logo

మార్కెట్‌కు మహర్దశ

రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ చొరవతో ఖమ్మం వ్యవసాయ మార్కెట్‌కు మహర్దశ పట్టింది. మార్కెట్‌ అభివృద్ధి కోసం ఆయన పట్టుబట్టి రూ.10.35కోట్ల

Published : 19 May 2022 05:19 IST

ఖమ్మం వ్యవసాయం, న్యూస్‌టుడే: రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ చొరవతో ఖమ్మం వ్యవసాయ మార్కెట్‌కు మహర్దశ పట్టింది. మార్కెట్‌ అభివృద్ధి కోసం ఆయన పట్టుబట్టి రూ.10.35కోట్ల నిధులను మంజూరు చేయించారు. అభివృద్ధి, నిర్మాణ పనులకు నేడు మంత్రి పువ్వాడతో పాటు రాష్ట్ర వ్యవసాయ, సహకార, మార్కెటింగ్‌శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డిలు శంకుస్థాపన చేయనున్నారు. దశాబ్దాల నుంచి శిథిల భవనాల్లోనే నిర్వహిస్తున్న విపణికి ఇప్పుడు మంచి రోజులొచ్చాయి. పెద్ద ఎత్తున నిధులు మంజూరు కావటంతో అన్నదాతలకు పూర్తి స్థాయిలో మౌలిక వసతులు సమకూరనున్నాయి.

రూ.10.35కోట్ల పనులు మంజూరు

తెలంగాణలోనే అతి పెద్ద వ్యవసాయ మార్కెట్లలో ఖమ్మం ప్రధానమైనది. ఈమార్కెట్‌లో వ్యాపారులు, కార్మికులు, కమీషన్‌ ఏజెంట్లు, వివిధ రకాల కార్మికులు కలిపి సుమారు 2,500 మంది పనిచేస్తుంటారు. నిత్యం వేల మంది రైతులు వచ్చి తమ పంట ఉత్పత్తులను అమ్ముకుంటారు. ఖమ్మం జిల్లాతో పాటు భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్‌, సూర్యాపేట, నల్గొండ, వరంగల్‌ జిల్లాలతో పాటు ఆంధ్రప్రదేశ్‌లోని ఉమ్మడి కృష్ణా, గుంటూరు జిల్లాల నుంచి రైతులు వచ్చి తమ పంట ఉత్పత్తులైన పత్తి, మిరప, మొక్కజొన్నలు, అపరాలు విక్రయిస్తారు. ప్రతి సంవత్సరం సుమారు రూ.25వేల కోట్ల వ్యాపారం జరుగుతుంది. రాష్ట్ర ప్రభుత్వానికి కోట్లాది రూపాయల ఆదాయం తెచ్చిపెడుతున్న ఈమార్కెట్‌లో సరైన వసతులు లేకపోవటం వల్ల ఇబ్బంది జరుగుతోంది. ఇక్కడ వసతులు మెరుగుపరచాల్సిన విషయం గురించి పాలకవర్గం, అధికారులు, కార్మిక సంఘాలు, రైతు సంఘాలు మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ దృష్టికి తీసుకెళ్లటంతో ఆయన స్పందించి ముఖ్యమంత్రి కేసీఆర్‌ ద్వారా పెద్ద ఎత్తున నిధులు మంజూరు చేయించారు. మంజూరైన పనులు సకాలంలో పూర్తయితే రాష్ట్రంలోనే ఇది అన్ని హంగులతో ఒక మోడల్‌ మార్కెట్‌గా తయారయ్యే అవకాశం ఉంది. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని