logo

అట్టహాసంగా హనుమజ్జయంతి ఉత్సవాలు

భద్రాచలం రామాలయంలో మూడు రోజుల పాటు నిర్వహించనున్న హనుమాన్‌ జయంతి వేడుకలు సోమవారం అట్టహాసంగా ఆరంభమయ్యాయి. తొలిరోజు ఉదయం సుందరాకాండ పారాయణం భక్తిశ్రద్ధలతో సాగింది. కార్యాలయ ఉద్యోగులకు ఆలయం వద్ద బాధ్యతలను అప్పగించారు

Published : 24 May 2022 02:24 IST

రాముణ్ని దర్శించుకున్న జస్టిస్‌ సీతారామమూర్తి

భద్రాచలం, న్యూస్‌టుడే: భద్రాచలం రామాలయంలో మూడు రోజుల పాటు నిర్వహించనున్న హనుమాన్‌ జయంతి వేడుకలు సోమవారం అట్టహాసంగా ఆరంభమయ్యాయి. తొలిరోజు ఉదయం సుందరాకాండ పారాయణం భక్తిశ్రద్ధలతో సాగింది. కార్యాలయ ఉద్యోగులకు ఆలయం వద్ద బాధ్యతలను అప్పగించారు. ఇప్పటికే అంజన్న భక్తుల తాకిడి పెరిగింది. కొంతమంది ఇక్కడ ఇరుముళ్లు సమర్పిస్తున్నారు. కొండగట్టులోని ఆంజనేయుడి ఆలయంలో నిర్వహించే ఉత్సవాలకు భద్రాచలం రామాలయం నుంచి పట్టు వస్త్రాలను అధికారికంగా పంపించారు. 25న ఆంజనేయుడి కోవెలలో ప్రత్యేక అభిషేకాలు తమలపాకుల పూజలుంటాయి.

సీతారామ కల్యాణోత్సవం: ప్రధాన ఆలయంలో ముత్యాలతో పొదిగిన వస్త్రాలంకృతులైన శ్రీసీతారాముల దర్శనంతో భక్తుల మది పులకించింది. బేడా మండపం వద్ద క్షేత్ర విశిష్టతను ప్రవచనం చేసిన తీరు మంత్రముగ్ధులను చేసింది. వైష్ణవ సంప్రదాయం ప్రకారం విష్వక్సేనుణ్ని ఆరాధించి పుణ్యాహ వాచనం నిర్వహించి కంకణ ధారణ చేశారు. కన్యాదానం కమనీయమై నిలవగా సీతమ్మకు యోక్త్రధారణ, రామయ్యకు యజ్ఞోపవీత ధారణ అట్టహాసంగా సాగింది. మాంగళ్యధారణతో ప్రతీ మది పులకించింది. దర్బారు సేవను భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్‌ మానవ హక్కుల కమిషన్‌ ఛైర్మన్‌ జస్టిస్‌ ఎం.సీతారామమూర్తి రాముణ్ని దర్శించుకోవడంతో సూపరింటెండెంట్‌ శ్రీనివాస్‌ సాదరంగా ఆహ్వానం పలికారు. ఈయన వెంట భద్రాచలం జ్యుడీషియల్‌ మొదటిశ్రేణి మెజిస్ట్రేట్‌ సురేశ్‌ ఉన్నారు.
 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు