logo

ప్రజలపై చెత్త భారం

జిల్లాలోని పురపాలక ప్రజలపై యూజర్‌ ఛార్జీల భారం నెలకొంది. ఒక్కోచోట ఒకలా వసూలు చేస్తున్నారు. చెత్త సేకరణకు ఇంటింటికి రూ.30కి బదులు రూ.50 వరకు స్వచ్ఛ వాహనాల సిబ్బంది రాబట్టుకుంటున్నారు.

Published : 06 Aug 2022 03:43 IST

కొత్తగూడెం పట్టణం, న్యూస్‌టుడే


స్వచ్ఛ ఆటోల ద్వారా చెత్తను సేకరిస్తున్న పారిశుద్ధ్య సిబ్బంది

జిల్లాలోని పురపాలక ప్రజలపై యూజర్‌ ఛార్జీల భారం నెలకొంది. ఒక్కోచోట ఒకలా వసూలు చేస్తున్నారు. చెత్త సేకరణకు ఇంటింటికి రూ.30కి బదులు రూ.50 వరకు స్వచ్ఛ వాహనాల సిబ్బంది రాబట్టుకుంటున్నారు. ఓ వైపు ‘స్వచ్ఛ’ కోటాలో పురపాలకాలకు రూ.లక్షల్లో నిధులు మంజూరవుతున్నా మాపై ఏటేటా భారం పెంచుతూ పోవడం ఏమిటని ప్రజలు పెదవి విరుస్తున్నారు. కొత్తగూడెం, పాల్వంచ, ఇల్లెందు, మణుగూరులో వేల కుటుంబాలపై రూ.కోట్లలో ఛార్జీలు మోపడం విమర్శలకు దారితీస్తోంది. సాధారణ నిధుల్లోంచి ఠంఛనుగా వేతనాలు మంజూరు చేసి ఇబ్బందుల్లేకుండా చూడాలని వాహన సిబ్బంది డిమాండ్‌ చేస్తున్నారు.

పట్టణాల్లోని వార్డుల్లో చెత్త సేకరణకు ‘స్వచ్ఛ వాహనాల(ఆటో ట్రాలీ)’ను అందుబాటులోకి తీసుకొచ్చారు. సాధారణ నిధుల నుంచి ఆటో డ్రైవర్లకు రూ.6 వేల చొప్పున వేతనాలు చెల్లించాలని ఈ ఏడాది జనవరిలో అధికారులు నిర్ణయించారు. ఈ మేరకు కొత్తగూడెం, ఇల్లెందు పురపాలకాల్లో కౌన్సిల్‌ తీర్మానాలు కూడా చేశారు. ఇదే నిర్ణయాన్ని పాల్వంచ, మణుగూరులో కొనసాగించాలని అక్కడి యంత్రాంగం నిర్ణయించింది. ఫిబ్రవరి, మార్చి నెలల్లో ఈ మేరకు వేతనాలు చెల్లించిన అధికారులు ఆ తర్వాత చేతులెత్తేశారు. గత నాలుగు నెలల నుంచి వేతనాలు లేని స్వచ్ఛ వాహనాల డ్రైవర్లు ఇంటింటికీ రేట్లు పెంచి ఛార్జీలు వసూలు చేసుకుంటున్నారు. అవి కూడా కనీస అవసరాలకు చాలడం లేదని వాపోతున్నారు. కొత్తగూడెం, మణుగూరు పురపాలకాల్లో ఇంటికి రూ.50, ఇల్లెందు, పాల్వంచల్లో రూ.30 వరకు వసూలు చేయాలి. కొన్నిచోట్ల ఈ మొత్తం చాలడం లేదని అదనంగా రూ.20 వరకు వసూలు చేసుకుంటున్నారు.

‘పట్టణ ప్రగతి’ ఏమాయె?
పట్టణ ప్రగతి పేరుతో ఒక్కో పురపాలకానికి దాదాపు రూ.50 లక్షల నిధులు ప్రభుత్వం నుంచి మంజూరవుతున్నాయి. అయినా స్వచ్ఛ వాహనాల నిర్వహణ అధ్వానంగా మారడం గమనార్హం. డ్రైనేజీలైనా బాగు చేస్తున్నారా? అంటే అదీ అంతంతమాత్రంగానే ఉంది. పారిశుద్ధ్య చర్యలకు నోచుకోని మురికివాడలు, శివారు కాలనీలు పదుల సంఖ్యలో ఉన్నాయి. కనిపించని మొక్కల నిర్వహణకే కాసులు ధారబోస్తున్నారనే ఆరోపణలు ఎక్కువగా ఉన్నాయి. ‘పట్టణ ప్రగతి’ నిధుల్లోంచి ఆటో డ్రైవర్లకు వేతనాలు చెల్లించాల్సి ఉన్నా పట్టించుకోకపోవడం, డ్రైవర్లు గత్యంతరం లేక యూజర్‌ ఛార్జీలు ఎంతో కొంత పెంచి వసూలు చేసుకోవడం సాధారణమైంది. కొందరు ప్రజలు అసలు ఛార్జీలే చెల్లించడం లేదని, పూట గడవడమూ కష్టమవుతోందని వాపోతున్నారు.

పారిశుద్ధ్య చర్యల్లో భాగంగా ప్రజల నుంచి వసూలయ్యే యూజర్‌ ఛార్జీల ద్వారానే స్వచ్ఛ ఆటోడ్రైవర్లకు వేతనాలు ఇవ్వాల్సి ఉంది. ప్రజలంతా సహకరించడం లేదంటూ డ్రైవర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ సమస్య చెత్త సేకరణపై పడొద్దన్న ఉద్దేశంతో సాధారణ నిధుల్లోంచి కొన్నాళ్లు వేతనాలు చెల్లించాం. జనవరికి ముందుకు సంబంధించి కూడా నాలుగైదు నెలల వేతనాలివ్వాలని డ్రైవర్లు కోరుతున్నారు. ఉన్నతాధికారులతో మాట్లాడి ఈ సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకుంటాం. 

- టి.నవీన్‌కుమార్‌, కొత్తగూడెం కమిషనర్‌

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని