logo

జీపు ఢీకొని వ్యక్తి దుర్మరణం

మోపెడ్‌ను జీపు ఢీకొన్న ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందాడు. ఈ ఘటన సత్తుపల్లిలో మంగళవారం తెల్లవారుజామున చోటుచేసుకుంది. ఎన్టీఆర్‌నగర్‌కు చెందిన చిరు వ్యాపారి

Published : 25 May 2022 01:44 IST

పొన్నంపల్లి చంద్రం

సత్తుపల్లి, న్యూస్‌టుడే: మోపెడ్‌ను జీపు ఢీకొన్న ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందాడు. ఈ ఘటన సత్తుపల్లిలో మంగళవారం తెల్లవారుజామున చోటుచేసుకుంది. ఎన్టీఆర్‌నగర్‌కు చెందిన చిరు వ్యాపారి పొన్నంపల్లి చంద్రం(60) జామకాయలు కొనుగోలు చేసేందుకు తన వాహనంపై వేంసూరు రోడ్డు నుంచి రింగ్‌ సెంటర్‌ వైపు వస్తున్నాడు. అదే సమయంలో సత్తుపల్లి నుంచి నూజివీడు వెళ్తున్న జీపు షాదీఖానా సమీపంలో ఎదురుగా వెళ్తున్న పంచాయతీ ట్రాక్టర్‌ను అధిగమించే క్రమంలో టీవీఎస్‌ను ఢీకొంది. అనంతరం కరెంటు స్తంభాన్నీ ఢీకొట్టింది. ప్రమాదంలో చంద్రం 40 అడుగుల దూరంలో రోడ్డు పక్కన పడి అక్కడికక్కడే మృతి చెందాడు. జీపు డ్రైవర్‌ పంతంగి గోపీకృష్ణ, సొంటి శ్రీరామ్‌ప్రసాద్‌కూ తీవ్ర గాయాలయ్యాయి. దయాకర్‌ అనే మరో వ్యక్తి పరారయ్యాడు. క్షతగాత్రులను స్థానిక సామాజిక ఆరోగ్య కేంద్రానికి తరలించి చికిత్స అందిస్తున్నారు. చంద్రానికి భార్య కుమారి, కుమారుడు వెంకటేశ్వరరావు ఉన్నారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.


వరుస చోరీల నిందితుని అరెస్టు

నేలకొండపల్లి, న్యూస్‌టుడే: వరుస చోరీలతో పోలీసులకు కంటి మీద కునుకు లేకుండా చేసిన అంతరాష్ట్ర దొంగను నేలకొండపల్లి పోలీసులు సోమవారం అరెస్టు చేశారు. వారు తెలిపిన వివరాల ప్రకారం.. మండల పరిధిలోని గువ్వలగూడెం, నేలకొండపల్లి, పైనంపల్లి గ్రామాల్లో ఇటీవల దొంగతనాలు జరిగాయి. వాటిలో లభించిన ఆధారాల ద్వారా నేలకొండపల్లి ఎస్సై స్రవంతి దర్యాప్తు చేశారు. ఈ మూడు దొంగతనాలను పాల్పడింది మధిర మండలం ఆత్కూరు గ్రామానికి చెందిన కంభంపాటి యేసోబు అలియాస్‌ సురేష్‌గా గుర్తించారు. నేలకొండపల్లి ఎస్సై ఆధ్వర్యంలో అతని ఆచూకీ గుర్తించి అరెస్టు చేశారు. ఇతనిపై మహబూబాబాద్‌ జిల్లాలోని గూడూరు, మరిపెడ ఠాణాల్లో, ఆంధ్రప్రదేశ్‌లోని కృష్ణా జిల్లా వీరులపాడు ఠాణాల్లో కేసులు నమోదయ్యాయి. మధిర గ్రామీణం, టౌన్‌, ఎర్రుపాలెం, సత్తుపల్లి, బోనకల్లు, వైరా, ఖమ్మం, ఏపీ ఎన్టీఆర్‌ జిల్లా గంపలగూడెం, నందిగామ, తిరువూరు ఠాణాల పరిధుల్లో పలు దొంగతనాలకు పాల్పడి జైలుకు వెళ్లి శిక్ష అనుభవించి వచ్చాడు. అయినప్పటికీ తన నేర ప్రవృత్తిని కొనసాగిస్తూ నేలకొండపల్లి పోలీసులకు మరోమారు చిక్కాడు. పోలీసులు ఇతని నుంచి 6 తులాల బంగారం, 25 తులాల వెండి వస్తువులు, 3.5 లక్షలు నగదు, టీవీ, సెల్‌ఫోన్‌, కూలర్‌లను స్వాధీనం చేసుకున్నారు. నేలకొండపల్లి ఎస్సై స్రవంతిని ఖమ్మం గ్రామీణ ఏసీపీ బస్వారెడ్డి అభినందించారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని