logo

నిధుల కోసం నీరీక్షణ

జిల్లాలో ‘మన ఊరు- మన బడి’ పథకం నత్తనడకన సాగుతోంది. పథకం కోసం ప్రభుత్వం ఇప్పటి వరకు కేవలం రూ.2 కోట్లు మాత్రమే మంజూరు చేసింది. వీటిలో విడుదలైనవి రూ.82,898 మాత్రమే. ఇవి ఏమూలకు సరిపోయేలా లేవు. నిధుల కోసం ఎదురు చూస్తున్నారు.

Published : 24 May 2022 02:07 IST

నత్తనడకన ’మన ఊరు- మన బడి’

ఖమ్మం విద్యావిభాగం, న్యూస్‌టుడే

ఖమ్మం గ్రామీణ మండలం జలగం నగర్‌ జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల

జిల్లాలో ‘మన ఊరు- మన బడి’ పథకం నత్తనడకన సాగుతోంది. పథకం కోసం ప్రభుత్వం ఇప్పటి వరకు కేవలం రూ.2 కోట్లు మాత్రమే మంజూరు చేసింది. వీటిలో విడుదలైనవి రూ.82,898 మాత్రమే. ఇవి ఏమూలకు సరిపోయేలా లేవు. నిధుల కోసం ఎదురు చూస్తున్నారు. మొదటి విడతలో 258 పాఠశాలలు ఎంపిక చేస్తే వాటిలో ఇప్పటి వరకు 27 స్కూళ్లలో మాత్రమే పనులు ప్రారంభించారు. ఎన్‌ఆర్‌ఐలు గానీ, ఇతర దాతలుగానీ ఇప్పటి వరకు ఎలాంటి ఆర్థిక సాయం ప్రకటించలేదు. ఖమ్మం నగరంలో ఈ పథకం కింద అత్యధికంగా 26 స్కూళ్లు ఎంపికయ్యాయి.

వీరికి నిర్మాణ బాధ్యత
జిల్లాలో మొత్తం ఏడుగురు ఇంజినీరింగ్‌ శాఖల అధికారులకు పాఠశాలల నిర్మాణ బాధ్యతలను ప్రభుత్వం అప్పగించింది. ఈఈ ఆర్‌అండ్‌బీ, ఈఈ పీఆర్‌, ఖమ్మం నగరపాలక సంస్థ ఇంజినీరింగ్‌ విభాగం, ఈఈ పీఆర్‌ సత్తుపల్లి, ఈఈ ఆర్‌అండ్‌బీ సత్తుపల్లి, టీఎస్‌డబ్ల్యూ ఐడీసీ, గిరిజన సంక్షేమ ఇంజినీరింగ్‌ విభాగాలు.. గిరిజన మండలాలైన ఏన్కూరు, కామేపల్లి, కారేపల్లిలో నిర్మాణాల బాధ్యతను గిరిజన సంక్షేమ శాఖ ఇంజినీరింగ్‌ అధికారులకు అప్పగించారు.

వాస్తవ అవసరాల మేరకే పనులు
ప్రస్తుతం వాస్తవ అవసరాల మేరకే పనులు చేపట్టాలని కలెక్టర్‌ సూచించారు. మొత్తం ఫ్లోరింగ్‌ తీయవద్దని, విద్యార్థుల సంఖ్యకనుగుణంగా మరుగుదొడ్ల నిర్మాణం చేపట్టాలని, ప్రస్తుతం ఉన్న వంట గదులకు అవసరమైన మరమ్మతులు చేయాలని, వంట గదులు లేని చోట మాత్రమే కొత్త వాటిని నిర్మించాలని నిర్ణయించారు. ప్రస్తుతం ఆర్‌ఎంఎస్‌ఏ, ఎస్‌ఎస్‌ఏ ద్వారా పాఠశాలల్లో పురోగతిలో ఉన్న పనులు మినహాయించి ‘మన ఊరు- మనబడి’ పనులను ప్రతిపాదనల మేరకు చేపట్టనున్నారు.
* ఖమ్మంలోని ఎన్‌ఎస్‌పీ ప్రభుత్వ ఉన్నత పాఠశాల జిల్లాలో అత్యధికంగా విద్యార్థులున్న విద్యాలయాల్లో ఒకటి. ఇది మొదటి విడతలో ఎంపికైంది. ప్రహరీ, వంట గదులు, డైనింగ్‌ హాల్‌, డిజిటల్‌ తరగతి గదులు, గ్రీన్‌ బోర్డులు, తొమ్మిది మరుగుదొడ్ల కోసం ప్రతిపాదనలు చేశారు. ఇప్పటి వరకు ఒక్క పని కూడా మొదలు పెట్టలేదు.
* ఖమ్మం గ్రామీణ మండలంలోని జలగంనగర్‌ జడ్పీ ఉన్నత పాఠశాల ఈ పథకం కింద ఎంపికైంది. డైనింగ్‌ హాల్‌ నిర్మాణం, రెండు మరుగుదొడ్లు, భవనాలకు రంగులు వేసే పనులు మంజూరు చేశారు. వీటిలో ఇప్పటి వరకు ఏ ఒక్క పని ప్రారంభం కాలేదు.
* కొణిజర్ల జడ్పీ ఉన్నత పాఠశాలకు వైరింగ్‌, డైనింగ్‌ హాల్‌ నిర్మాణం, పైకప్పు మరమ్మతులు, ప్రహరీ, మరుగుదొడ్ల నిర్మాణాలకు ప్రతిపాదనలు చేశారు. వీటిలో ఇప్పటి వరకు ఒక్క పనికూడా మొదలు కాలేదు.


పనుల్లో జాప్యం...
జూన్‌ 12 నుంచి రాష్ట్రంలో పాఠశాలలు ప్రారంభం కానున్నాయి. ఈలోగా పనులు జరిగితే చాలా వరకు ఉపయోగకరంగా ఉండేవి. పాఠశాలలు ప్రారంభమైన తర్వాత పనులు జరుగుతుంటే విద్యార్థులకు ఇబ్బందిగా ఉంటుంది. దీనికి తోడు వర్షాకాలం కావటం వల్ల అనేక సమస్యలు ఎదురవుతాయి. కలెక్టర్‌ గౌతమ్‌ ఈ పథకంపై ప్రత్యేక దృష్టి పెట్టారు. జిల్లా వ్యాప్తంగా ఉన్న అనేక పాఠశాలలను విస్తృతంగా సందర్శించారు. ఇంజినీరింగ్‌ అధికారులకు, పాఠశాల ప్రధానోపాధ్యాయులకు, యాజమాన్య కమిటీలకు కూడా పథకం ప్రాధాన్యం వివరించారు. పనులు వేగవంతం చేయాలని ఎప్పటికప్పుడు సమీక్ష సమావేశాలు నిర్వహించి అధికారులకు సూచనలు చేస్తున్నారు.


 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని