logo

ముచ్చట చెప్పొద్దు.. బాధ్యతతో మెలగాలి

వైద్యులు,  సిబ్బంది అంకితభావంతో వృత్తి ధర్మాన్ని నిర్వర్తించాలని రాష్ట్ర వైద్యారోగ్యశాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు సూచించారు. ఖమ్మం జడ్పీ సమావేశ మందిరంలో శుక్రవారం భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం జిల్లాల వైద్యారోగ్య పనితీరు, కొవిడ్‌ వ్యాక్సినేషన్‌, ఇంటింటి

Published : 29 Jan 2022 06:06 IST

 ఉమ్మడి జిల్లా వైద్యారోగ్యశాఖ పనితీరుపై మంత్రి హరీశ్‌రావు అసహనం


క్యాథ్‌ల్యాబ్‌ యంత్రాన్ని పరిశీలిస్తున్న మంత్రులు హరీశ్‌రావు, అజయ్‌కుమార్‌, ఎంపీ నామా, కలెక్టర్‌ గౌతమ్‌, ఎమ్మెల్యే రాములునాయక్‌, జడ్పీ ఛైర్మన్‌ కమల్‌రాజు, మేయర్‌ నీరజ, వైద్యాధికారులు 

ఈటీవీ, ఖమ్మం: వైద్యులు,  సిబ్బంది అంకితభావంతో వృత్తి ధర్మాన్ని నిర్వర్తించాలని రాష్ట్ర వైద్యారోగ్యశాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు సూచించారు. ఖమ్మం జడ్పీ సమావేశ మందిరంలో శుక్రవారం భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం జిల్లాల వైద్యారోగ్య పనితీరు, కొవిడ్‌ వ్యాక్సినేషన్‌, ఇంటింటి జ్వర సర్వే, ఆస్పత్రిలో ప్రసవాలు, మహిళలు, కిశోర బాలికల్లో రక్తహీనత తదితర అంశాలపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉమ్మడి జిల్లాలోని వైద్యారోగ్య శాఖలో కనిపిస్తున్న లెక్కలు, నివేదికలు అధికారుల నిర్లక్ష్యానికి అద్దం పడుతున్నాయన్నారు. ప్రభుత్వాస్పత్రుల్లో సాధారణ కాన్పుల కన్నా ఆపరేషన్లు ఊహించని స్థితిలో సాగుతున్నాయని ఒక్క మాతాశిశు సంరక్షణ కేంద్రంలోనే ఇప్పటి వరకు 5 వేల మంది తల్లులు,  పిల్లలకు ఆపరేషన్ల రూపంలో అన్యాయం చేశారని మండిపడ్డారు. రాష్ట్రమంతటా 80 శాతం సాధారణ ప్రసవాలు, 20 శాతం శస్త్రచికిత్సలు ఉంటే.. ఉమ్మడి జిల్లాలో పరిస్థితి దీనికి విరుద్ధంగా ఉందని ఇది చూసి మనమంతా సిగ్గుపడాలని అసహనం వ్యక్తం చేశారు. ఖమ్మం జిల్లాలో 81 శాతం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 87 శాతం మంది గర్భిణీలు రక్తహీనతతో బాధపడుతున్నా ఎందుకు పట్టించుకోవడం లేదన్నారు. కలెక్టర్లు దీనిపై ఎందుకు దృష్టి సారించడంలేదని ప్రశ్నించారు.  
ఇకనైనా మారాలి..

ఉభయ జిల్లాల్లో ప్రభుత్వ రంగ వైద్యారోగ్య సేవలు మరింత మెరుగు పరచాలని వైద్యాధికారులను ఆదేశించారు. వైద్యారోగ్య శాఖపై సీఎం కేసీఆర్‌ ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నారని, రాష్ట్రంలో వైద్య విద్య అభివృద్ధికి 18 ప్రభుత్వ వైద్య కళాశాలలను ఒక్కొక్కటి రూ.5 కోట్ల ఖర్చుతో ఏర్పాటు చేసుకుంటున్నట్లు చెప్పారు. ఉభయ జిల్లాల్లోని ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రసవాల సంఖ్య మరింత పెంచాలన్నారు. ప్రతీ నెలా జిల్లా మంత్రితోపాటు కలెక్టర్లు, జిల్లావైద్యారోగ్య శాఖ అధికారులు గర్భిణులతో టెలీ కాన్ఫరెన్సు నిర్వహించి ఆరోగ్య పరిస్థితులు తెలుసుకుని వారికి అవసరమైన సలహాలు, సూచనలు ఇవ్వాలన్నారు. జిల్లాలో కల్తీ విక్రయాలు అరికట్టేందుకు ఫుడ్‌ ఇన్స్‌పెక్టర్లు కృషిచేయాలని ఆదేశించారు. కాలపరిమితి దాటిన ఔషధాల విక్రయాలు జరగకుండా డ్రగ్‌ ఇన్స్‌పెక్టర్లు తనిఖీలు చేపట్టాలన్నారు. మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ మాట్లాడుతూ ఉభయ జిల్లాల్లో కొవిడ్‌ కట్టడి చర్యలు సమర్థంగా చేపట్టామన్నారు. రెండు జిల్లాల్లోనూ రెండో డోసు వ్యాక్సినేషన్‌ వంద శాతం పూర్తి చేసేలా అధికారులు, వైద్య సిబ్బంది పనిచేయాలని సూచించారు. ఈ సందర్భంగా జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిలో కీమోథెరపీ, రేడియోథెరపీ సౌకర్యం కల్పించాలని మంత్రి హరీశ్‌రావును పువ్వాడ కోరారు. ఆస్పత్రికి ఎంఆర్‌ఐ సౌకర్యం కల్పించాలని, ప్రభుత్వ ఆస్పత్రి శవాగారాన్ని ఆధునికీకరించాలని  కోరారు. దీనికి స్పందించిన హరీశ్‌ రావు..త్వరలోనే మంత్రి కోరిన అన్ని సౌకర్యాలు కల్పిస్తామన్నారు. ఆర్థిక సంవత్సరంలో ఖమ్మం ఆస్పత్రికి ఎంఆర్‌ఐ మంజూరు చేస్తామన్నారు. ఖమ్మం ఆస్పత్రిని మరింత అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు. రాబోయే మూడు నెలల్లో ఖమ్మం నగరంలో బస్తీ దవాఖానాలు ప్రారంభిస్తామని హరీశ్‌ రావు వెల్లడించారు. సమీక్షలో ఎమ్మెల్సీ తాతా మధుసూదన్‌, టీఎస్‌ఎంఎస్‌ఐడీసీ ఛైర్మన్‌ ఎర్రోళ్ల శ్రీనివాస్‌, జడ్పీ ఛైర్మన్‌ కమల్‌రాజు, డీసీసీబీ ఛైర్మన్‌ నాగభూషయ్య, ఎమ్మెల్యేలు ఉపేందర్‌రెడ్డి, రాములునాయక్‌, ఖమ్మం నగర మేయర్‌ పునుకొల్లు నీరజ,  కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్‌ వాకాటి కరుణ, ఆయూష్‌ కమిషనర్‌ వర్షిణీ, ముఖ్యమంత్రి కార్యాలయ ఓఎస్డీ గంగాధర్‌, ఖమ్మం, భద్రాద్రి జిల్లాల కలెక్టర్లు వీపీ గౌతమ్‌, అనుదీప్‌, నగర కమిషనర్‌ ఆదర్శ్‌ సురభి, ఉభయ జిల్లాల వైద్యారోగ్య శాఖ అధికారులు, వైద్యులు తదితరులు పాల్గొన్నారు. 


క్యాథ్‌ ల్యాబ్‌ విభాగం ప్రారంభం

ఆదిలాబాద్‌ ప్రజలకు క్యాథ్‌ ల్యాబ్‌ సేవల్ని త్వరలో అందుబాటులోకి తీసుకొస్తామని రాష్ట్ర వైద్యారోగ్యశాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు స్పష్టంచేశారు. హైదరాబాద్‌లోని ఆస్పత్రులకు పరిమితమైన గుండె సంబంధిత వైద్య సేవల్ని.. రాష్ట్ర సరిహద్దు ప్రాంతాల వరకు విస్తరించి ప్రజల ప్రాణాలు కాపాడాలన్నదే ప్రభుత్వ ఉద్దేశమన్నారు. రెండ్రోజుల ఉమ్మడి ఖమ్మం జిల్లా పర్యటనలో భాగంగా శుక్రవారం ఆయన ఖమ్మంలో పర్యటించారు.మంత్రి పువ్వాడ అజయ్‌, ఎంపీ నామా నాగేశ్వరరావుతో కలిసి జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిలో నూతనంగా ఏర్పాటు చేసిన క్యాథ్‌ ల్యాబ్‌ విభాగాన్ని మంత్రి ప్రారంభించారు. కార్డియాక్‌ ఎమర్జెన్సీ ట్రామాకేర్‌ విభాగాన్ని ప్రారంభించారు. మాతాశిశు సంరక్షణ కేంద్రంలో నూతనంగా ఏర్పాటు చేసిన తల్లిపాల నిల్వ నిధి కేంద్రం (మిల్క్‌ బ్యాంకు)ను ప్రారంభించారు. మధిరలో రూ.34 కోట్లతో 100 పడకల ప్రభుత్వ ఆస్పత్రికి శంకుస్థాపన చేశారు. అంతకుముందు ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో హరీశ్‌రావు మాట్లాడారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని