logo

విద్యార్థులు చరిత్ర రచయితలు కావాలి: జూలూరు

ఈనాటి విద్యార్థులే రేపటి తరాలకు చరిత్రను అందించే రచయితలని తెలంగాణ సాహిత్య అకాడమీ అధ్యక్షుడు జూలూరు గౌరీశంకర్‌ అన్నారు. ఖమ్మం ఎస్‌ఆర్‌అండ్‌బీజీఎన్‌ఆర్‌ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో గురువారం

Published : 13 May 2022 01:13 IST

పునాస త్రైమాసిక పత్రికను ఆవిష్కరిస్తున్న కలెక్టర్‌ గౌతమ్‌, గౌరీశంకర్‌ తదితరులు

ఖమ్మం విద్యావిభాగం, న్యూస్‌టుడే: ఈనాటి విద్యార్థులే రేపటి తరాలకు చరిత్రను అందించే రచయితలని తెలంగాణ సాహిత్య అకాడమీ అధ్యక్షుడు జూలూరు గౌరీశంకర్‌ అన్నారు. ఖమ్మం ఎస్‌ఆర్‌అండ్‌బీజీఎన్‌ఆర్‌ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో గురువారం తెలంగాణ సాహిత్య అకాడమీ, తెలుగు-చరిత్ర-ఐక్యూఏసీ విభాగాల సంయుక్త ఆధ్వర్యంలో ‘మన ఊరు-మన చరిత్ర’ మన చరిత్రను మనమే రాసుకుందాం కార్యక్రమంలో ఆయన ప్రసంగించారు. దేశంలో ఏ సాహిత్య అకాడమీ చేపట్టని విధంగా రాష్ట్ర వ్యాప్తంగా డిగ్రీ కళాశాలల విద్యార్థులను ప్రోత్సహించి వారి గ్రామాల చరిత్రను తెలుసుకునేలా చేయటానికి ఈ  కార్యక్రమాన్ని చేపట్టినట్లు తెలిపారు. విద్యార్థులు కలాలు పట్టి కదిలితే అద్భుతమైన చరిత్ర వెలుగు చూస్తుందన్నారు. ఊరు ఎప్పుడు పుట్టింది...ఎలా రూపాన్ని తీసుకున్నదో పరిశోధనాత్మకంగా అనేకాంశాలను నిక్షిప్తం చేయాలన్నారు. తెలంగాణ ఉద్యమంలో అమరులైన వీరుల గురించి ఇప్పటివరకు చరిత్రకారులకు దొరకని అంశాలు, వీర తెలంగాణ సాయుధ పోరాటాన్ని రికార్డు చేయాలన్నారు. అందుకు తెలంగాణ సాహిత్య అకాడమీ ఉత్తమ గ్రంథాలను వెలువరిస్తుందని చెప్పారు. మాజీ ముఖ్యమంత్రి జలగం వెంగళరావు, మాజీ మంత్రి శీలం సిద్ధారెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు బోడేపూడి వెంకటేశ్వరరావు, పద్మశ్రీ వనజీవి రామయ్య లాంటి వారి చరిత్రలు ఎంతో ప్రాధాన్యత ఉన్నవని గౌరీశంకర్‌ చెప్పారు.

కలెక్టర్‌ వీపీ గౌతమ్‌ మాట్లాడుతూ మన చరిత్రను మనం తెలుసుకోకుంటే ఉనికిని కోల్పోయినట్లవుతుందన్నారు.  డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్‌ డా.మహ్మద్‌ జకీరుల్లా మాట్లాడుతూ తెలంగాణ సిద్ధించాక మన చరిత్ర-మన సంస్కృతి గురించి అధ్యయనం చేయాల్సిన ఆవశ్యకత ఏర్పడిందన్నారు. అనంతరం అకాడమీ రూపొందించిన త్రైమాసిక పత్రిక ‘పునాస’, తెలుగు విభాగం ప్రచురించిన ‘రూబాయిలు-ప్రక్రియ-తత్వం’ వైవిధ్య గ్రంథం, పొలిటికల్‌ సైన్స్‌ విభాగం విద్యార్థుల కోసం ప్రత్యేకంగా తయారు చేసిన పుస్తకాలను గౌరీశంకర్‌, కలెక్టర్‌ గౌతమ్‌ ఆవిష్కరించారు. తెలుగు శాఖ అధిపతి డా.జె.రమేశ్‌, చరిత్రశాఖాధిపతి నాగూర్‌, తెలుగు అధ్యాపకుడు డా.సీతారామ్‌, హైదరాబాద్‌ బుక్‌ఫెయిర్‌ కార్యదర్శి చంద్రమోహన్‌,  సత్యవతి, డా.బి.వెంకటేశ్వరరెడ్డి, నగరంలోని పలు డిగ్రీ కళాశాలలకు చెందిన విద్యార్థులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని