logo

పెరుగుతున్న పాజిటివ్‌ రేటు

జిల్లా వ్యాప్తంగా మూడు నెలలుగా పాజిటివ్‌ కేసులు నమోదవుతున్నాయి. జూన్‌లో 0.39 శాతం పాజిటివ్‌ రేటు నమోదుకాగా, జులైలో 1.89కు పెరిగింది. ఆగస్టు నెలలో పదిరోజుల్లోనే 2.15 శాతం కేసులు వెలుగుచూశాయి.

Published : 12 Aug 2022 01:55 IST

ఖమ్మం వైద్యవిభాగం, న్యూస్‌టుడే: జిల్లా వ్యాప్తంగా మూడు నెలలుగా పాజిటివ్‌ కేసులు నమోదవుతున్నాయి. జూన్‌లో 0.39 శాతం పాజిటివ్‌ రేటు నమోదుకాగా, జులైలో 1.89కు పెరిగింది. ఆగస్టు నెలలో పదిరోజుల్లోనే 2.15 శాతం కేసులు వెలుగుచూశాయి. మొత్తంగా 43,023 మందికి కొవిడ్‌ పరీక్షలు చేయగా 647 పాజిటివ్‌గా తేలారు. మొదటి, రెండు, మూడో విడతలతో పోలిస్తే ఆరోగ్యంపై వైరస్‌ ప్రభావం కొంచెం తక్కువగానే ఉంది. దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడే కొందరు మాత్రం ఇబ్బంది పడుతున్నారని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఈ క్రమంలో వ్యాప్తిని అరికట్టేందుకు ఐసోలేషన్‌ తప్పనిసరని సూచిస్తున్నారు. కొందరికి ఇన్‌పేషంట్‌ సేవలు అందించాల్సి వస్తుందని తెలిపారు. ప్రస్తుత పరిస్థితుల్లో జిల్లా ప్రభుత్వ ప్రధానాసుపత్రి కొవిడ్‌ వార్డులో 25 మంది ఇన్‌పేషంట్‌ చికిత్సలు తీసుకుంటున్నారు.      

వ్యాధుల కాలం.. అప్రమత్తత అవసరం

వర్షాకాలంలో అంటువ్యాధుల తీవ్రత అధికంగా ఉంటుంది. గడిచిన నెల రోజులుగా జిల్లాలో ఎడతెరిపిలేని వర్షాలు కురుస్తున్నాయి. వాతావరణంలో పూర్తిగా మార్పులు చోటుచేసుకోవడంతో వైరస్‌లు వేగంగా విస్తరించే ప్రమాదం ఉంది. ఓవైపు కీటక నీటి జనిత వ్యాధులైన డెంగీ, గన్యా, టైఫాయిడ్‌, అతిసారం వంటి విషజ్వరాల ప్రభావం ఉండగా మరోవైపు కొవిడ్‌ వ్యాప్తి భయం ప్రజలను వెంటాడుతోంది. కరోనా తగ్గిందనే భావనలో చాలా వరకు నిబంధనలను విస్మరించారు. కనీస జాగ్రత్తలు అంటే మాస్క్‌ కూడా ధరించడం లేదు. ఈ క్రమంలో రెండు నెలలుగా వైరస్‌ చాపకింద నీరుల వ్యాపిస్తోంది. పిల్లలు, పెద్దలు, వృద్ధులనే వ్యత్యాసం లేకుండా ఇలా అందరిని వేధిస్తోంది. రెండు డోసులు వ్యాక్సిన్‌ పూర్తైన వారినీ వదలడం లేదు. ఈ నేపథ్యంలో 18 ఏళ్ల పైబడిన వారందరికీ ప్రభుత్వం ప్రీకాషన్‌ డోసును పంపిణీ చేస్తున్నా లబ్ధిదారుల నుంచి మాత్రం స్పందన కన్పించడం లేదు.


కలెక్టర్‌ గౌతమ్‌కు కొవిడ్‌ పాజిటివ్‌

ఖమ్మం కలెక్టరేట్‌, న్యూస్‌టుడే: కలెక్టర్‌ గౌతమ్‌కు కొవిడ్‌ పాజిటివ్‌గా నిర్ధారణైంది. జలుబు, ఒళ్లు నొప్పులతో బాధపడుతున్న ఆయన్ను మంగళవారం రాత్రి జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యులు పరీక్షించారు. ఆర్టీపీసీఆర్‌ పరీక్ష అనంతరం బుధవారం రాత్రి ఆయన కొవిడ్‌ పాజిటివ్‌గా నిర్ధారించారు. బుధవారం ఆయన క్యాంపు కార్యాలయంలో ఉన్నారు. రాత్రి ఆయనకు కొవిడ్‌ పాజిటివ్‌గా నిర్ధారణ కావటంతో వారం రోజులు హోం క్వారంటైన్‌లో ఉండాలని వైద్యుల సూచన మేరకు స్వీయ గృహనిర్బంధంలోకి వెళ్లారు. ఇంటి నుంచే ఆన్‌లైన్‌లో పలు దస్త్రాలు ఆయన పరిశీలించి తగు చర్యలు తీసుకుంటున్నారు. ఇప్పటికే ఆయన బూస్టర్‌ డోస్‌ టీకా తీసుకున్నారు. అయినా కొవిడ్‌ పాజిటివ్‌ రావటం గమనార్హం.

16 కేసులు

ఖమ్మం వైద్యవిభాగం, న్యూస్‌టుడే: జిల్లావ్యాప్తంగా 693 కరోనా పరీక్షలు చేయగా 16 పాజిటివ్‌ కేసులు నమోదైనట్లు ఆరోగ్యశాఖ గురువారం వెల్లడించింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని