logo

కాలువ చెంత.. నీరందక చింత

శ్రీరాంసాగర్‌ వరద కాలువ వస్తుందంటే రైతులు ఎంతో సంతోషించారు. 2008లో ఎకరానికి రూ.80 వేల నుంచి రూ.1.50 లక్షల వరకు పరిహారం చెల్లిస్తూ భూసేకరణ పనులు చకచకా పూర్తి చేశారు.తిరుమలాయపాలెం, కూసుమంచి, ఖమ్మం గ్రామీణం

Published : 23 May 2022 05:42 IST

కూసుమంచి, న్యూస్‌టుడే


తవ్వకం పనులు పూర్తయిన ప్రాంతంలో నిరుపయోగంగా..

శ్రీరాంసాగర్‌ వరద కాలువ వస్తుందంటే రైతులు ఎంతో సంతోషించారు. 2008లో ఎకరానికి రూ.80 వేల నుంచి రూ.1.50 లక్షల వరకు పరిహారం చెల్లిస్తూ భూసేకరణ పనులు చకచకా పూర్తి చేశారు.తిరుమలాయపాలెం, కూసుమంచి, ఖమ్మం గ్రామీణం మండలంలో పూర్తిగా నేలకొండపల్లి మండలంలోని కొంత ప్రాంతానికి వెరసీ సుమారు 74 వేల ఎకరాలకు సాగునీరందించే ప్రధాన కాలువ డీబీఎం-60 తవ్వకం పనులు పూర్తయ్యాయి. అయితే అనుసంధాన కాలువ పనులు పూర్తికాకపోవడంతో సమస్య ఏర్పడింది.


వీడని గ్రహణం...

డీబీఎం-60 ప్రధాన కాలువకు అనుసంధానమైన 7ఆర్‌ కాలువ పనులు నిలిచిపోయాయి. పరిహారం విషయంలో సమస్యలు, చెక్కుల జారీలో జాప్యం తదితర సమస్యలతో 9 మంది రైతులకు చెందిన 11 ఎకరాల భూసేకరణ నిలిచిపోవడంతో సమస్య ఏర్పడింది. 2018లో తెలంగాణ ప్రభుత్వం భక్తరామదాసు ఎత్తిపోతల పథకాన్ని ఈ కాలువలతో అనుసంధానించారు. ప్రధాన కాలువలో పాలేరు జలాలు ప్రవహించాయి. అనుసంధాన పిల్లకాలువల తవ్వకం పనులు చకచకా జరిగాయి. వేసవిలో పశువులు తాగేందుకు చుక్కనీరుండని చెరువులు పాలేరు జలాల చేరికతో మండువేసవిలో అలుగులు పారాయి. ఈ తరుణంలో తమకు పరిహారం పెంచి ఇవ్వాలనే రైతుల వినతిని అధికారులు తిరస్కరించడంతో రైతులు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. ప్రభుత్వం ప్రస్తుతం ఇస్తున్న పరిహారం సమకూర్చితే తాము భూముల్ని అప్పగిస్తామని రైతులు స్పష్టం చేస్తున్నారు.


ఆరు వేల ఎకరాలకు సాగునీరు కరవు

7ఆర్‌ కాలువ పనులు అర్దాంతరంగా నిలిచిపోవడంతో ఆయకట్టు 6 వేల ఎకరాలకు భక్తరామదాసు ఫలాలు అందడం లేదు. కాలువ పరిధిలో లోక్యాతండా, కోక్యాతండా, కూసుమంచి, గంగబండతండా, గట్టుసింగారం, పెరిక సింగారం, జుజ్జులరావుపేట తదితర గ్రామాల చెరువులకు నీరందడం లేదు. కాలువ చెంతనే ఉన్నప్పటికీ వేలాది మంది రైతుల సాగునీటి చింత నేటికీ తీరడంలేదు.


రిహారం విషయంలో రైతులు న్యాయస్థానాన్ని ఆశ్రయించడంతో కాలువ తవ్వకం పనులు నిలిచి ఉన్నాయి. దీంతో ఆరు వేల ఎకరాలకు నీరందని విషయం యదార్థమే. గతంలో ప్రభుత్వం ఇచ్చిన పరిహారానికి, రైతులు కోరుతున్న పరిహారానికి చాలా వ్యత్యాసం ఉన్న దృష్ట్యా సమస్య పరిష్కారానికి జాప్యం జరిగింది. అయితే ఇటీవల రైతులతో చర్చలు జరుపుతున్నాం. కొద్దిరోజుల్లోనే లోక్‌అదాలత్‌ ద్వారా సమస్య పరిష్కారానికి కృషి చేస్తున్నాం.

- సీఈ శంకర్‌నాయక్‌

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని