆయన రాష్ట్ర ఆవిర్భావం తర్వాత తెరాసలో చేరి వివిధ పదవులు అనుభవించారు. జిల్లా పార్టీ అధ్యక్ష పదవి బీసీలకు దక్కుతుందని భావించారు. కానీ..ఎవరూ ఊహించని రీతిలో తాతా మధుసూదన్‌ వైపే పార్టీ మొగ్గుచూపింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షునిగా నియమించిన రేగా కాంతారావు పినపాక ఎమ్మెల్యేగా, ప్రభుత్వ విప్‌గానూ పనిచేస్తున్నారు. కోయ సామాజిక వర్గానికి చెందిన రేగా కాంతారావు 2018 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ అభ్యర్థిగా విజయం సాధించారు. మారిన రాజకీయ పరిణామాల్లో తెరాస తీర్థం పుచ్చుకోగా.. ప్రభుత్వ విప్‌ పదవి దక్కింది. తాజాగా భద్రాద్రి జిల్లా అధ్యక్షుడి రూపంలో మరోసారి రేగా కాంతారావును అదృష్టం వరించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని