logo

వ్యవసాయంలో ఉమ్మడి జిల్లా ఆదర్శం

వైవిధ్యమైన పంటలు, ఆధునిక సాగుకు ఉమ్మడి ఖమ్మం జిల్లా పెట్టింది పేరని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి అన్నారు. వానాకాలం-2022 సాగుకు సమాయత్తంపై ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల వ్యవసాయ అనుబంధ శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులకు

Published : 20 May 2022 05:54 IST

సమావేశంలో మాట్లాడుతున్న మంత్రి ఎస్‌.నిరంజన్‌రెడ్డి, వేదికపై మంత్రి అజయ్‌కుమార్‌, ఎంపీ నామా నాగేశ్వరరావు, పల్లా రాజేశ్వరరెడ్డి, ఎం.రఘునందన్‌రావు, రేగా కాంతారావు, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల కలెక్టర్లు వీపీ గౌతమ్‌, అనుదీప్‌, జడ్పీ ఛైర్మన్‌ కమల్‌రాజు, ఎమ్మెల్యే సండ్ర తదితరులు

ఖమ్మం వ్యవసాయం, న్యూస్‌టుడే: వైవిధ్యమైన పంటలు, ఆధునిక సాగుకు ఉమ్మడి ఖమ్మం జిల్లా పెట్టింది పేరని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి అన్నారు. వానాకాలం-2022 సాగుకు సమాయత్తంపై ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల వ్యవసాయ అనుబంధ శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులకు గురువారం ఖమ్మం ఎస్‌ఆర్‌గార్డెన్స్‌లో నిర్వహించిన సమావేశంలో  మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌తో కలిసి పాల్గొన్నారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ పలు జిల్లాల రైతులు ఆయిల్‌పామ్‌ సాగు పద్ధతులు తెలుసుకునేందుకు భద్రాద్రి జిల్లాకు వస్తున్నారన్నారు. మార్కెట్‌ డిమాండ్‌ను బట్టి రైతులు పంటలు వేసేలా,  విత్తనాలు, ఎరువుల ఎంపిక, వినియోగంపై రైతు వేదికల ద్వారా అధికారులు అవగాహన కల్పించాలని కోరారు. జాతీయ, అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా మన వ్యవసాయ ఉత్పత్తులు చూసుకోవాల్సిన బాధ్యత ఉందన్నారు. కేంద్ర ప్రభుత్వానికి వ్యవసాయ రంగం మీద దూరదృష్టి లేదన్నారు. ‘రైతుబంధు’ ద్వారా కర్షకుల ఖాతాల్లో నగదు వేయటం దేశంలో మరే రాష్ట్ర ప్రభుత్వం చేయలేదన్నారు.రైతులు, రైతు బంధు సమితి సభ్యులు, వ్యవసాయశాఖ అధికారులు సమన్వయంతో పనిచేసి మార్పులు తీసుకురావాలన్నారు.  
* మంత్రి అజయ్‌కుమార్‌ మాట్లాడుతూ సాగు బాగుపడాలంటే వ్యవసాయ విస్తరణ జరగాలన్నారు. నూతన యాజమాన్య పద్ధతులు,  వాడాల్సిన ఎరువులపై రైతులకు అవగాహన కల్పించాలన్నారు. వ్యవసాయశాఖలో అన్ని పోస్టులను భర్తీ చేసిన ఏకైక సీఎం కేసీఆర్‌ అని చెప్పారు.
* ఎంపీ నామా నాగేశ్వరరావు మాట్లాడుతూ దేశంలో రైతుల గురించి ఆలోచన చేసింది కేసీఆర్‌ మాత్రమేనన్నారు. ప్రభుత్వ సూచనల మేరకు రైతులు ప్రత్యామ్నాయ పంటలపై దృష్టి పెట్టాలన్నారు.
* రైతుబంధు సమితి రాష్ట్ర అధ్యక్షుడు పల్లా రాజేశ్వరరెడ్డి మాట్లాడుతూ రైతు బంధు సమితులకు ప్రోత్సాహం అందిస్తామని, ప్రభుత్వ కార్యక్రమాల్లో   గుర్తింపు కూడా కల్పిస్తామని, గౌరవ వేతనం కూడాపరిశీలనలో ఉందన్నారు.కార్యక్రమంలో వ్యవసాయశాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ, కమిషనర్‌ ఎం.రఘునందన్‌రావు, ప్రభుత్వ విప్‌ రేగా కాంతారావు, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల కలెక్టర్లు వీపీ గౌతమ్‌, అనుదీప్‌, జడ్పీ ఛైర్మన్‌ కమల్‌రాజు, రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ ఛైర్మన్‌ కొండబాల కోటేశ్వరరావు, ఎమ్మెల్యేలు సండ్ర వెంకటవీరయ్య, లావుడ్యా రాములునాయక్‌, మెచ్చా నాగేశ్వరరావు, డీసీసీబీ ఛైర్మన్‌ కూరాకుల నాగభూషయ్య, డీసీఎంఎస్‌ ఛైర్మన్‌ రాయల వెంకటశేషగిరిరావు, నగర మేయర్‌ పునుకొల్లు నీరజ, మార్క్‌ఫెడ్‌ వైస్‌ ఛైర్మన్‌ రాజశేఖర్‌, రైతుబంధు సమితి జిల్లా కన్వీనర్‌  వెంకటేశ్వరరావు, డీఏవోలు సరిత, అభిమన్యుడు  పాల్గొన్నారు.
* రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి ఉభయ జిల్లాల చెందిన నలుగురు ఏఈవోలతో ‘మాటా-మంతీ’ నిర్వహించి ఆకట్టుకున్నారు. విధి నిర్వహణ, రైతులకు అందుతున్న సేవలు, అనుభవాలు, ఉద్యోగ ప్రస్థానం గురించి ఒక్కొక్కరితో మాట్లాడారు.
శాస్త్రవేత్తలతో అవగాహన: సాగు సన్నాహక సమావేశం సందర్భంగా రెండు జిల్లాల వ్యవసాయశాఖ అధికారులకు ప్రతిభ పరీక్ష నిర్వహించారు. ఏఈవోలు, ఏవోలు, డీఏవోలకు ఒక లింకు ద్వారా ప్రశ్న పత్రం అందించి దాన్ని పూర్తి చేసేందుకు రెండు గంటల సమయం ఇచ్చారు. సమావేశం పూర్తయిన తర్వాత ప్రతిభ పరీక్ష ఫలితాలను విడుదల చేశారు. ఉదయం జరిగిన సమావేశంలో పలు అంశాలపై శాస్త్రవేత్తలతో అవగాహన కల్పించారు.

 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని