logo

పల్లెల్లో పారిశుద్ధ్యానికి ప్రాధాన్యం

గ్రామాల్లో పారిశుద్ధ్య పనులకు ప్రాధాన్యమిస్తూ నిత్యం ఇంటింటి నుంచి చెత్త సేకరణ జరగాలి.. డంపింగ్‌ యార్డులకు తరలించిన అనంతరం తడి చెత్త నుంచి కంపోస్టు ఎరువు తయారీకి చర్యలు తీసుకుంటున్నట్లు జిల్లా పంచాయతీ అధికారి జూపల్లి హరిప్రసాద్‌ తెలిపారు.

Published : 23 May 2022 05:42 IST
జిల్లా పంచాయతీ అధికారి జూపల్లి హరిప్రసాద్‌
ఖమ్మం కలెక్టరేట్‌, న్యూస్‌టుడే

గ్రామాల్లో పారిశుద్ధ్య పనులకు ప్రాధాన్యమిస్తూ నిత్యం ఇంటింటి నుంచి చెత్త సేకరణ జరగాలి.. డంపింగ్‌ యార్డులకు తరలించిన అనంతరం తడి చెత్త నుంచి కంపోస్టు ఎరువు తయారీకి చర్యలు తీసుకుంటున్నట్లు జిల్లా పంచాయతీ అధికారి జూపల్లి హరిప్రసాద్‌ తెలిపారు. జిల్లాలోని అన్ని గ్రామ పంచాయతీల్లో పర్యటించి, పరిస్థితులు పూర్తిగా అవగాహన చేసుకోవాల్సి ఉందన్నారు. పల్లె ప్రగతి కార్యక్రమంలో జూన్‌ 3 నుంచి చేపట్టాలని ముఖ్యమంత్రి సూచించినట్లు తెలిపారు. డీపీవోగా ఇటీవల బాధ్యతలు స్వీకరించిన ఆయనతో ‘న్యూస్‌టుడే’ ముఖాముఖి నిర్వహించింది. వివరాలు ఇలా...

డంపింగ్‌ యార్డులు, సెగ్రిగేషన్‌ షెడ్స్‌, శ్మశాన వాటికల వినియోగం ఎలా ఉంది?

జిల్లాలోని అన్ని గ్రామ పంచాయతీల్లో డంపింగ్‌ యార్డులు, సెగ్రిగేషన్‌ షెడ్స్‌, శ్మశాన వాటికల నిర్మాణం పూర్తయింది. ఇళ్లలో సేకరించిన చెత్తను ట్రాక్టర్లతో డంపింగ్‌ యార్డులకు తరలిస్తున్నారు. అక్కడ తడి, పొడి చెత్త వేరు చేసి తడి చెత్తతో కంపోస్ట్‌ ఎరువు తయారు చేస్తున్నారు. శ్మశాన వాటికలను అందరూ వినియోగించుకునేలా అవగాహన కల్పించాల్సి ఉంది.

గ్రామీణ క్రీడా ప్రాంగణాల ఎంపిక, నిర్వహణ ఎలా ఉంది?

ప్రతి గ్రామ పంచాయతీలో క్రీడా ప్రాంగణం ఏర్పాటు చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. అనువైన స్థలాలను రెవెన్యూ అధికారులు పరిశీలించి, ఎంపిక చేసి గ్రామ పంచాయతీకి అప్పగిస్తారు. క్రీడా ప్రాంగణం అభివృద్ధికి ప్రభుత్వం రూ.50 వేలు ఇస్తుంది. క్రీడా ప్రాంగణం చదును చేయటం, వాలీబాల్‌, క్రికెట్‌ కిట్స్‌ కొనుగోలు చేసి అందుబాటులో ఉంచుతారు. ఇతర గ్రామీణ క్రీడలను ప్రోత్సహిస్తారు.

గ్రామ పంచాయతీ కార్యదర్శులు డీఎస్‌ఆర్‌ అమలు ఎలా ఉంది?

ప్రతి పంచాయతీ కార్యదర్శి ఉదయం 7 గంటలకు యాప్‌లో లాగ్‌ఇన్‌ అవ్వాలి. యాప్‌లో సూచించిన రెండు రోడ్లు, రెండు డ్రెయిన్లు శుభ్రం చేయించి, ఫొటోలు 8 గంటల వరకు డీఎస్‌ఆర్‌ యాప్‌లో అప్‌లోడ్‌ చేయాలి. ఈ ప్రక్రియ అంతా హైదరాబాద్‌ నుంచి పర్యవేక్షిస్తారు.

వర్షాకాలం వస్తుంది కదా.. గ్రామాల్లో పారిశుద్ధ్యంపై ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు?

డీపీవో: ట్రాక్టర్‌ ట్రక్కు మధ్యలో రేకు అడ్డుగా ఉంచి రెండు భాగాలుగా చేసి తడి, పొడి చెత్త సేకరించాలి. ఇంటి యజమానులు సైతం తడి, పొడి చెత్త వేరు చేసి ఇవ్వాలి.ఈ మేరకు గ్రామాల్లో గృహిణులకు అవగాహన కార్యక్రమాలు చేపడతాం. డ్రైయిన్లలో పూడిక తొలగించటం, అంతర్గత రహదారులపై గోతులు పూడ్చటం, చెత్త, పిచ్చి చెట్లు తొలగించాలని పంచాయతీ కార్యదర్శులకు సూచించాం.


కొందరు సర్పంచులు, కార్యదర్శులు ట్రాక్టర్లను సొంత పనులకు ఉపయోగిస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి కదా..?

డీపీవో: గ్రామ పంచాయతీ ట్రాక్టర్లను దుర్వినియోగం చేసినట్లు రుజువైతే చర్యలు తీసుకుంటాం. ట్రాక్టర్లు, ట్రక్కుల, ట్యాంకర్లు వినియోగంపై గ్రామ పంచాయతీ కార్యదర్శులు పూర్తి బాధ్యత వహిస్తారు.


పన్నుల వసూలు ఎలా ఉంది?

* 2021-22 ఆర్థిక సంవత్సరానికి జిల్లాలో రూ.20.48 కోటకు గాను రూ.19.52 కోట్లు పన్నులు వసూలు చేశాం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు