logo

ముదిమి వయసు.. చదువు రుచి తెలుసు

నిరక్షరాస్యులను చైతన్యపరిచేందుకు రెండు దశాబ్దాల క్రితం అక్షర దీపం, అక్షర భారతి కార్యక్రమాలకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. అప్పుడు లింగమ్మ వయసు 67 ఏళ్లు. వయసు ఎక్కువ ఉందని, వద్దని

Published : 25 May 2022 01:44 IST

జూలూరుపాడు, న్యూస్‌టుడే

పిల్లలతో కలిసి వృద్ధురాలు తాటి లింగమ్మ

నిరక్షరాస్యులను చైతన్యపరిచేందుకు రెండు దశాబ్దాల క్రితం అక్షర దీపం, అక్షర భారతి కార్యక్రమాలకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. అప్పుడు లింగమ్మ వయసు 67 ఏళ్లు. వయసు ఎక్కువ ఉందని, వద్దని వారించినా పట్టుదలతో చదువుకుంది. సంతకంతో సరిపుచ్చకుండా అక్షర మాలను వల్లెవేసింది. ఒక్కో అక్షరాన్ని ప్రోదిచేసి వాక్యాలుగా కూర్చింది. ఇంకేముంది ఆమె నోట పదాలు వెల్లువలా వచ్చేశాయి. విశేషం ఏమిటంటే 87 ఏళ్ల వయసులోనూ ఆ అక్షర బామ్మ పుస్తకాలు చదువుతోంది. చిన్నారులకు పాఠాలు చెబుతున్నారు.

జూలూరుపాడు మండలంలోని బేతాళపాడు పంచాయతీ రాచబండ్లకోయగూడెం గ్రామానికి చెందిన తాటి లింగమ్మకు చదువంటే ఇష్టం. వయోజన దశలో అక్షరాస్యురాలైనప్పటి నుంచి కాగితం ముక్క కనిపిస్తే చాలు ఇట్టే పట్టేసుకుని చదువుకుంటుంది. పుస్తకం కనిపిస్తే మనసు చదవాలని ఆరాటపడుతుంది. లింగమ్మ కుమారుడి కుటుంబంతో కలిసిఉంటోంది. తనే మునిమనవరాళ్లకు చదువు చెబుతోంది. బడిలో చెప్పిన పాఠాలు అర్థం కాకపోతే బామ్మ వద్దకు పుస్తకాలు పట్టుకుని వెళ్తుంటారు. ఈ వయసులోనూ కళ్లజోడు అవసరమే లేకుండా చకచకా చదివేస్తుంది. సంతకం పెడుతుంది. నడుము వంగిపోయినా ఎంతో చురుగ్గా కనిపిస్తోంది. మితంగా తినడమే తన ఆరోగ్య రహస్యమంటోంది.

ఓ రోజు ఏమైందంటే..

లింగమ్మకు ఆసరా పింఛను మంజూరైంది. బ్యాంకు నుంచి సొమ్ము తీసుకునేందుకు మనవరాలితో కలిసివెళ్లింది. వోచర్‌పై వేలిముద్ర వేయమని చెప్పినా సంతకమే చేస్తానని పట్టుపట్టింది. తీరా సంతకం చేసి తీసుకెళ్తే బ్యాంకు మేనేజర్‌ అభ్యంతరం పెట్టాడు. తన ముందు సంతకం చేస్తేగాని నమ్మనని చెప్పడంతో లింగమ్మ పెన్ను అందుకుని చకచకా తన పేరు రాసేసింది. ఆశ్చర్యపోవడం బ్యాంకు మేనేజర్‌ వంతైంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని