logo

నిత్య సాధనతో యూనిఫాం ఉద్యోగాలు చేరువ

గంటల తరబడి ఏకాగ్రతతో చదివిన వారికే ఉద్యోగాలు వస్తాయి. అదే యూనిఫాం కొలువులైతే తెలివైన సాధకులు మాత్రమే సాధిస్తారు. ఇప్పుడున్న కానిస్టేబుల్‌, సివిల్‌ ఎస్సై, ఇతర యూనిఫాం ఉద్యోగాలు కోరుకునే వారు చదువులో ఎంత చురుకుదనం

Published : 01 Jul 2022 04:43 IST

అథ్లెటిక్స్‌ సీనియర్‌ శిక్షకుడు గౌస్‌

ఖమ్మం క్రీడలు, న్యూస్‌టుడే

గంటల తరబడి ఏకాగ్రతతో చదివిన వారికే ఉద్యోగాలు వస్తాయి. అదే యూనిఫాం కొలువులైతే తెలివైన సాధకులు మాత్రమే సాధిస్తారు. ఇప్పుడున్న కానిస్టేబుల్‌, సివిల్‌ ఎస్సై, ఇతర యూనిఫాం ఉద్యోగాలు కోరుకునే వారు చదువులో ఎంత చురుకుదనం చూపిస్తారో మైదానంలోనూ అదే ఒరవడి చూపాలి. అలాంటి వారే ఈసారి ప్రకటించిన ఉద్యోగాలు సాధించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని అథ్లెటిక్స్‌ సీనియర్‌ శిక్షకుడు గౌస్‌ చెప్పారు. ఉద్యోగ ప్రకటనలు వెలువడి యూనిఫాం ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థుల సాధనకు ఉపకరించే అంశాలపై శిక్షకుడితో ‘న్యూస్‌టుడే’ ముఖాముఖి నిర్వహించింది. వివరాలు ఇలా..

న్యూస్‌టుడే: ఎస్సై, కానిస్టేబుల్‌ ఉద్యోగ ప్రకటనతో పాటు ఆర్మీ ఉద్యోగాల కోసం యువకులు సిద్ధం అవుతున్నారు. వారికి మీరిచ్చే తొలి సలహా ఏంటి?
గౌస్‌: ఉద్యోగ ప్రకటనలో అంశాలను జాగ్రత్తగా చదవాలి. ఆయా అంశాల వారిగా తక్కువ సమయంలో ఎక్కువ సాధన చేయాలి. ప్రారంభించిన వ్యాయామాలు వాటికి దగ్గరగా ఉన్నాయా లేదా చూడాలి. అనుమానం ఉంటే నిపుణుల సలహా తీసుకోవాలి. ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగాలి.

న్యూ: వ్యాయామ సాధనలకు ఏ సమయం అనుకూలంగా ఉంటుంది?
గౌస్‌: ఉదయం, సాయంత్రం సాధన చేయాల్సిందే. ఉదయం 6 నుంచి 8, సాయంత్రం 4 నుంచి 7 ఉమ్మడి ఖమ్మం జిల్లా సాధకులకు అనుకూలం. మధ్యాహ్నం 1 గంటలోపు భోజనం ముగించిన వారు సాయంత్రం 4 గంటలకు సాధన మొదలు పెట్టవచ్చు.

న్యూ: 1600 మీటర్ల పరుగు లక్ష్యం ఛేదించడానికి ఎలాంటి సాధన చేయాలి?
గౌస్‌: సమయం తక్కువుందని అలవాటు లేకుండా పరుగు మొదలు పెడితే అనారోగ్య సమస్యలు ఏర్పడతాయి. తొలి అయిదు రోజులు వేగంగా నడవాలి. ఆ తర్వాత కొన్ని రోజులు వేగంగా నడుస్తూ మధ్యమధ్యలో జాగింగ్‌ లాంటి పరుగు తీయాలి. అలా క్రమంగా పరుగు మొదలుపెట్టాలి. 1600 మీటర్లు పరుగెత్తినా అలసట లేదనుకునే సమయంలో వేగం పెంచాలి. ఇలా ఎన్ని నిమిషాల్లో పరుగు పూర్తవుతుందో లెక్క చూడాలి.

న్యూ: ఇందులో బూట్లు, దుస్తులు ఎంత వరకు ఉపకరిస్తాయి?
గౌస్‌: కాలి మడెం వద్ద కనీసం ఒకటిన్నర ఇంచుల మందం ఉన్న బూట్లు వేసుకోవాలి. వేగం పెంచడంలో ఇవి దోహదపడతాయి. బూట్లు సరిగా లేకుంటే చిన్‌బోన్‌ నొప్పి వస్తుంది. అది మొదలైతే పరుగు అంతటితో ఆగే అవకాశం ఉంది. కురుచ ఉన్ని దుస్తులు ధరించాలి. ముఖ్యంగా ఈవెంట్స్‌ చేసే సమయంలో పురుషులైతే నిక్కర్‌, చేతులు లేని కట్‌ బనియన్లు, మహిళలు లోయర్‌ ప్యాంట్‌, చేతులు ఉన్న ఉన్ని టీ షర్టు ధరిస్తే అనువుగా ఉంటాయి.

న్యూ: మైదాన అంశాలు ఎలా ఉన్నాయి?
గౌస్‌: చదువుతోపాటు మైదాన అంశాల్లో తెలివైన సాధన చేయాల్సి ఉంటుంది. పురుషులు 1600 మీటర్ల దూరాన్ని కనిష్ఠంగా 4.15 నిమిషాలు, గరిష్ఠంగా 7.15 నిమిషాల్లో పూర్తి చేయాల్సి ఉంది. నిత్య సాధకులు మాత్రమే నిర్ణీత సమయంలో పరుగు పూర్తి చేస్తారు. 4.15 నిమిషాల గడువులో లక్ష్యాన్ని చేరిన వారు మాత్రమే వంద పాయింట్లు పొందే అవకాశం ఉంది. ఉన్న మైదాన అంశాల్లో ఇదే కీలక పరుగు.

న్యూ: సాధన చేస్తున్నవారు ఎలాంటి ఆహారం తీసుకోవాలి?
గౌస్‌: రోజు తీసుకునే ఆహారంతో పాటు కొన్ని ప్రత్యేకతలు జోడించాలి. ఉదయం సాధన చేసిన తర్వాత రెండు ఉడికించిన గుడ్లు, 200 మి.లీ. పాలు, ఒకటి, రెండు అరటి పండ్లు అల్పాహారంతో తీసుకోవాలి. మధ్యాహ్నం పప్పు, కూరలు, పెరుగుతో అన్నం, సాయంత్రం సాధన తర్వాత అన్నం, చపాతి, మాంసాహార కూరలు ఉండాలి. టీ అలవాటు ఉన్నవారు సాయంత్రం వేళలో తాగవచ్చు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని