logo

వానొస్తే ముంపేనా?

జిల్లాలోని పురపాలికల్లో వర్షాకాలంలో నెలకొనే ప్రధాన సమస్య లోతట్టు ప్రాంతాల ముంపు. ముందస్తు చర్యలతో దీనికి అడ్డుకట్ట వేయాల్సిన అధికారులు, ప్రజాప్రతినిధుల్లో చలనమే పట్టించుకోకపోవడం

Published : 25 May 2022 01:44 IST

పురపాలకాల్లో కానరాని ముందస్తు జాగ్రత్త చర్యలు

కొత్తగూడెం-భద్రాచలం ప్రధాన రహదారిపైకి చేరిన వరద (దాచిన చిత్రం)

జిల్లాలోని పురపాలికల్లో వర్షాకాలంలో నెలకొనే ప్రధాన సమస్య లోతట్టు ప్రాంతాల ముంపు. ముందస్తు చర్యలతో దీనికి అడ్డుకట్ట వేయాల్సిన అధికారులు, ప్రజాప్రతినిధుల్లో చలనమే పట్టించుకోకపోవడం పరిపాటిగా మారింది. ముంపు నివారణ చర్యలపై పాలకవర్గం, అధికారులతో సమావేశాల్ని ఏర్పాటు చేసి చర్చించాలి. ఉభయ జిల్లాల్లోని పురపాలకాల్లో ఇప్పటి వరకు ఈ తరహా సన్నద్ధత ప్రారంభించనే లేదు.

కొత్తగూడెం అర్బన్‌, న్యూస్‌టుడే

వర్షాకాలం నేపథ్యంలో జిల్లాలోని పురపాలికల్లో ప్రమాద ఘంటికలు మోగడం సహజంగా మారింది. వర్షాలు కురిసే

సమయం సమీపిస్తున్న నేపథ్యంలో నాలాలను శుభ్రం చేయాల్సిన అవసరం ఉంది. వరద, మురుగు నీరు కాల్వల ద్వారా ప్రవహిస్తోంది. వీటి నిర్వహణ సక్రమంగా లేకపోవడం, పలు చోట్ల కొత్తగా నిర్మించకపోవడంతో అయిదు పురపాలకాల్లో భారీ వర్షాలు పడితే లోతట్టు జలమయం అవుతోంది. గతేడాది కురిసిన వర్షాలకు రోడ్లపై మోకాలి లోతు వరద చేరింది. ఈ సారి కూడా ఎలాంటి ఉపశమన ప్రణాళికలు లేకుండానే వర్షాకాలాన్ని ఎదుర్కోవడానికి అధికార యంత్రాంగం సిద్ధమవుతున్నట్లు కనిపిస్తోంది.

సమస్యకు ప్రధాన కారణాలు

* కాలువల కబ్జా: వరద ప్రవాహానికి కాల్వలు, వాగులే ఆధారం. వాటిని ఆక్రమించి నిర్మాణాలు చేపట్టారు. కొన్నిచోట్ల విద్యుత్తు స్తంభాలను మధ్యలోనే వదిలేసి డ్రెయిన్లు నిర్మించారు. ఇసుక, మట్టి, ఇళ్లల్లోంచి వెలువడే వ్యర్థాలు ప్లాస్టిక్‌ కాల్వల్లో పేరుకుపోతున్నాయి. ‘మిషన్‌ భగీరథ’ పనుల పేరుతో కాల్వలు ధ్వంసం చేసి వదిలేశారు.

* అనుసంధాన లోపాలు

లోతట్టు కాలనీలు ముంపునకు గురవడానికి గల ప్రధాన కారణాల్లో మరొకటి.. కాల్వలను ప్రధాన డ్రెయిన్లు, నాలాలకు అనుసంధానించకుండా వదిలేయడం. దీంతో ఏ ప్రాంతంలో వెలువడే మురుగు అక్కడే స్తంభిస్తోంది.

* పేరుకుపోతున్న పూడిక

వాగులు, చెరువులు, పంటకాల్వలు వంటి వాటిల్లో వ్యర్థాలు పారబోయడం.. నిర్వహణ లేక పిచ్చిచెట్లు పెరగడంతో ప్రవాహం లోతట్టు కాలనీలకు పోటెత్తుతోంది.

పాల్వంచలో వరద సమస్య తలెత్తే కాలనీలను గుర్తించాం. ప్రవాహం పెద్ద ఎత్తున వస్తే ముందుకు సాగేలా అవసరమైన చోట్ల యంత్రాలతో కందకాలు తీయిస్తున్నాం. గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని కాల్వలు ప్రధాన డ్రెయిన్లకు అనుసంధానం చేస్తున్నాం. పూడికతీత పనులు కొనసాగుతున్నాయి. కాల్వలు, నాలాలపై అక్రమ నిర్మాణాలు చేపడితే ఎట్టిపరిస్థితుల్లో కూల్చివేస్తామని అవగాహన కల్పిస్తున్నాం.

- సీహెచ్‌ శ్రీకాంత్‌, కమిషనర్‌, పాల్వంచ

పాల్వంచ

మున్సిపాల్టీ పరిధిలో శివనగర్‌, అయ్యప్పనగర్‌, వెంకటేశ్వరహిల్స్‌ కాలనీ, బంజారకాలనీ, ఇందిరానగర్‌కాలనీ, హమాలీకాలనీ, వనమాకాలనీ, జయమ్మకాలనీ, తెలంగాణ నగర్‌, గాంధీనగర్‌, ఒడ్డుగూడెం, కేసీఆర్‌నగర్‌, బాపూజీ నగర్‌కాలనీలు ప్రధాన లోతట్టు ప్రాంతాలు. సగం కాలనీల మురుగు, వరదంతా ఇక్కడికే వచ్చి చేరుతుంది. పట్టణంలో ఉన్న చెరువులు ఆక్రమణ చెరలో ఉండటంతో వరద ముందుకుపోవడానికి మార్గం ఉండటం లేదు. గతేడాది భారీ వర్షాలకు జరిగిన ప్రమాదాలతో ఇద్దరు మృతిచెందగా, రూ.లక్షల్లో ఆస్తినష్టం వాటిల్లింది.

ఇల్లెందు

పట్టణ నడిబొడ్డున ఉన్న బుగ్గవాగులో సింగరేణి, పురపాలకం ఆధ్వర్యంలో వ్యర్థాల తొలగింపు, పిచ్చిమొక్కల తొలగింపు ప్రక్షాళన చేయాల్సి ఉంది. కానీ అది జరగలేదు. ఈసారి కూడా పరిసర కాలనీలు ముంపునకు గురవడం తథ్యమని స్థానికులు వాపోతున్నారు. 5వ వార్డు లాల్‌బహుదూర్‌ శాస్త్రినగర్‌, 6, 7, 8 వార్డులో నంబర్‌-2 బస్తీ, 19వ వార్డులో ఆంబజార్‌ లోతట్టు ప్రాంతాలు. 2005లో కాలనీలు వరద విపత్తుకు విలవిలలాడాయి.

మణుగూరు

వాగుమల్లారం, అశోక్‌నగర్‌, ఆదర్శ్‌నగర్‌, సుందరయ్యనగర్‌, మేదరబస్తీ, ఇందిరానగర్‌, చాకలి ఐలమ్మనగర్‌, కాళీ మాత ఏరియాల్లో భారీ వర్షాలకు ముంపునకు గురవుతాయి. కోడిపుంజలవాగు, కట్టువాగుల్లో సింగరేణి, పురపాలకం ఆధ్వర్యంలో వాగుల్లో పూడికతీత చేపట్టాల్సి ఉంది. ఓబీ గుట్టలపై నుంచి వచ్చే వరద పలు కాలనీలను వణికిస్తోంది. ప్రవాహాన్ని మళ్లిస్తేనే ప్రయోజనం ఉంటుంది. ఏటా రూపొందిస్తున్న ప్రతిపాదనలు కాగితాలకే పరిమితం కావడం గమనార్హం.

కొత్తగూడెం

లోతట్టు ప్రాంతాలుగా ఉన్న ప్రశాంత్‌నగర్‌, పాతకొత్తగూడెం, ఎస్సీ, ఎస్టీ కాలనీలతో పాటుగా మరికొన్ని ఏరియాల్లో కాల్వల నిర్మాణం సరిగా లేక మురుగు ఇళ్లల్లోకి ప్రవహిస్తోంది. గత రెండు, మూడేళ్లుగా సమస్య జటిలమవుతున్నా పట్టింపులేదు.

మధిర

హనుమాన్‌కాలనీ, ఎంప్లాయీస్‌కాలనీ, వదర రాఘవాపురం, ముస్లిం కాలనీ, ఎస్సీ, ఎస్టీ కాలనీలను వరద సమస్య వేధిస్తోంది. ఇక్కడ ముంపు బెడద నివారణకు చర్యలు చేపట్టాలనే డిమాండ్‌ ఉంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని