logo

భోజన బిల్లులు చెల్లింపుల్లో నిర్లక్ష్యం

కొవిడ్‌ తర్వాత ప్రభుత్వ విద్యాలయాల్లో మధ్యాహ్న భోజనం వండి పెట్టేందుకు ఏజెన్సీలు పెద్దగా ముందుకు రాలేదు. అందుక్కారణం.. ఇచ్చే ధరలు గిట్టుబాటు

Updated : 19 May 2022 04:51 IST

ఏజెన్సీలకు రావాల్సిన నిధులు రూ.3.85 కోట్లు

 

పాల్వంచ విద్యావిభాగం, న్యూస్‌టుడే: కొవిడ్‌ తర్వాత ప్రభుత్వ విద్యాలయాల్లో మధ్యాహ్న భోజనం వండి పెట్టేందుకు ఏజెన్సీలు పెద్దగా ముందుకు రాలేదు. అందుక్కారణం.. ఇచ్చే ధరలు గిట్టుబాటు కాకపోవడం, చాలీచాలని గౌరవ వేతనం, నెలల పాటు బిల్లుల పెండింగులో ఉంచడమే. దీంతో గత నిర్వాహకులు చాలా మంది స్పందించక పోవడంతో గతేడాది బడుల పునః ప్రారంభం నుంచి ప్రధానోపాధ్యాయులు ప్రత్యామ్నాయంగా వేరొకరికి బాధ్యతలు అప్పగించారు. పాతవారికి, కొత్తవారికి సైతం బిల్లులు బకాయిగా ఉంచడం గమనార్హం. 2021-22 విద్యా సంవత్సరం సెప్టెంబరు నెల నుంచి తరగతులు ప్రారంభం కాగా.. అప్పటికే గత ఏజెన్సీలకు బకాయిలు పెండింగ్‌లో ఉన్నాయి. దీంతో మళ్లీ విద్యార్థులకు వండి పెట్టేందుకు నిర్వాహకులు చాలాచోట్ల ముందుకు రాలేదు. అలా రాని చోట పాఠశాలల హెచ్‌ఎంలు కొత్త ఏజెన్సీలను ఏర్పాటు చేసుకున్నారు. వీరికీ చాలా బిల్లులు పెండింగ్‌లో ఉండటం గమనార్హం.

జిల్లావ్యాప్తంగా 23 మండలాల్లో మధ్యాహ్న భోజన పథకం కింద 2,225 మంది వంట ఏజెన్సీల నిర్వాహకులు పనిచేస్తున్నారు. 1,060 ప్రాథమిక పాఠశాలల్లో 51,312, 162  ప్రాథమికోన్నత పాఠశాలల్లో 18,210, 131 ఉన్నత పాఠశాలల్లో 11,281 మంది విద్యార్థులున్నారు. ప్రాథమిక స్థాయిలో ఒక్కో విద్యార్థికి రూ.4.97 చొప్పున, ఉన్నత స్థాయిలో రూ.7.45, వేరుగా గుడ్డుకు రూ.4 చొప్పున చెల్లించాల్సి ఉంది. ఈ ఏడాది మొత్తం రూ.3,85,63,263 చెల్లించాలి. ఈ మేరకు ఉన్నతాధికారులకు విద్యాశాఖ ప్రతిపాదనలు పంపింది. ఇందులో ఇటీవల రూ.1,57,23,000 మంజూరు చేశారు. ఇవి ఇంకా ఖాతాల్లో వేయాల్సి ఉంది. గత్యంతరం లేని పరిస్థితుల్లో తాము భోజనాలు పెట్టేందుకు ముందుకొస్తే.. మళ్లీ బకాయిలు పోగు పెడతారా? అంటూ కొత్త నిర్వాహకులు మండిపడుతున్నారు. పెరిగిన కూరగాయలు, నిత్యావర ధరలు భరిస్తూ.. అప్పుటు చేసి మరీ నెట్టుకొచ్చామన్నారు. పలువురు ఏజెన్సీల వారు ఎంఈవోల కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం వద్ద ఇంకా బిల్లులు పూర్తికాలేదనే సమాధానం వారికి ఎదురవుతోంది. 
 

 ‘‘ఇప్పటి వరకు సగం నిధులు మంజూరయ్యాయి. ఏజెన్సీల ఖాతాల్లో జమచేసేందుకు ఎంఈవో కార్యాలయాధికారులు చర్యలు చేపడుతున్నారు. మరో వారంలో పనిపూర్తవుతుంది. మరో దశలో మిగతా మొత్తం మంజూరుకానున్నాయి. అవి రాగానే ఖాతాలో జమచేస్తాం.’  

- సోమశేఖర్‌శర్మ, డీఈవో 
 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని