logo

హరితహారానికి రంగం సిద్ధం

ఏడేళ్లుగా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మక రీతిలో హరితహారం నిర్వహిస్తోంది. పెద్ద ఎత్తున మొక్కలు నాటేలా కృషి చేస్తోంది. వృక్ష సంపదే లక్ష్యంగా ఏడు విడతలను పూర్తి చేసి ఈ ఏడాది ఎనిమిదో విడతకు రంగం సిద్ధం చేశారు. ఈ నెలలో ప్రారంభం కానున్న

Updated : 02 Jul 2022 07:18 IST

జిల్లాలో ఈ ఏడాది 95.62 లక్షల మొక్కలు లక్ష్యం

బూర్గంపాడు మండలంలో సందెళ్ల రామాపురంలో

అటవీ శాఖ ఆధ్వర్యంలోని నర్సరీ

అశ్వాపురం, పాల్వంచ గ్రామీణం, న్యూస్‌టుడే : ఏడేళ్లుగా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మక రీతిలో హరితహారం నిర్వహిస్తోంది. పెద్ద ఎత్తున మొక్కలు నాటేలా కృషి చేస్తోంది. వృక్ష సంపదే లక్ష్యంగా ఏడు విడతలను పూర్తి చేసి ఈ ఏడాది ఎనిమిదో విడతకు రంగం సిద్ధం చేశారు. ఈ నెలలో ప్రారంభం కానున్న హరితహారం కార్యక్రమాన్ని జిల్లాలో విజయవంతం చేసేందుకు అధికారులు కార్యాచరణ రూపొందించారు.

ఎనిమిదో విడత హరితహారం కింద ఈ ఏడాది జిల్లాలో 95.62 లక్షల మొక్కలను నాటేందుకు అధికారులు ప్రణాళికలు సిద్ధం చేశారు. ఇప్పటికే జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలోని 481 నర్సరీల్లో, అటవీ శాఖ ఆధ్వర్యంలోని 25 నర్సరీల్లో మొక్కల పెంపకం చేపట్టారు. ప్రతి పంచాయతీ పరిధిలో 10 వేల మొక్కల్ని నాటాలని జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ లక్ష్యం నిర్ణయించింది. ఈ మేరకు గ్రామాల్లో పొలంగట్లు, వైకుంఠ ధామాలు, డంపింగ్‌ యార్డులు, చెరువు కట్టలు, ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాలలు, ఇళ్ల ఆవరణలో మొక్కలు నాటేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ఇంటింటికి కనీసం 6 మొక్కలు సరఫరా చేసి సంరక్షించేలా చైతన్యం చేయనున్నారు. అటవీ శాఖ ఆధ్వర్యంలో ఖాళీ అటవీ భూముల్లో, ప్రధాన రహదారులకు ఇరువైపులా 20 లక్షల మొక్కలు నాటనున్నారు. ఆగస్టు నెలాఖరు వరకు ఈ కార్యక్రమాన్ని చేపట్టేందుకు అధికారులు రంగం సిద్ధం చేస్తున్నారు.

తీరిన కొరత

గతంలో నర్సరీలు తక్కువ సంఖ్యలో ఉండేవి. మొక్కల కొరత తీవ్రంగా ఉండేది. మూడేళ్లుగా జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో ప్రతి పంచాయతీలో ఓ నర్సరీని ఏర్పాటు చేశారు. 481 పంచాయతీల్లో ప్రతిచోటా నర్సరీని ఏర్పాటుచేశారు. ఒక్కోచోట 10వేల నుంచి 15వేల వరకు మొక్కల్ని పెంచుతున్నారు.

సంరక్షణపై ప్రత్యేక శ్రద్ధ

హరితహారంపై జిల్లా యంత్రాంగం ప్రత్యేక శ్రద్ధ పెట్టింది. మొక్కల పంపిణీతోపాటు నాటడం, రవాణా వంటి వ్యవహారాలను చూసుకునేందుకు జిల్లాలో ప్రత్యేకంగా ఓ నిర్వహణ కమిటీని ఏర్పాటు చేశారు. కలెక్టర్‌ దీనికి ఛైర్మన్‌గా వ్యవహరిస్తున్నారు. వివిధ విభాగాల జిల్లా అధికారులు సభ్యులుగా ఉన్నారు.

ఏఏ మొక్కలు?

1. రహదారుల పక్కన నాటేందుకు టేకు, కానుగ, వేప తదితర నీడనిచ్చే మొక్కలతోపాటు పూలు, పండ్ల మొక్కలు.

2. మామిడి, నేరేడు, దానిమ్మ, నిమ్మ, జామ, సీతాఫలం, ఉసిరి, మునగ తదితర పండ్ల, మందారం, గన్నేరు వంటి పూల, తులసి వంటి ఔషధ మొక్కలు ఇళ్లలో వేసుకునేందుకు..

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని