logo

సరదా కాకూడదు విషాదం

వేసవి కాలం వచ్చిందంటే చాలు పిల్లలు సరదాగా ఈతకు వెళుతుంటారు. సెలవులు రావడంతో చిన్నారులు ఇళ్ల వద్దే ఉంటున్నారు. ఈ క్రమంలోనే తల్లిదండ్రులు, పెద్దలు ఇతర పనుల్లో నిమగ్నమై ఉండటంతో వారిపై పర్యవేక్షణ కొరవడింది.

Updated : 23 May 2022 06:13 IST

ఖమ్మం మయూరిసెంటర్‌, న్యూస్‌టుడే

వేసవి కాలం వచ్చిందంటే చాలు పిల్లలు సరదాగా ఈతకు వెళుతుంటారు. సెలవులు రావడంతో చిన్నారులు ఇళ్ల వద్దే ఉంటున్నారు. ఈ క్రమంలోనే తల్లిదండ్రులు, పెద్దలు ఇతర పనుల్లో నిమగ్నమై ఉండటంతో వారిపై పర్యవేక్షణ కొరవడింది. ఇటీవల ఈతకు వెళ్లి, ప్రమాదవశాత్తు కాలుజారి నీళ్లలో పడి మరణించిన ఘటనలు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా చోటు చేసుకుంటున్నాయి. తాజాగా ఖమ్మంలోని లకారం ట్యాంకుబండ్‌లో ఓ విద్యార్థి కాలుజారి పడిపోయి మృత్యువాత పడ్డాడు. కారేపల్లి మండలంలో ఓ బాలుడు నడుముకు కట్టుకున్న డబ్బా ఊడిపోవడంతో నీటిలో మునిగి మృతి చెందాడు.


ఈత నేర్చుకుంటూ ప్రమాదాలు

ఖమ్మం నగరంలో స్విమ్మింగ్‌ ఫూల్‌లు అందుబాటులో ఉండగా, మిగిలిన ప్రాంతాల్లో ఆ అవకాశం లేదు. దీంతో పిల్లలు, యువకులు వాహనాల ట్యూబులు, తాళ్లను తీసుకొని ఈతకు వెళుతున్నారు. వీటి ఆధారం చేసుకుని కొంతమంది నేర్చుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ సమయంలో వాటికి చిన్నరంధ్రం ఏర్పడి గాలిపోయినా నీటిలో మునిగిపోయే ప్రమాదం ఉంటుంది. కొందరు ఎండ వేడికి తట్టుకోలేక ఎక్కువ సమయం నీళ్లలోనే గడిపేందుకు ఇష్టపడతారు. ఈదడం రాని వారు సైతం వారిని అనుకరిస్తూ అక్కడే ఉంటున్నారు. ఇక్కడే ప్రమాదాల బారిన పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. నీటి మునుగుతూ రక్షించబోయిన వారిని భయంతో గట్టిగా పట్టుకోవడంతో వారూ కూడా మృతి చెందే ప్రమాదం ఉంది.


లోతు తెలియక మునక

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో వందలాది చెరువులు, కుంటలు, వ్యవసాయ బావులు ఉన్నాయి. ప్రస్తుతం వాటిల్లో నీళ్లు కూడా అధికంగానే ఉన్నాయి. ఇదివరకు మిషన్‌ కాకతీయ పథకంలో చెరువులు, కుంటల్లో యంత్రాల సహాయంతో పూడికతీత పనులు నిర్వహించారు. దీంతో అవి ఎక్కువ లోతుగా ఉన్నాయి. వీటిలోకి ఈతకు వెళితే లోతు తెలియక మునిగిపోయే ప్రమాదం ఉంది. చెరువులు, కుంటల్లో ఈత కొట్టే సమయంలో గతంలో చేపలు పట్టేందుకు ఉపయోగించిన వలలు, గడ్డితీగ కాళ్లకు చుట్టుకుని మునిగిపోయే ప్రమాదం ఉంది.


ఇలా చేస్తే మేలు..

* గ్రామాల్లో చెరువులు, వ్యవసాయబావులు, కుంటల వద్ద పగటివేళల్లో కాపలా కాయాలి.

* పిల్లలు మూకుమ్మడిగా చెరువుల్లోకి దిగకుండా చూడాలి.

* జలాశయాల వద్ద హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయాలి.

* నీటి లోతును తెలిపేవిధంగా వివరాలు వాటిలో నమోదు చేయాలి.

* తల్లిదండ్రులు, సంరక్షకుల పర్యవేక్షణలోనే చిన్నపిల్లలకు ఈత నేర్పించాలి.

* మగ, ఆడ అనే తేడా లేకుండా పిల్లలు అందరికీ ఈత నేర్పించాలి. ఈ సమయంలో లైఫ్‌జాకెట్‌ తప్పనిసరిగా ధరించేలా జాగ్రత్తలు తీసుకోవాలి.

* మహిళలు దుస్తులు ఉతికేందుకు వెళ్లి జారి నీళ్లలో పడే అవకాశాలు ఉన్నాయి. వారు వీలైనంత వరకు ఒడ్డునే అలాంటి పనులు చేపట్టాలి.


పిల్లలపై పర్యవేక్షణే ముఖ్యం

జయప్రకాశ్‌, జిల్లా అగ్నిమాపక శాఖ అధికారి

వేసవి సెలవుల్లో తల్లిదండ్రులు పిల్లలపై ఎక్కువ శ్రద్ధ పెట్టాలి. వారు నీటి కుంటలు, చెరువుల వద్దకు వెళ్లకుండా చూడాలి. ఈత నేర్పించడం మంచిదే అయినప్పటికీ తగిన రక్షణ చర్యలు తీసుకోవాలి. నిర్లక్ష్యం వహిస్తే నీటి ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని