logo

పేద కుటుంబానికి.. పెద్ద కష్టం

మండలంలోని రుద్రాక్షపల్లికి చెందిన ఓ పేద కుటుంబానికి పెద్ద కష్టం వచ్చింది. ఇంటి పెద్దదిక్కు హోదాలో భార్య, పిల్లలకు అండగా నిలిచి వారి బాధ్యతలను చూసుకోవాల్సిన వ్యక్తి ప్రమాదంలో గాయపడి ఐదేళ్లుగా మంచానికే పరిమితమయ్యారు.

Published : 23 May 2022 06:08 IST

ఐదేళ్లుగా మంచానికే పరిమితమైన కుంటా శివ

సత్తుపల్లి, న్యూస్‌టుడే: మండలంలోని రుద్రాక్షపల్లికి చెందిన ఓ పేద కుటుంబానికి పెద్ద కష్టం వచ్చింది. ఇంటి పెద్దదిక్కు హోదాలో భార్య, పిల్లలకు అండగా నిలిచి వారి బాధ్యతలను చూసుకోవాల్సిన వ్యక్తి ప్రమాదంలో గాయపడి ఐదేళ్లుగా మంచానికే పరిమితమయ్యారు. ఫిజియోథెరపీ చేయించుకోవాలని వైద్యులు సూచించినా.. వారు నివాసం ఉండే ప్రాంతంలో ఆ అవకాశం లేక... ఆర్థిక స్థోమతా లేక నేటికీ అచేతన స్థితిలోనే ఉన్నారు.

* రుద్రాక్షపల్లికి చెందిన కుంటా శివ, లక్ష్మి దంపతులకు ఇద్దరు సంతానం. ఎంతో ఆనందంగా సాగుతున్న వీరి కుటుంబంపై విధి చిన్నచూపు చూసింది. ఐదేళ్ల క్రితం చింతలపూడిలో తిరునాళ్లకు వెళ్లిన శివ అక్కడ చోటుచేసుకున్న ప్రమాదంలో పందిరి గుంజ శివ వెన్నెముకపై పడింది. దీంతో ఆయన రెండు కాళ్లూ స్పర్శ లేకుండా పోయాయి.

* ఖమ్మంలోని మమత ఆసుపత్రిలో వైద్యం చేయించగా వైద్యులు ఫిజియోథెరపీ చేయించుకోవాలని సూచించి ఇంటికి పంపారు. గ్రామంలోని ఇల్లు మినహా ఆ కుటుంబానికి ఎలాంటి ఆస్తిపాస్తులు లేవు. మందులూ నెలకు రూ.5వేల వరకు అవుతాయి. ప్రస్తుతం శివ భార్య లక్ష్మి రోజూ కూలికి వెళ్లి వచ్చిన సొమ్ముతో కుటుంబ పోషణకు, శివ మందులకు వినియోగిస్తూ తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

* కాళ్లు పడిపోయి మంచానికే పరిమితమైన శివ కనీసం వ్యక్తిగత పనులూ చేసుకునే స్థితిలో లేకపోవడంతో ఇంట్లో అతనికి తోడుగా చిన్న వయసున్న కుమారుడు, కుమార్తె ఉంటున్నారు. స్కూల్‌ మానేసి మరీ తండ్రికి అన్నం తినిపించడం, సమయానికి మందులు వేయడం వంటి సపర్యలు చేస్తున్నారు. ఆయనకు వికలాంగ పింఛనూ లభించలేదు. ప్రభుత్వ అధికారులు పింఛను మంజూరు చేయాలని, దాతలు చేయూత ఇవ్వాలని ఆ కుటుంబం కోరుకుంటోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని