logo

సీతారాముడి కల్యాణం కమనీయం

భద్రాచలం శ్రీసీతారామచంద్రస్వామి ఆలయ మాడవీధులన్నీ బుధవారం రామనామాలతో మార్మోగాయి. ఆలయం తలుపులు తెరిచిన తర్వాత అర్చకులు సుప్రభాతం పలికి ఆరాధించి

Published : 19 May 2022 05:04 IST

భద్రాచలం, న్యూస్‌టుడే: భద్రాచలం శ్రీసీతారామచంద్రస్వామి ఆలయ మాడవీధులన్నీ బుధవారం రామనామాలతో మార్మోగాయి. ఆలయం తలుపులు తెరిచిన తర్వాత అర్చకులు సుప్రభాతం పలికి ఆరాధించి తిరుమంజనం చేశారు. బేడా మండపంలో క్షేత్ర విశిష్టతను వైదిక పెద్దలు ప్రవచనం చేసి వైష్ణవ సంప్రదాయం ప్రకారం విష్వక్సేనుణ్ని పూజించారు. పుణ్యాహ వాచనం కన్యాదానం కొనసాగించారు. కంకణధారణ కడు రమణీయమవగా గోత్ర నామాలను చదివారు. సీతమ్మకు యోక్త్రధారణ రామయ్యకు యజ్ఞోపవీతధారణ నిర్వహించారు. మాంగళ్యధారణ నయనానందంగా మారింది. చల్లని రామయ్యకు చక్కని సీతమ్మకు తలంబ్రాల వేడుకను చేశారు. దర్బారు సేవలో స్వామి వైభవం మరింత పెరగడంతో భక్తులు పాహిమాం రామచంద్ర మహాప్రభో అంటూ కీర్తించారు. మొక్కులు చెల్లించి తీర్థ ప్రసాదాలను స్వీకరించారు. కోటి హనుమాన్‌ చాలీసా పారాయణం సంపూర్ణం అయిన సందర్భంగా అశ్వాపురం మండలానికి చెందిన భక్తులు పట్టణంలో శోభాయాత్ర చేశారు. జై శ్రీరాం జై హనుమాన్‌ అంటూ నీరాజనాలు పలుకుతు తాతగుడి నుంచి రామాలయం వరకు పాదయాత్ర నిర్వహించారు. తమ వద్ద ఉన్న అంజన్న విగ్రహానికి ఇక్కడ ప్రత్యేక పూజలు చేసి రాముణ్ని దర్శించుకున్నారు. ఈ బృందానికి ఏఈవో భవానీ రామకృష్ణ, సూపరింటెండెంట్‌ శ్రీనివాస్‌ స్వాగతం పలకగా ఉప ప్రధానార్చకుడు రామస్వరూప్‌ ఆధ్వర్యంలో ఆశీర్వచనం అందించారు. 23 నుంచి 25 వరకు హనుమజ్జయంతి ఉత్సవాలను నిర్వహించేందుకు ఈవో శివాజీ ఏర్పాట్లు చేపట్టారు.
నరసింహుడికి ఘనంగా సదస్యం: భద్రాచలం రామాలయానికి అనుబంధంగా ఉన్న శ్రీయోగానంద లక్ష్మీనరసింహస్వామికి బుధవారం ప్రత్యేక పూజలు చేశారు. సుప్రభాతం నిర్వహించి మంగళాశాసనం చేశారు. సదస్యం భక్తులను సంతోష సాగరంలో తేలియాడించింది. స్థానాచార్యులు స్థలసాయి పర్యవేక్షణలో నరసింహుడికి వేదాశీర్వచనం పలికారు. చతుర్వేద విద్వాంసులతో పాటు ద్రవిడ వేద పండితులు వేదాలతో ఆశీర్వచనం పలికి సదస్యం అనే ఉత్సవాన్ని నిర్వహించారు. రాత్రివేళ దొంగల దోపు ఉత్సవాన్ని తెప్పోత్సవాన్ని నిర్వహించినట్లు వైదిక పెద్దలు తెలిపారు. ఈనెల 14న ప్రారంభమైన కల్యాణ బ్రహ్మోత్సవాలు నేటితో పూర్తి కానున్నాయని అర్చకుడు సౌమిత్రి శ్రీనివాస్‌ తెలిపారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని