logo

ప్రశాంతంగా పది పరీక్షలు

జిల్లాలో పదో తరగతి పరీక్షలు తొలి రోజు సోమవారం ప్రశాంతంగా ప్రారంభమయ్యాయి. ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.45 గంటల వరకు పరీక్ష జరిగింది. విద్యార్థులు గంట ముందే తమ కేంద్రాలకు చేరుకున్నారు. నిర్వాహకులు గంట ముందే లోపలకు అనుమతించారు.

Published : 24 May 2022 02:24 IST

పాల్వంచ బొల్లోరిగూడెం పరీక్ష కేంద్రం వద్ద విద్యార్థులు

పాల్వంచ విద్యావిభాగం, న్యూస్‌టుడే: జిల్లాలో పదో తరగతి పరీక్షలు తొలి రోజు సోమవారం ప్రశాంతంగా ప్రారంభమయ్యాయి. ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.45 గంటల వరకు పరీక్ష జరిగింది. విద్యార్థులు గంట ముందే తమ కేంద్రాలకు చేరుకున్నారు. నిర్వాహకులు గంట ముందే లోపలకు అనుమతించారు. జిల్లావ్యాప్తంగా 75 కేంద్రాల్లో తెలుగు పరీక్ష మొదలవగా.. ఆయాచోట్ల బందోబస్తు కట్టుదిట్టంగా ఏర్పాటు చేశారు. జిల్లాలో 13,334 మంది రెగ్యులర్‌ విద్యార్థులకు గాను 13,080 మంది హాజరయ్యారు. 254 మంది గైర్హాజరయ్యారు. కేంద్రాల్లో సరైన సదుపాయాలు లేక విద్యార్థులు ఇబ్బందులుపడ్డారు. పాల్వంచ కిన్నెరసాని గురుకులం ‘సీ’ కేంద్రంలో లోపలకు వెళ్లేందుకు ఎండలోనే నిల్చున్నారు. షామియానాలు కూడా ఏర్పాటు చేయలేదు. పాల్వంచ బొల్లోరిగూడెం జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో తాగునీటి బాటిళ్లను అనుమతించక పోవడంపై తల్లిదండ్రులు అభ్యంతరం తెలిపారు. నిబంధనల ప్రకారం అనుమతి ఉందన్నారు. పరీక్ష ప్రారంభ సమయానికి పలుచోట్ల తాగునీరు లేక ఇబ్బందులు పడాల్సి వచ్చింది. కొత్తగూడెం మర్వాడీ క్యాంపు ఏరియాలోని ఆనందఖని పాఠశాల కేంద్రంలో హాల్‌టిక్కెట్ల నంబర్లు చూసుకునేందుకు మురుగు కాలువ పక్కన అవస్థలు పడ్డారు. మణుగూరు మండలంలోని సమితి సింగారం పాఠశాలలో గాలిపంకాలు లేక ఉక్కపోతతో అల్లాడారు.

అధికారుల తనిఖీలు: జిల్లా కలెక్టర్‌ దురిశెట్టి అనుదీప్‌ కొత్తగూడెం, చుంచుపల్లి మండలాల్లోని బాబుక్యాంపు, కోర్టు సమీపంలోని ఉన్నత పాఠశాలలోని పది పరీక్ష కేంద్రాలను ఆకస్మికంగా సందర్శించారు. సీసీకెమెరాల పనితీరును పరిశీలించారు. ఎలాంటి లోపాలు లేకుండా పకడ్బందీగా నిర్వహించాలని నిర్వాహకులను ఆదేశించారు. సమయం ముగిసే వరకు విద్యార్థులను బయటకు విడిచిపెట్టొద్దన్నారు. ఆ సమయంలో కలెక్టర్‌ తన చరవాణిని వెంట తీసుకెళ్లలేదు. డీఈవో సోమశేఖరశర్మ భద్రాచలం, బూర్గంపాడు, ములకలపల్లి మండలాలోని ఆరు పరీక్ష కేంద్రాలను సందర్శించారు. అక్కడి వసతులపై ఆరా తీశారు. అయిదు ఫ్లైయింగ్‌ స్వ్కాడ్‌ బృందాలు 28 పరీక్ష కేంద్రాలను తనిఖీ చేశాయి.  
 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని