logo

పెళ్లి ట్రాక్టరు బోల్తా.. మహిళ దుర్మరణం

బంధువులంతా కలిసి ట్రాక్టరులో పెళ్లి వేడుకకు వెళ్తుండగా వాహనం బోల్తా పడిన ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో చోటుచేసుకుంది. ప్రమాదం నుంచి నవ వధువు స్వల్పగాయాలతో బయటపడగా ఓ మహిళ మృతిచెందారు. నలుగురి పరిస్థితి విషమంగా ఉంది. పాల్వంచ మండలం మందరికలపాడుకు చెందిన మడవి

Published : 24 May 2022 02:07 IST

పాల్వంచ గ్రామీణం, న్యూస్‌టుడే


పాయికే మృతదేహం

బంధువులంతా కలిసి ట్రాక్టరులో పెళ్లి వేడుకకు వెళ్తుండగా వాహనం బోల్తా పడిన ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో చోటుచేసుకుంది. ప్రమాదం నుంచి నవ వధువు స్వల్పగాయాలతో బయటపడగా ఓ మహిళ మృతిచెందారు. నలుగురి పరిస్థితి విషమంగా ఉంది. పాల్వంచ మండలం మందరికలపాడుకు చెందిన మడవి అందయ్య, జోగమ్మల కుమార్తె బండికి బూర్గంపాడు మండలం టేకులచెరువుకు చెందిన ఊరయ్యతో వివాహం కుదిరింది. సోమవారం సాయంత్రం ముహూర్తం ఉండటంతో నవ వధువు సహా మొత్తం 46 మంది బంధువులు మధ్యాహ్నం ట్రాక్టరులో బయల్దేరారు. నాలుగు కి.మీ. దూరం వెళ్లగానే మొండికట్ట గ్రామం వద్ద మలుపులో ట్రాక్టరు అదుపు తప్పి బోల్తాపడింది. కొందరు ప్రమాదాన్ని ఊహించి కిందకు దూకేశారు. ట్రక్కు బోల్తాపడటంతో వధువు బంధువు, ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రం బీజాపూర్‌జిల్లా ధర్మారం (పామేడు) గిరిజన గూడేనికి చెందిన సోడి పాయికే(30) అక్కడికక్కడే మృతిచెందింది. మడివి సురేశ్‌(12), రమేశ్‌(35), శివాజీ(10)తో పాటు నందయ్య(30), మడవి కుమారి(10) తీవ్రంగా గాయపడ్డారు. వీరి ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉండటంతో ఖమ్మం తరలించారు. మిగిలిన వారికి పాల్వంచ ఏరియా ఆసుపత్రిలో వైద్యం చేయిస్తున్నారు. మృతురాలికి భర్త, ఇద్దరు పిల్లలున్నారు. డ్రైవర్‌ అందారావుపై పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రమాదంతో వివాహం ఆగిపోయింది.

హాహాకారాలు..
ప్రమాదంలో చిన్నారులు, పెద్దలు సహా ట్రాక్టరులో వెళ్లిన ప్రతిఒక్కరూ గాయాలపావగా.. సుమారు పది మందికి కాళ్లు, చేతుల్లో ఏదో ఒకటి విరిగినట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. వారిని వెంటనే ‘108’ సిబ్బంది పాల్వంచకు, అక్కడ్నుంచి ఖమ్మంలోని ఆసుపత్రులకు తరలించి చికిత్స చేయిస్తున్నారు. క్షతగాత్రుల్లో ఆరుగురికి తలకు, మరో 20 మంది కాళ్లు, చేతులకు గాయాలై హాహాకారాలు చేశారు. గాయపడ్డవారిలో 14 మంది 15 ఏళ్లలోపు బాలలున్నారు. సురేశ్‌(12), శివాజీ(10) అనే చిన్నారుల పరిస్థితి విషమంగా ఉండటంతో ఖమ్మం తరలించినట్లు బంధువులు తెలిపారు. పాల్వంచ ఆసుపత్రిలో చేరిన 36 మంది క్షతగాత్రులలో.. రాజా, అయితీ, లక్ష్మయ్య, ఎం.లక్ష్మయ్య, చెన్నారావు, దేవి, నందా, ఎం.దేవి, కుమారి, పద్దం దేవి, నందిని, పూజ, జ్యోతి, కుమారి, కుంజాదేవి, మడకం లక్ష్మి, రాకేశ్‌, జ్యోతి, బీమా తదితరులున్నారు. గాయాలతో బోరున విలపిస్తున్న చిన్నారులను చూసి చూపరులు కంటతడిపెట్టారు. క్షతగాత్రులకు మూడు వార్డుల్లో చికిత్స అందిస్తున్నారు. పాల్వంచ పట్టణం, గ్రామీణం పోలీసులు, ఆసుపత్రి సిబ్బంది వారితో పాటు బంధువులకు భోజనాలు సమకూర్చి మానవత చాటారు.

తక్షణ సాయం...
మొండికట్టలో పెళ్లి ట్రాక్టర్‌ బోల్తాపడిందని తెలుసుకున్న జిల్లా కాంగ్రెస్‌ నాయకుడు ఎడవల్లి కృష్ణ సమీపంలో జరుగుతున్న ‘రచ్చబండ’ కార్యక్రమాన్ని నిలిపివేసి వెళ్లారు. క్షతగాత్రులను 108తో పాటు తమ ప్రచార వాహనంలో పాల్వంచ ఆస్పత్రికి తరలించారు. సీపీఐ మండల నాయకుడు పూర్ణచందర్‌రావు క్షతగాత్రులను పరామర్శించారు. కొందరి ఖర్చుల కోసం రూ.5 వేల సాయం తక్షణం అందించారు. వనమా వెంకటేశ్వరరావు కూడా బాధితులను పరామర్శించారు. వైద్యం అందించాలని,  భోజనాలు ఏర్పాటు చేయాలని వైద్యులను ఆదేశించారు.  

 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని