logo

సత్తుపల్లికి త్వరలో రైలు కూత

రైలు మార్గం ద్వారా సత్తుపల్లిలోని ఉపరితల గనుల నుంచి బొగ్గు రవాణా చేసేందుకు సర్వం సిద్ధమైంది. ఇక నుంచి రైలు మార్గం ద్వారా దేశ నలుమూలలకు సత్తుపల్లి బొగ్గు తరలిపోనుంది. ఏడాదికి 10 మిలియన్‌ టన్నుల బొగ్గు రవాణా సాధించే క్రమంలో పర్యావరణం దెబ్బతినకుండా మేలు జరిగేలా,

Updated : 24 May 2022 06:51 IST

ఏడాదికి 10 మిలియన్‌ టన్నుల బొగ్గు రవాణా లక్ష్యం

రైలు మార్గం ద్వారా సత్తుపల్లిలోని ఉపరితల గనుల నుంచి బొగ్గు రవాణా చేసేందుకు సర్వం సిద్ధమైంది. ఇక నుంచి రైలు మార్గం ద్వారా దేశ నలుమూలలకు సత్తుపల్లి బొగ్గు తరలిపోనుంది. ఏడాదికి 10 మిలియన్‌ టన్నుల బొగ్గు రవాణా సాధించే క్రమంలో పర్యావరణం దెబ్బతినకుండా మేలు జరిగేలా, రోడ్డు ప్రమాదాలను అరికట్టేలా భద్రాచలం రోడ్డు నుంచి సత్తుపల్లి జేవీఆర్‌ ఓసీకి చేపట్టిన రైలు మార్గం ఎట్టకేలకు పూర్తయ్యింది. 

జేవీఆర్‌, కిష్టారం ఓసీల నుంచి నాణ్యమైన బొగ్గు తరలించేందుకు ఇప్పటికే దాదాపు రూ.400కోట్లతో అత్యాధునిక పద్ధతిలో నిర్మించిన కోల్‌ హ్యాడ్లింగ్‌ ప్లాంట్‌(సీహెచ్‌పీ) సైతం పూర్తికాగా.. మరో వైపు రూ.1000 కోట్లతో చేపట్టిన రైల్వే లైను పనుల్ని, మరో రూ.200 కోట్లతో చేపట్టిన రైల్వే సైడింగ్‌ పనులను అధికారులు పూర్తి చేశారు. రెండు, మూడు రోజుల్లో రైలు మార్గంలో బొగ్గు రవాణా చేసే ప్రక్రియను లాంఛనంగా ప్రారంభించేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు.

*  ఇందుకోసం దక్షిణ మధ్య రైల్వే అధికారులతోపాటు సింగరేణి డైరెక్టర్లు, జీఎం, ఇతర అధికారులు రైలు ఇంజన్‌తో ట్రైల్‌రన్‌ వేశారు. సత్తుపల్లిలోని బొగ్గు గనులు యావత్‌ సింగరేణికే మణిహారంగా నిలవనున్నాయి. సత్తుపల్లి పరిసర ప్రాంతంలో మరో 30 నుంచి 40 ఏళ్లపాటు బొగ్గు వెలికి తీసే అవకాశం ఉండటంతో ఆ దిశగా అధికార యంత్రాంగం ప్రణాళికలను సిద్ధం చేస్తోంది.

* ఇప్పటికే సత్తుపల్లి ఓసీ-1 పూర్తి కాగా ఓసీ-2లో 237 మిలియన్‌ టన్నుల బొగ్గు నిక్షేపాలు తీయనుంది. ఓసీ-2లో ఇప్పటి వరకు 8 మిలియన్‌ టన్నుల బొగ్గును వెలికితీయగా మరో 229 టన్నుల బొగ్గు నిక్షేపాలు ఉన్నాయి. అదేవిధంగా కిష్టారం ఓసీలో మొత్తం 21.61 మిలియన్‌ టన్నుల బొగ్గు తీయాల్సి ఉండగా ఇప్పటి వరకు 3.70 మిలియన్‌ టన్నులు తీశారు. మరో 17.91 మిలియన్‌ టన్నుల బొగ్గును తీసేందుకు అధికారులు లక్ష్యంగా పెట్టుకున్నారు.్చ

రోజుకు 30వేల టన్నుల తరలింపు 

సత్తుపల్లి నుంచి రోజుకు 30వేల టన్నుల బొగ్గు రవాణా చేసేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. జేవీఆర్‌ ఓసీ-2లో రోజుకు 30వేల టన్నులను మూడు షిప్టుల్లో వెలికి తీస్తుండగా కిష్టారం ఓసీలోనూ మరో 7 మిలియన్‌ టన్నుల బొగ్గు ఉత్పత్తి అవుతోంది. దీంతో రోజుకు సీహెచ్‌పీ ద్వారా 30వేల టన్నులను రైలు వ్యాగన్ల ద్వారా తరలించేందుకు సింగరేణి అధికారులు ప్రణాళికలను సిద్ధం చేశారు. అంతేగాకుండా ప్రైవేటు లారీలకూ మార్కెట్‌ను బట్టి బొగ్గు లోడింగ్‌ ఇచ్చే అంశాలపై సింగరేణి అధికారులు నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. 

తగ్గనున్న రోడ్డు ప్రమాదాలు.. 

రైలు మార్గం పూర్తయిన నేపథ్యంలో రోడ్డు ప్రమాదాల సంఖ్య గణనీయంగా తగ్గే అవకాశం ఉంది. ప్రస్తుతం సత్తుపల్లి నుంచి కొత్తగూడెంకు కంపెనీ టిప్పర్లతోపాటు ప్రైవేటు లారీలు, టిప్పర్ల ద్వారానూ బొగ్గును తరలిస్తున్నారు. బొగ్గు లారీలు, టిప్పర్లు రోజుకు 600 వరకు తిరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో దాదాపు 16 ఏళ్లుగా అనేక రోడ్డు ప్రమాదాలు చోటుచేసుకుని పలువురు మృత్యువాత పడ్డారు. రైలు మార్గం ద్వారా బొగ్గు రవాణా ఆరంభమైతే ఈ ప్రమాదాలు తగ్గుతాయని పలువురు భావిస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని