logo

తరుగు.. లేదంటే తిరస్కరణ

మూడు రోజుల క్రితం వేంసూరు మండలంలోని ఓ ధాన్యం కొనుగోలు కేంద్రం నుంచి ఖమ్మంలోని ఓ మిల్లుకు లారీలోడు ధాన్యం వచ్చింది. తేమ శాతం ఎక్కువగా ఉందని, ధాన్యం ఆరబెట్టాలని లేకుంటే క్వింటాకు 10 కిలోలు తరుగు తీయాలని మిల్లర్‌

Updated : 28 May 2022 06:27 IST

మిల్లర్ల కొర్రీలతో ధాన్యం రైతుల దైన్యం

ఖమ్మం కలెక్టరేట్‌, న్యూస్‌టుడే

కొనుగోలు కేంద్రంలో లారీలోకి ధాన్యం లోడింగ్‌

* మూడు రోజుల క్రితం వేంసూరు మండలంలోని ఓ ధాన్యం కొనుగోలు కేంద్రం నుంచి ఖమ్మంలోని ఓ మిల్లుకు లారీలోడు ధాన్యం వచ్చింది. తేమ శాతం ఎక్కువగా ఉందని, ధాన్యం ఆరబెట్టాలని లేకుంటే క్వింటాకు 10 కిలోలు తరుగు తీయాలని మిల్లర్‌ సూచించారు. లేదంటే వెనక్కి తీసుకెళ్లి ధాన్యం ఆరబెట్టి తీసుకురావాలని సూచించారు. దీంతో రైతులు లబోదిబోమంటూ తిరిగి కొనుగోలు కేంద్రానికి తరలించి ఆరబెట్టారు. లారీ రవాణా ఖర్చులు ఎవరు భరించాలో స్పష్టత లేదు. ధాన్యం ఆరబెట్టిన తర్వాత తీసుకెళ్లినా ఆ మిల్లర్‌ సక్రమంగా తీసుకుంటారో లేదో తెలియక రైతులు ఆందోళన చెందుతున్నారు.

* ఇటీవల తల్లాడ మండలంలోని ఓ కొనుగోలు కేంద్రం నుంచి ఖమ్మంలోని ఓ మిల్లుకు వచ్చిన ధాన్యం నాణ్యతా ప్రమాణాలకు అనువుగా లేదని మిల్లర్‌ 10 కిలోల తరుగు తీయాలని సూచించారు. అందుకు రైతులు అంగీకరించలేదు. ఓ ప్రజాప్రతినిధి దృష్టికి సమస్య వెళ్లింది. అయినా మిల్లర్‌ మాటే నెగ్గింది. రైతుల ధాన్యాన్ని వెనక్కి తిప్పి పంపారు.

..ఇలా ధాన్యం తిరస్కస్తుంటే చాలా మంది రైతులు ధాన్యాన్ని వెనక్కి తెచ్చుకోలేక, వారితో రాజీ పడి తరుగు తీసి ధాన్యాన్ని మిల్లర్లకు అప్పగిస్తున్నారు. తేమ శాతం ఎక్కువగా ఉందని, నాణ్యతా ప్రమాణాలకు అనుగుణంగా ధాన్యం లేదని, చెత్త, చెదారం ఎక్కువగా ఉందని సాకులు చెపుతూ క్వింటాకు 5 నుంచి 10 కిలోలు కోత పెడుతున్నారు.

ఏఈవోల ధ్రువీకరణకు విలువ లేదా?
రైతు తీసుకొచ్చిన ధాన్యం నాణ్యతా ప్రమాణాలు పరిశీలించి సంబంధిత ఏఈవో ధ్రువీకరణ పత్రం జారీ చేస్తారు. ఆ పత్రం ఆధారంగానే కొనుగోలు కేంద్రంలో ధాన్యం తూకం వేసి, రైతుల వివరాలు నమోదు చేస్తారు. అక్కడితో రైతు బాధ్యత ముగుస్తుంది. కానీ కేంద్రం నుంచి రవాణా అయిన ధాన్యాన్ని చివరి నిమిషంలో మిల్లర్‌ ఆపేసి నాణ్యత లేదంటూ అడ్డుకుంటున్నారు. అంటే ఏఈవో ధ్రువీకరణ తప్పుగా ఇచ్చారా...లేదా ఆ పత్రానికి విలువ లేదా అనే సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. వ్యవసాయ శాఖ రికార్డుల్లోనూ పంటల సాగు వివరాలు (క్రాప్‌ బుకింగ్‌) సక్రమంగా లేవని, రైతుల వివరాలు ఏఈవోలకు తెలియని పరిస్థితి ఉందనే అంశంపై చర్చనీయాంశంగా మారింది. చివరికి రైతులు మాత్రం అనేక ఇబ్బందులు పడుతున్నారు.

పొరుగు రాష్ట్రం నుంచి రాక
మరోవైపు పొరుగు రాష్ట్రం నుంచి కొందరు దళారులు సరిహద్దుల్లోని కొనుగోలు కేంద్రాలకు ధాన్యం అక్రమంగా పంపించి విక్రయిస్తున్నారనే ఆరోపణలున్నాయి. ఈ ఏడాది జిల్లాలో యాసంగి వరి సాగు చాలా తక్కువ. గతేడాది కంటే ఇప్పటికే సరిహద్దుల్లోని కొనుగోలు కేంద్రాల్లో ఎక్కువ మొత్తంలో ధాన్యం సేకరణ జరిగింది. పంట సాగు తక్కువైనా ధాన్యం మాత్రం ఎక్కువగా కొనుగోలు చేశారు. ఎలా సాధ్యమైందనే ప్రశ్న ఉత్పన్నం అవుతోంది. సత్తుపల్లి, వేంసూరు, నేలకొండపల్లి, పెనుబల్లి, కల్లూరు మండలాల్లోని కొన్ని కేంద్రాల్లో గతేడాది కంటే ప్రస్తుత సీజన్‌లో ఎక్కువ ధాన్యం సేకరించినట్లు తెలుస్తోంది.


యాసంగి ధాన్యం సేకరణ మరో వారం రోజుల్లో పూర్తవుతుంది. నాణ్యతా ప్రమాణాల పేరుతో కొన్ని చోట్ల మిల్లర్లు తరుగు తీస్తామంటే అంగీకరించలేదు. కొన్ని కేంద్రాల్లో గతేడాది కంటే ఈసారి ఎక్కువ సేకరణ జరిగినట్లు సమాచారం ఉంది. సేకరణ ప్రక్రియ ముగిసిన తర్వాత గణాంకాలు పరిశీలించాల్సి ఉంటుంది. రైతుల బ్యాంకు ఖాతాలకు నగదు జమలో ఇబ్బంది లేదు.

-నరసింహారావు, సహాయ మేనేజర్‌, పౌరసరఫరాల సంస్థ, ఖమ్మం


 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని