logo

ప్రమాదాన్ని అంచనా వేయలేక..

చేపల వేటకు వెళ్లి గల్లంతయిన వ్యక్తిని వెతకాలన్నదే వారి మదిలో మెదిలింది.  అక్కడే ప్రమాదం పొంచి ఉందని మాత్రం అంచనా వేయకపోయారు. దీంతో డీఆర్‌ఎఫ్‌ బృందంలో ఒకరు మృతి చెందగా.. మరొకరు గల్లంతైన హృదయ విదారక ఘటన జిల్లాలో

Published : 12 Aug 2022 01:55 IST

నేలకొండపల్లి, న్యూస్‌టుడే

ముగ్గురు గల్లంతయిన ప్రదేశం ఇదే..

చేపల వేటకు వెళ్లి గల్లంతయిన వ్యక్తిని వెతకాలన్నదే వారి మదిలో మెదిలింది.  అక్కడే ప్రమాదం పొంచి ఉందని మాత్రం అంచనా వేయకపోయారు. దీంతో డీఆర్‌ఎఫ్‌ బృందంలో ఒకరు మృతి చెందగా.. మరొకరు గల్లంతైన హృదయ విదారక ఘటన జిల్లాలో గురువారం చోటు చేసుకుంది.

నేలకొండపల్లి మండలం చెన్నారం గ్రామానికి చెందిన పగడాల రంజిత్‌(26) పాలేరు ఏటిపై సుర్థేపల్లి చెక్‌డ్యాం వద్ద చేపలు పట్టేందుకు గురువారం ఉదయం వెళ్లి గల్లంతయ్యారు. స్థానికులు అతని కోసం తీవ్రంగా గాలించారు. ఎంతకీ ఆచూకీ దొరక్కపోవడంతో  ఉన్నతాధికారులకు, ఎమ్మెల్యేకు సమాచారం ఇచ్చారు. ఖమ్మం కార్పొరేషన్‌కు చెందిన డీఆర్‌ఎఫ్‌ బృందాన్ని సాయంత్రం నాలుగు గంటలకు సుర్ధేపల్లి వచ్చేలా చర్యలు చేపట్టారు. రంజిత్‌ కోసం బృంద సభ్యులు పడిగెల వెంకటేశ్‌(29) అలియాస్‌ వెంకటేశ్వర్లు, బాశెట్టి ప్రదీప్‌(32) ఏటిలోకి దిగారు. వీరివురు చెక్‌డ్యాం వద్ద ప్రవాహ ఉద్ధృతికి ఈదలేకపోయారు. చెక్‌డ్యాం వద్ద నీరు బలంగా కిందకు వచ్చి మళ్లీ పైకి సుడులుగా తిరుగుతుండటంతో ఈదేందుకు ఇబ్బంది పడ్డారు. వీరిలో వెంకటేశ్వర్లు వంతెనపై నుంచి రక్షణ కోసం వేలాడదీసిన మోకు తాడును ఎక్కువగా నీటిలోకి తీసుకున్నాడు. నీటి ప్రవాహానికి ఆ తాడు వెంకటేశ్వర్లు కాళ్లకు చుట్టుకొని ఈదనివ్వకుండా చేసింది. దీంతో పైనున్న వ్యక్తులు ఆయన్ను రక్షించాలనే తొందరలో తాడు లాగగా ఆ తాడు బలంగా కాళ్లకు చుట్టుకొని ఈదలేక మృతి చెందాడు. అతని మృతదేహాన్ని స్థానికులు ఒడ్డుకు చేర్చారు. ఆయన లైఫ్‌ జాకెట్‌ వేసుకున్నప్పటికీ నీటి ప్రవాహానికి విడిపోయింది.  ప్రదీప్‌ రక్షణ లేకుండా నేరుగా ఏటిలో దిగినట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. విషయం తెలుసుకున్న సూర్యాపేట, ఖమ్మం జిల్లాల ప్రజలు భారీగా ఘటనాస్థలానికి చేరుకున్నారు. ఎస్సై స్రవంతి, ఎంపీడీవో జమలారెడ్డి, తహసీల్దార్‌ ధార ప్రసాద్‌ ఉన్నతాధికారులకు సమాచారం అందించారు. ఎమ్మెల్యే కందాళ ఉపేందర్‌రెడ్డి, ఖమ్మం గ్రామీణ ఏసీపీ బస్వారెడ్డిలు ఘటనాస్థలానికి చేరుకుని పరిస్థితి సమీక్షించారు. సరైన రక్షణ చర్యలు లేకుండా, చెక్‌డ్యాం వద్ద నీటి ఉద్ధతిపై అవగాహన లేకుండా డీఆర్‌ఎఫ్‌ బృంద సభ్యులు దిగడం, అధికారులు వారి సామర్ధ్యాన్ని అంచనా వేయకుండా చర్యల్లో పాల్గొనాలని ఒత్తిడి చేయడంతోనే ఇలా జరిగిందని స్థానికులు చర్చించుకుంటున్నారు. మృతదేహాన్ని పంచనామా కోసం ఖమ్మం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఉదయం గల్లంతైన రంజిత్‌,  ప్రదీప్‌ ఆచూకీ ఇంకా దొరకలేదు. సహాయక చర్యల్లో చెన్నారం, సుర్థేపల్లి సర్పంచులు తోళ్ల వెంకటేశ్వర్లు, షేక్‌ మస్తాన్‌, నాయకులు కడియాల శ్రీనివాసరావు, వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. ఆర్డీవో రవీంద్రనాథ్‌, డీపీవో హరిప్రసాద్‌ ఘటనా స్థలాన్ని పరిశీలించారు.

* ప్రదీప్‌ది చింతకాని మండలం నాగులవంచ గ్రామం. ఇటీవలే డీఆర్‌ఎఫ్‌లో పొరుగుసేవల కింద చేరాడు. మృతునికి భార్య, ఓ కుమార్తె ఉన్నారు.  


హైదరాబాద్‌లో శిక్షణ పొంది..

ఖమ్మం గ్రామీణం, న్యూస్‌టుడే: ఎంవీపాలెంకి చెందిన పడిగెల వెంకటేశ్‌ తండ్రి యాదగిరి 20 ఏళ్ల క్రితమే మరణించాడు. చిన్నప్పటి నుంచి తల్లి నాగలక్ష్మి కూరగాయలు అమ్ముకుంటూ తమ పిల్లలను పోషించింది. నాగలక్ష్మి ప్రస్తుతం ఖమ్మంలో ఇళ్లలో పని చేస్తు కుటుంబాన్ని నెట్టుకొస్తుంది.  వెంకటేశ్‌(వెంకటేశ్వర్లు) డిగ్రీ పూర్తి చేసి మూడేళ్ల క్రితమే ఖమ్మం నగరపాలక సంస్థలోని డీఆర్‌ఎఫ్‌లో అవుట్‌సోర్సింగ్‌ ఉద్యోగంలో చేరాడు. అతనితోపాటు మరో ముగ్గురు యువకులు కూడా డీఆర్‌ఎఫ్‌లో ఉద్యోగంలో చేరారు. వీరికి ఉద్యోగంలో చేరే సమయంలో హైదరాబాద్‌లో వారం రోజులు శిక్షణను ఇచ్చినట్లు సమాచారం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని