logo

వైద్య సిబ్బంది పోస్టులు సగం ఖాళీ

తెలంగాణ వైద్య విధాన పరిషత్‌ ఆస్పత్రుల్లో ‘కార్పొరేట్‌ వైద్యం’ కలను కాసేపు పక్కనపెడితే.. దీర్ఘకాలంగా వేధిస్తున్న వైద్య సిబ్బంది కొరత సమస్య తీరడం లేదు. జిల్లావ్యాప్తంగా కొనసాగుతున్న ఆస్పత్రుల్లో నాడీ పట్టే వైద్యుడి నుంచి సేవలందించే స్టాఫ్‌ నర్సుల

Published : 23 May 2022 05:54 IST
కొత్తగూడెం వైద్య విభాగం, న్యూస్‌టుడే

సిబ్బంది కొరత నెలకొన్న ఇల్లెందు సీహెచ్‌సీ

తెలంగాణ వైద్య విధాన పరిషత్‌ ఆస్పత్రుల్లో ‘కార్పొరేట్‌ వైద్యం’ కలను కాసేపు పక్కనపెడితే.. దీర్ఘకాలంగా వేధిస్తున్న వైద్య సిబ్బంది కొరత సమస్య తీరడం లేదు. జిల్లావ్యాప్తంగా కొనసాగుతున్న ఆస్పత్రుల్లో నాడీ పట్టే వైద్యుడి నుంచి సేవలందించే స్టాఫ్‌ నర్సుల వరకు ఖాళీలు కొనసాగుతున్నాయి. మొత్తం 548 పోస్టులు మంజూరైనవి ఉంటే.. వాటిల్లో ప్రస్తుతం 265 మంది మాత్రమే విధులు నిర్వర్తిస్తున్నారు. సగం వరకు పోస్టులు ఇంకా భర్తీకి నోచని పరిస్థితుల్లో కార్పొరేట్‌ స్థాయి వైద్యం, స్థానికంగానే కాన్పులు వంటివి ఎలా నెరవేరతాయో ఉన్నతాధికారులకే తెలియాలి.


వేతనాల్లో వ్యత్యాసం.. విధులపై ప్రభావం

శాశ్వత ప్రాతిపదికన పోస్టుల నియామకాలు దాదాపు చేపట్టడం లేదు. తాత్కాలిక, ఔట్‌సోర్సింగ్‌ పద్ధతిలో భర్తీ ప్రక్రియ చేపట్టి తర్వాత చేతులు దులిపేసుకోవడం కొన్నేళ్లుగా మామూలైంది. వైద్యులు మొత్తం 68కి గాను రెగ్యులర్‌ 51, కాంట్రాక్టు పద్ధతిలో పనిచేసేవారు 17 మంది ఉన్నారు. నర్సింగ్‌లోనూ కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్‌ విధానంలో 9 మంది పనిచేస్తున్నారు. నేరుగా చేపట్టాల్సిన నియామకాల్లో 45 ఖాళీలున్నాయి. పారామెడికల్‌ విభాగంలోనూ రెగ్యులర్‌ ఉద్యోగులు తొమ్మిది మంది మాత్రమే. కాంట్రాక్టుగా ముగ్గురు, ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగులు 12 మంది పనిచేస్తున్నారు. ఈ విభాగంలో 58 మందిని నియమించాల్సి ఉంది. రెగ్యులర్‌ వైద్యులు, సిబ్బందికి.. కాంట్రాక్టు బేసిక్‌పై పనిచేస్తున్న వారికి అందించే వేతనాల్లో భారీ వ్యత్యాసం ఉంటోంది. దీంతో వారి మధ్య విభేదాలు, ఆధిపత్య పోరు నెలకొనడం సేవలపైనా ప్రభావం చూపుతోంది. ఇది గమనించి కొత్తగా ముఖాముఖీలు నిర్వహించినా చాలా మంది ముందుకు రావడం లేదని ఉన్నతాధికారులు భావిస్తున్నారు.

* వీటన్నింటినీ పరిష్కరించి అన్ని విభాగాలను పరిపుష్ఠం చేస్తేనే ప్రభుత్వం ఆకాంక్షిస్తున్న అత్యున్నత స్థాయి సేవలు అందరికీ చేరువవుతాయి. లేదంటే కొందరు తాత్కాలిక వైద్యులు ప్రాక్టీసు చేసే ప్రైవేటు దవాఖానాలకు ప్రభుత్వాసుపత్రులకు వచ్చే రోగులను తరలింపు కొనసాగుతూనే ఉంటుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని