logo

పది పరీక్షలకు సర్వం సిద్ధం

పదో తరగతి పబ్లిక్‌ పరీక్షలు ఈనెల 23 నుంచి ప్రారంభంకానున్న నేపథ్యంలో జిల్లా విద్యాశాఖ పటిష్ఠ ఏర్పాట్లు చేస్తోంది. ఈ పరీక్షలకు 17,543మంది విద్యార్థులు హాజరవుతున్నారు. ఇందులో 427 ఉన్నత పాఠశాలలకు

Published : 19 May 2022 05:19 IST

ఖమ్మం విద్యావిభాగం, న్యూస్‌టుడే: పదో తరగతి పబ్లిక్‌ పరీక్షలు ఈనెల 23 నుంచి ప్రారంభంకానున్న నేపథ్యంలో జిల్లా విద్యాశాఖ పటిష్ఠ ఏర్పాట్లు చేస్తోంది. ఈ పరీక్షలకు 17,543మంది విద్యార్థులు హాజరవుతున్నారు. ఇందులో 427 ఉన్నత పాఠశాలలకు చెందిన 9,160మంది బాలురు, 8,383 మంది బాలికలున్నారు. పరీక్షలను జంబ్లింగ్‌ పద్ధతిలోనే నిర్వహిస్తారు. ఈసారి పరీక్షలకు అదనంగా 15 నిమిషాల సమయం, 50శాతం ఛాయిస్‌ ఇవ్వడం విశేషం. 

పటిష్ఠ బందోబస్తు మధ్య ప్రశ్నపత్రాల తరలింపు 
ఆంధ్రప్రదేశ్‌లో పదో తరగతి పబ్లిక్‌ పరీక్షల ప్రశ్నపత్రాలు లీకైన సమస్య ఉత్పన్నమైన దృష్ట్యా ఇక్కడ అలాంటి ఆస్కారం లేకుండా చర్యలు తీసుకుంటున్నారు. ఇప్పటికే జిల్లా కలెక్టర్‌ వీపీ గౌతమ్‌ సంబంధిత అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించి దిశానిర్దేశం చేశారు. పటిష్ఠ బందోబస్తు మధ్య ప్రశ్న పత్రాలను తరలించాలని ఆదేశించారు.

144వ సెక్షన్‌ అమలు
పరీక్ష కేంద్రాల సమీపంలో 144వ సెక్షన్‌ అమల్లో ఉంటుంది. పోలీసు బందోబస్తు కూడా ఏర్పాటు చేస్తున్నారు. సమీపంలోని జిరాక్స్‌ సెంటర్లను మూసివేస్తారు. నివాస ప్రాంతాల మధ్యలో ఉన్న పరీక్ష కేంద్రాల వద్ద అదనపు భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు. పరీక్షలు నిర్వహిస్తున్న సిబ్బంది తప్పనిసరిగా గుర్తింపు కార్డు ధరించి ఉండాలి.

ఆర్టీసీలో ఉచిత రవాణా సౌకర్యం
విద్యార్థులు పరీక్ష కేంద్రాలకు సకాలంలో చేరుకునేందుకు అవసరమైన బస్సులను టీఎస్‌ ఆర్‌టీసీ ఏర్పాటు చేస్తోంది. ఇందు కోసం ఉచిత రవాణా సౌకర్యం కల్పించింది. విద్యార్థులు తమ వద్ద ఉన్న పాత బస్‌పాస్‌, లేదా పదోతరగతి హాల్‌ టికెట్‌ చూపించి బస్సుల్లో ఉచితంగా పరీక్ష కేంద్రానికి చేరుకునే వెసులుబాటు కల్పించారు. ఇందు కోసం ఆర్టీసీ ఇప్పటికే రూట్‌ మ్యాపింగ్‌ ప్రణాళికను తయారు చేసింది.

కాంపోజిట్‌ విద్యార్థులకు ఒకే రోజు పరీక్ష

కాంపోజిట్‌ కోర్సు విద్యార్థులకు మొదటి లాంగ్వేజి పరీక్ష రెండు పేపర్లు అదే రోజు నిర్వహిస్తారు. ఉదయం 9.30 గంటల నుంచి 11.45 గంటల వరకు ఒక పేపర్‌, 11.45 గంటల నుంచి 12.45వరకు రెండో పేపర్‌ నిర్వహిస్తారు. దీనిలో ఎలాంటి అనుమానాలకు తావులేదు. 

విద్యార్థులు ఎలాంటి ఒత్తిడికి లోను కాకుండా పరీక్షలను ప్రశాంతంగా రాసే వాతావరణం కల్పించాం. తల్లిదండ్రులు పిల్లలను ఒత్తిడి చేయవద్దు. విద్యార్థులు స్వేచ్ఛగా, ప్రశాంతంగా పరీక్ష రాసే అవకాశాన్ని ఇన్విజిలేటర్లు కల్పించాలి. చూచిరాతలకు పాల్పడితే కేసులు నమోదు చేస్తాం. పరీక్ష కేంద్రం బాధ్యులు, సిబ్బంది అక్రమాలకు పాల్పడితే అలాంటి వారిపై విద్యాచట్టం 25, 1997 ప్రకారం క్రిమినల్‌ చర్యలు తీసుకుంటాం. పరీక్ష సమయానికి 45 నిమిషాల ముందు నుంచే కేంద్రాల్లోకి అనుమతిస్తాం. ఏదైనా సమస్య ఉంటే సంప్రదించటం కోసం అన్ని పరీక్ష కేంద్రాల వద్ద ఏంఈవోలు, సంబంధిత అధికారుల చరవాణి నెంబర్లను ప్రదర్శిస్తున్నాం. పాఠశాలలకు ఇప్పటికే విద్యార్థుల హాల్‌ టికెట్లను పంపాం. రాని విద్యార్థులు సంబంధిత బోర్డు వెబ్‌సైట్‌ నుంచి నేరుగా హాల్‌ టికెట్లను డౌన్‌లోడు చేసుకోవచ్చు. వాటిపై హెచ్‌ఎంల సంతకం లేనప్పటికీ పరీక్షకు అనుమతిస్తాం. 

-ఎస్‌.యాదయ్య, డీఈవో, ఖమ్మం 
 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని