logo

మళ్లీ ముంపు ముప్పు

గోదావరి  మరోసారి ఉగ్రరూపం దాల్చుతుండడంతో తీరప్రాంతంలోని జనం బెంబేలెత్తిపోతున్నారు. జులైలో వచ్చిన వరదలతో పినపాక, మణుగూరు, అశ్వాపురం, బూర్గంపాడు, దుమ్ముగూడెం, చర్ల, భద్రాచలం మండలాల్లో 77

Published : 10 Aug 2022 03:21 IST

పెరుగుతున్న గోదావరి వరద

స్నానఘాట్‌లో నీట మునిగిన విద్యుత్తు స్తంభాలు

భద్రాచలం, న్యూస్‌టుడే: గోదావరి  మరోసారి ఉగ్రరూపం దాల్చుతుండడంతో తీరప్రాంతంలోని జనం బెంబేలెత్తిపోతున్నారు. జులైలో వచ్చిన వరదలతో పినపాక, మణుగూరు, అశ్వాపురం, బూర్గంపాడు, దుమ్ముగూడెం, చర్ల, భద్రాచలం మండలాల్లో 77 పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేశారు. 16 వేల కుటుంబాలకు పైగా ఇందులో తలదాచుకున్నాయి. రూ.130 కోట్లకు పైగా నష్టం వాటిల్లినట్లు అంచనా.

ఆగస్టును తక్కువ అంచనా వేయొద్దు: కేంద్ర జల సంఘం నివేదికలతో పాటు రెవెన్యూ శాఖ చెబుతున్న వివరాలను పరిశీలిస్తే ఆగస్టులోనే ఎక్కువ సార్లు గరిష్ఠ వరదలు నమోదయ్యాయి. 1986లో ఆగస్టు 16న 75.6 అడుగులు రాగా ఇదే ఇక్కడ అత్యంత ప్రమాదకరమైన వరదగా రికార్డులకు ఎక్కింది. 1981 నుంచి ఇప్పటి వరకు పరిశీలిస్తే 10 సార్లు మూడో ప్రమాద హెచ్చరిక దాటింది. వర్షాకాలంలో ఒకసారి గరిష్ఠ వరద నమోదయ్యాక మళ్లీ వెంటనే వరద తీవ్రరూపం దాల్చడం చాలా అరుదుగా ఉంటుంది. వాతావరణంలోని మార్పుల వల్ల తీరప్రాంతంలో ఆగకుండా వర్షాలు కురుస్తుండడంతో మంగళవారం రాత్రి 8 గంటలకు 45.2 అడుగులకు చేరింది. కరకట్ట భద్రతపై యుద్ధ ప్రాతిపదికన దృష్టి సారించాలి. పలు చోట్ల రివిట్‌మెంట్‌ దెబ్బతినడంతో మరమ్మతు పనులు చేశారు. ఇంకొన్ని చోట్ల చిన్నచిన్న గోతులు ఉన్నాయి. పైభాగం పలు చోట్ల కుంగిపోయింది. సీసీ రహదారి రెండు భాగాలుగా విడిపోయినట్లు కనిపిస్తుంది. ఇసుక బస్తాలను ఉంచినప్పటికీ కొన్నింటిలో ఇసుక వర్షాల వల్ల కారిపోయింది.

తిరుగు జలాలను తోడేస్తున్న మోటార్లు: స్నానఘట్టాల్లోని విద్యుత్తు స్తంభాలు మునిగాయి. కల్యాణకట్ట కిందకు నీరు చేరింది. విస్తా కాంప్లెక్స్‌ వద్ద ప్రత్యేక మోటార్లతో తిరుగు జలాలను తోడేస్తున్నారు. ఇందు కోసం పెద్ద పైపులను కరకట్టపై ఏర్పాటు చేసి వ్యర్థ జలాన్ని నదిలో వదులుతున్నారు. ప్రస్తుతానికి ఇక్కడి లోతట్టు ప్రాంతాలకు ఇబ్బంది లేనప్పటికీ వరద పెరిగే తరుణంలో వర్షం వస్తే కష్టాలు తప్పవని భావిస్తున్నారు. వరుణుడు కరుణిస్తే సరే..లేదంటే లోతట్టు కాలనీవాసులు మరోసారి పునరావాస కేంద్రాలకు వెళ్లాల్సి ఉంటుంది. మూడో ప్రమాద హెచ్చరిక స్థాయికి వరద రాకపోతే ఇబ్బంది తప్పినట్లేనని అంచనా వేస్తున్నారు.
 

నీట మునిగిన సీతమ్మ నారచీరలు
చర్ల(దుమ్ముగూడెం), న్యూస్‌టుడే: ఇటీవల కురుస్తున్న వర్షాలకు మళ్లీ గోదావరి నది నీటిమట్టం పెరిగింది. దుమ్ముగూడెం, పర్ణశాల వద్ద గోదావరి నది నీటి మట్టం మంగళవారం నాటికి దాదాపు 21.60 అడుగులకు చేరుకుంది. పర్ణశాల వద్ద స్నానఘట్టాలను నీట ముంచింది. సీతమ్మ నార చీరల ప్రదేశం, స్వామివారి సింహాసనం నీట మునగడంతో పాటు వ్యాపార దుకాణాలు సగం వరకు మునిగిపోయాయి. వివిధ వ్యాపారులు అక్కడ నుంచి దుకాణాలను ఖాళీ చేశారు. డొంకవాగు పొంగడంతో సున్నంబట్టి- బైరాగులపాడు గ్రామాల మధ్య ప్రధాన రహదారి మునిగి స్థానికులు పడవలపైనే రాకపోకలు సాగిస్తున్నారు.


‘ పరీవాహకంలో ప్రజలు  అప్రమత్తంగా ఉండాలి’

కొత్తగూడెం కలెక్టరేట్, న్యూస్‌టుడే: ఎగువనున్న ప్రాణహిత, ఇంద్రావతి నదుల నుంచి వస్తున్న వరద నీటితో భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం పెరుగుతున్నందున పరిసర ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్‌ అనుదీప్‌ మంగళవారం ఓ ప్రకటనలో హెచ్చరించారు. మంగళవారం రాత్రికి నీటిమట్టం 55 అడుగులకు చేరుకునే అవకాశం ఉన్నందన అధికారులు   ప్రజలను అప్రమత్తం చేయాలని ఆదేశించారు. వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నందున  పశువులు, మేకలు, గొర్రెలను వాగులు దాటకుండా చూసుకోవాలని సూచించారు. చేపల వేట కోసం జాలర్లు గోదావరి నదిలోకి వెళ్లకుండా హెచ్చరికలు జారీ చేయాలని ఆదేశించారు.  సహాయక చర్యలకు అధికారులు సిద్ధంగా ఉండాలని, గజ ఈతగాళ్లను, బోట్లను సిద్ధంగా ఉంచుకోవాలని సూచించారు.

Read latest Khammam News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు