logo

ప్రభుత్వ పాఠశాలలకు మహర్దశ

ప్రభుత్వ పాఠశాలల సమగ్రాభివృద్ధి, పటిష్టమైన మౌలిక సదుపాయాల కోసం విద్యాశాఖలో ’మన ఊరు- మన బడి’ కార్యక్రమానికి కేబినెట్‌ ఇటీవల ఆమోదం తెలిపింది. ఉమ్మడి జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు నాణ్యమైన విద్య, 

Published : 28 Jan 2022 05:14 IST

మౌలిక వసతుల కల్పనకు పెద్ద పీట

తీరనున్న విద్యార్థుల వెతలు

పూర్తి శిథిలావస్థకు చేరిన మణుగూరు ఉన్నత పాఠశాల

మణుగూరు సాంస్కృతికం, న్యూస్‌టుడే: ప్రభుత్వ పాఠశాలల సమగ్రాభివృద్ధి, పటిష్టమైన మౌలిక సదుపాయాల కోసం విద్యాశాఖలో ’మన ఊరు- మన బడి’ కార్యక్రమానికి కేబినెట్‌ ఇటీవల ఆమోదం తెలిపింది. ఉమ్మడి జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు నాణ్యమైన విద్య,  హాజరు కొనసాగింపుతోపాటు డిజిటల్‌ విద్యా విధానాన్ని ప్రవేశపెట్టి అభ్యసన సామర్థ్యాలను మెరుగు పరచనున్నారు. ఈ నిర్ణయం వల్ల ప్రభుత్వ పాఠశాలలకు ఇక మహర్దశ పట్టనుంది. ప్రస్తుతం అనేక పాఠశాలలు సమస్యలతో కునారిల్లుతున్నాయి. ప్రధానంగా తరగతి గదులు, తాగునీటి సౌకర్యం, శౌచాలయాలు సరిపోయినన్ని లేకపోవటం లాంటి సమస్యలు ఎక్కువగా ఉన్నాయి. ఈ కార్యక్రమాన్ని ప్రజల భాగస్వామ్యంతో పారదర్శకంగా, అన్ని పనులు వేగంగా అమలుకు పాఠశాల నిర్వహణ కమిటి(ఎస్‌ఎంసీ)లకు బాధ్యతలు అప్పగిస్తారు.

జిల్లాలో 1,036 ప్రభుత్వ పాఠశాలలున్నాయి. కొవిడ్‌ కారణంగా రెండేళ్లుగా బోధన కుంటుపడింది. దీనికి తోడు వసతుల లేమి వేధిస్తోంది. తరగతి గదులు వినియోగంలోలేక చాలా వరకు శిథిలావస్థకు చేరాయి. మరమ్మతులు చేయకపోవడంతో ఎప్పుడే ప్రమాదం జరుగుతుందో తెలియని పరిస్థితి. ప్రహరీలు, తాగునీటి వసతి లేకపోవడం, తలుపులు, కిటికీలు, బల్లలు విరిగిపోవడంతో చదువులెలా కొనసాగించాలో ప్రశ్నార్థకంగా మారింది. ఏళ్లుగా విద్యాశాఖ ప్రతిపాదనలు సిద్ధం చేసి ప్రభుత్వానికి పంపుతున్నా.. నిధుల విడుదలలో నిర్లక్ష్యం నెలకొంటోంది. మరుగుదొడ్లు, మూత్రశాలలు లేక సమస్య ఎదురవుతోంది. విద్యార్థులు అధికశాతం బల్లలు లేక కింద కూర్చునే పాఠాలు వింటున్నారు.


చదువు‘కొనే’ పరిస్థితి లేకుండా..

జిల్లాలో పేద, మధ్యతరగతి వర్గాలు ఒకరిని చూసి మరొకరు ప్రైవేటు విద్యాసంస్థల్లో పిల్లల్ని చేర్పిస్తున్నారు. స్థోమత లేకున్నా పిల్లల భవిష్యత్తు కోసం అప్పులు చేసి మరీ చదివిస్తున్నారు. కార్పొరేట్‌ విద్యాసంస్థల్లో రుసుముల సంగతి చెప్పక్కర్లేదు. కొవిడ్‌ వేళ ఆర్థిక సమస్యలతో ప్రభుత్వ పాఠశాలల్లో తమ పిల్లలను చేర్పించేందుకు తల్లిదండ్రులు మొగ్గు చూపారు. దీంతో గణనీయంగా విద్యార్థుల సంఖ్య పెరిగింది. అందుకు అనుగుణంగా సౌకర్యాలు లేవు. మరమ్మతులు, రుసుముల నియంత్రణపై సర్కారు తీసుకున్న నిర్ణయంతో విద్యార్థుల తల్లిదండ్రుల్లో ఆనందం వ్యక్తమవుతోంది.


గ్రామీణ విద్యార్థులకు ప్రోత్సాహం..

జిల్లాలోని కొన్ని పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమం అమలవుతోంది. నేటి పోటీ ప్రపంచంలో పిల్లల్ని తెలుగు చదివించాలంటే తల్లిదండ్రులు విముఖత చూపుతున్నారు. ప్రస్తుతం ప్రాథమిక, ఉన్నత స్థాయిలో చదివే బడులకే ఆంగ్ల మాధ్యమం అనుమతించారు. వచ్చే విద్యా సంవత్సరం నుంచి అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ప్రవేశపెట్టాలని నిర్ణయం తీసుకుంది. గ్రామీణ విద్యార్థులను ప్రోత్సహించేలా చర్యలు చేపడుతున్నారు.


ముఖ్యాంశాలు...

* సాంకేతిక విజ్ఞాన ఆధారిత విద్యను అందించటం కోసం డిజిటల్‌ తరగతుల ఏర్పాటు, అదనపు తరగతి గదుల నిర్మాణం, గదులకు మరమ్మతులు, అవసరమైన మేరకు ఫర్నీచర్‌ ఏర్పాటు, శౌచాలయాలు, ఇతర వసతుల కల్పిన ఈప్రణాళిక ముఖ్య ఉద్దేశం.

* ఈ కార్యక్రమాన్ని ప్రభుత్వం చేపట్టి మూడు దశల్లో మూడేళ్ల వ్యవధిలో విద్యాశాఖ పరిధిలోని ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులను మెరుగు పరచటం.

* 2021-22 విద్యా సంవత్సరం మొదటి దశలో మండల కేంద్రాన్ని యూనిట్‌గా తీసుకుని అన్ని రకాల(ప్రాథమిక, మాధ్యమిక, ఉన్నత) పాఠశాలల్లో అత్యధిక నమోదు అయిన ప్రభుత్వ, స్థానిక సంస్థల పాఠశాలల్లో ముందుగా దీన్ని అమలు చేస్తారు.

* ప్రతి పాఠశాలలో పూర్వ విద్యార్థుల సంఘాలను ఏర్పాటు చేసి ఇందులో ఇద్దరు క్రియాశీలక సభ్యులను, సర్పంచి, ఇద్దరు పాఠశాల నిర్వహణ కమిటీ సభ్యులు, పాఠశాల ప్రధానోపాధ్యాయుడితో కూడిన ఒక కమిటీని ఏర్పాటు చేస్తారు. దాతలు, సీఎస్‌ఆర్‌ నిధులు తదితర మార్గాల ద్వారా అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాల్సి ఉంటుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని