logo

గోదావరి తగ్గుముఖం

భద్రాచలం వద్ద గోదావరి ఉగ్రరూపం దాల్చి కొంత శాంతించినప్పటికీ ఇప్పటికీ ప్రమాదకరంగానే ప్రవాహం సాగుతోంది. మూడో హెచ్చరికకు చేరువకు చేరుకున్న వరద నిలకడగా మారి తగ్గుతుండడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. జులైలో

Published : 13 Aug 2022 02:46 IST

భద్రాచలం వద్ద నీటి ప్రవాహం

భద్రాచలం, న్యూస్‌టుడే: భద్రాచలం వద్ద గోదావరి ఉగ్రరూపం దాల్చి కొంత శాంతించినప్పటికీ ఇప్పటికీ ప్రమాదకరంగానే ప్రవాహం సాగుతోంది. మూడో హెచ్చరికకు చేరువకు చేరుకున్న వరద నిలకడగా మారి తగ్గుతుండడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. జులైలో ఎదురైన అనుభవాలను గుర్తించి అప్రమత్తత పాటిస్తున్నారు. ప్రధాన మార్గాల్లో రాకపోకలు ఆగినప్పటికీ నిత్యావసరాలకు ఇబ్బంది లేకుండా చర్యలు చేపట్టారు. గర్భిణులను కొత్తగూడెం, భద్రాచలం ఆసుపత్రులకు తరలించేందుకు సిద్ధమయ్యారు. అత్యవసర ఔషధాలను అందుబాటులో ఉంచారు. భద్రాచలం ఆసుపత్రిలో ప్రత్యేక వార్డును కేటాయించడంతోపాటు అంబులెన్స్‌ను సిద్ధం చేశారు. పారిశుద్ధ్యంపై ప్రత్యేక దృష్టిసారించాలని కలెక్టర్‌ అనుదీప్‌ దిశను నిర్దేశించారు. మణుగూరు, పినపాక, అశ్వాపురం, బూర్గంపాడు, చర్ల, భద్రాచలం, దుమ్ముగూడెం మండలాలకు ముంపు సమస్య తలెత్తే వీలుండడంతో క్షేత్ర స్థాయి సిబ్బందిని అప్రమత్తం చేశారు. అవసరమైతే సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు సిద్ధంగా ఉండాలని ఆదేశాలు జారీ అయ్యాయి. మన్యంలో ప్రజలకు వరదల సమాచారం చేరవేయడం కోసం ఐటీడీఏలో కంట్రోల్‌ రూంను ఏర్పాటు చేశారు. శుక్రవారం గోదావరి నీటిమట్టం హెచ్చు తగ్గులకు గురైనట్లు వెల్లడించారు. అయినప్పటికీ సమాచారం కావాలంటే 08743-232244, 86390 79188 అనే నంబర్లకు సంప్రదించాలని ఏపీవో జనరల్‌ డేవిడ్‌రాజ్‌ తెలిపారు. పీవో గౌతమ్‌ ఆదేశాల మేరకు కంట్రోల్‌ రూం ఏర్పాటు చేసినట్లు చెప్పారు. కాగా భద్రాచలం వద్ద శుక్రవారం రాత్రి 10 గంటలకు 51.90 అడుగులకు చేరింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని