logo

ఉత్సాహం రెట్టింపు

రాజ్యసభ తెరాస అభ్యర్థుల జాబితాలో ఖమ్మం జిల్లాకు బంపర్‌ ఆఫర్‌ దక్కింది. ప్రకటించిన ముగ్గురు అభ్యర్థుల్లో ఖమ్మం జిల్లా నుంచే ఇద్దరికి చోటు దక్కింది. ప్రముఖ హెటిరో డ్రగ్స్‌ అధినేత

Updated : 19 May 2022 04:51 IST

రాజ్యసభ తెరాస అభ్యర్థులుగా పార్థసారథిరెడ్డి, రవిచంద్ర

ఈటీవీ, ఖమ్మం: రాజ్యసభ తెరాస అభ్యర్థుల జాబితాలో ఖమ్మం జిల్లాకు బంపర్‌ ఆఫర్‌ దక్కింది. ప్రకటించిన ముగ్గురు అభ్యర్థుల్లో ఖమ్మం జిల్లా నుంచే ఇద్దరికి చోటు దక్కింది. ప్రముఖ హెటిరో డ్రగ్స్‌ అధినేత బండి పార్థసారథిరెడ్డి, గాయత్రి గ్రానైట్స్‌ గ్రూప్‌ ఆఫ్‌ కంపెనీస్‌ అధినేత వద్దిరాజు రవిచంద్రను అభ్యర్థులుగా ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రకటించారు. దీంతో ఖమ్మం జిల్లాకు మరో రెండు రాజకీయ పదవులు దక్కడం ఖాయంగా కనిపిస్తోంది. వేంసూరు మండలం కందుకూరుకు చెందిన పార్థసారథిరెడ్డి ప్రముఖ వ్యాపారవేత్తగా ప్రత్యేక గుర్తింపు ఉంది. రవిచంద్ర ప్రముఖ గ్రానైట్‌ వ్యాపారిగా కాకుండానే రాజకీయంగా బలమైన బీసీ సామాజిక వర్గానికి చెందిన నేతగా పేరుంది. వీరిద్దరికీ ముఖ్యమంత్రి కేసీఆర్‌తో సన్నిహిత సంబంధాలు ఉన్నందునే ఇద్దరినీ రాజ్యసభ అభ్యర్థిత్వం వరించింది. రెడ్డి సామాజిక వర్గం నుంచి ఒకరికి, బీసీ సామాజిక వర్గం నుంచి ఇంకొకరిని అభ్యర్థులుగా ఎంపిక చేయడంతో జిల్లాలో తెరాసలో మరోసారి సామాజిక సమీకరణాలకు పెద్దపీట వేసినట్లైంది. 

ఇద్దరూ వ్యాపారవేత్తలే..

బండి పార్థసారథిరెడ్డి వేంసూరు మండలం కందుకూరులో జన్మించారు.  కందుకూరులో పదో తరగతి వరకు చదివారు. సత్తుపల్లి ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో ఇంటర్‌, ఖమ్మం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో డిగ్రీ పూర్తి చేశారు. 1993లో హెటిరో డ్రగ్స్‌ కంపెనీ స్థాపించి వ్యాపారవేత్తగా ఎదిగారు. జిల్లాలో సాయిస్ఫూర్తి ట్రస్టు ద్వారా సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. పాఠశాలలు, దేవాలయాలు అభివృద్ధికి విరాళాలు అందజేశారు. 
వద్దిరాజు రవిచంద్ర మహబూబాబాద్‌ జిల్లా కేసముద్రం మండలం ఇనుగుర్తిలో 1964లో జన్మించారు. ఖమ్మం జిల్లాతో సుదీర్ఘ అనుబంధం ఉంది. ఈ జిల్లా నుంచే ఆయన ప్రముఖ వ్యాపారవేత్తగా గుర్తింపు పొందారు. తెలంగాణ గ్రానైట్‌ క్వారీ ఓనర్స్‌ అసోసియేషన్‌ రాష్ట్ర అధ్యక్షునిగా పనిచేస్తున్నారు. వ్యాపారవేత్తగా, సామాజిక సేవకునిగా, రాజకీయ నాయకునిగా ఉమ్మడి ఖమ్మం జిల్లాతో సుదీర్ఘ అనుభవం ఉంది. జిల్లాలో ప్రముఖ బీసీ నేతగా గుర్తింపు తెచ్చుకున్నారు. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో వరంగల్‌ తూర్పు నియోజకవర్గం నుంచి కాంగ్రెస్‌ పార్టీ నుంచి  పోటీ చేసి ఓడిపోయారు. ఆ తర్వాత సీఎం కేసీఆర్‌ సమక్షంలో తెరాసలో చేరారు. అప్పటి నుంచి ఖమ్మం జిల్లా తెరాస నేతగానే కొనసాగుతున్నారు.  

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని