logo

నెత్తుటి మరక

కమ్యూనిస్టు కోటలో మళ్లీ నెత్తురు పారింది. 20 ఏళ్ల తర్వాత మళ్లీ రాజకీయ హత్య గ్రామంలో కలకలం రేపింది. తెరాస నాయకుడు తమ్మినేని కృష్ణయ్య(62) సోమవారం దారుణహత్యకు గురవ్వడంతో ఖమ్మం గ్రామీణం మండలం తెల్దారుపల్లి ఉలిక్కిపడింది.

Published : 16 Aug 2022 04:40 IST

తెల్దారుపల్లిలో 20 ఏళ్ల తర్వాత మళ్లీ రాజకీయ హత్య

ఈటీవీ, ఖమ్మం - ఖమ్మం గ్రామీణం, న్యూస్‌టుడే

హత్యకు కొద్ది సేపటి ముందు పొన్నెకల్లులో రైతువేదిక

వద్ద జాతీయ పతాకం ఎగరేస్తూ. 

కమ్యూనిస్టు కోటలో మళ్లీ నెత్తురు పారింది. 20 ఏళ్ల తర్వాత మళ్లీ రాజకీయ హత్య గ్రామంలో కలకలం రేపింది. తెరాస నాయకుడు తమ్మినేని కృష్ణయ్య(62) సోమవారం దారుణహత్యకు గురవ్వడంతో ఖమ్మం గ్రామీణం మండలం తెల్దారుపల్లి ఉలిక్కిపడింది. ఊరూవాడా స్వాతంత్య్ర వజ్రోత్సవాల్లో మునిగి తేలుతున్న సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. కృష్ణయ్య తన సతీమణి మంగతాయితో కలిసి సోమవారం గ్రామంలో పలుచోట్ల పంద్రాగస్టు వేడుకల్లో పాల్గొన్న కొద్దిగంటల్లోనే అతి కిరాతకంగా హత్యకు గురయ్యారు. పొన్నెకల్లు నుంచి గుర్రాలపాడులో కార్యకర్త కుటుంబాన్ని పరామర్శించి వస్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది.

ఘటనా స్థలంలో తమ్మినేని కృష్ణయ్య మృతదేహం​​​​​​​

పక్కా ప్రణాళికతో..: తన అనుచరుడు ముత్తేశం ద్విచక్ర వాహనం నడుపుతుండగా ఆయన వెనుక కూర్చున్నారు. వెనుక నుంచి ఆటోలో వస్తున్న దుండగులు ఆయన్ను వెంబడించారు. ఆటోలో మొత్తం ఆరుగురు రాగా వారిలో నలుగురు కృష్ణయ్యపై దాడికి పాల్పడ్డారు. మరో ఇద్దరు ఆటోలోనే ఉన్నట్లు ప్రత్యక్ష సాక్షుల ద్వారా తెలిసింది. ఘటనా స్థలానికి జాగిలాలతో చేరుకున్న క్లూస్‌ టీం ఆధారాలు సేకరించారు. ఖమ్మం ప్రభుత్వాసుపత్రిలో శవపరీక్ష అనంతరం మృతదేహాన్ని పోలీసులు తెల్దారుపల్లికి తరలించారు. పంద్రాగస్టు సంబురాల్లో అంతా మునిగి తేలడంతో దుండగులు ఇదే సరైన సమయమని భావించి పక్కా ప్రణాళికతో హత్యకు పాల్పడట్లు తెలుస్తోంది.

తమ్మినేని కృష్ణయ్యను రాజకీయ కక్షతోనే దారుణంగా హత్యచేశారు. గతంలోనూ చంపుతామని బెదిరించారు. మా దగ్గరికి ఎవరు వచ్చినా బెదిరిస్తున్నారు. మూడేళ్ల క్రితం ఎంపీటీసీగా స్వతంత్రంగా గెలుపొందడం వల్లే కక్ష పెంచుకున్నారు. ఈ ఘటనకు బాధ్యుల్ని వెంటనే అరెస్టు చేసి మాకు న్యాయం చేయాలి. కృష్ణయ్య భార్య మంగతాయి, కుమార్తె రజిత

దోషుల్ని కఠినంగా శిక్షించాలి

మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు

మృతదేహానికి నివాళులర్పిస్తున్న తుమ్మల

ఖమ్మం ప్రభుత్వాసుపత్రిలో కృష్ణయ్య మృతదేహానికి మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పూలమాల వేసి నివాళులు అర్పించారు. తెల్దారుపల్లిలో కృష్ణయ్య కుటుంబీకులను పరామర్శించారు. ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడుతూ స్వాతంత్య్ర స్ఫూర్తికి విరుద్ధంగా ఈ దారుణానికి పాల్పడ్డ దోషులను కఠినంగా శిక్షించాలని డిమాండ్‌ చేశారు. ప్రజల మనిషిగా ఉన్న కృష్ణయ్య కిరాతకంగా హత్య చేయడం దిగ్భ్రాంతికి గురి చేసిందన్నారు. రక్తపుటేరులు పారిన ఖమ్మం చుట్టుపక్కల ప్రాంతాలు ప్రస్తుతం అభివృద్ధి పథంలో దూసుకుపోతుందన్నారు. ఈ క్రమంలో కొన్ని పార్టీలకు ప్రజలు తిలోదకాలు ఇస్తుండటంతోనే అసహనంతోనే ఇలాంటి దారుణానికి పాల్పడుతున్నారని మండిపడ్డారు. గత 40 ఏళ్లలో హత్యలకు, నెత్తుటి ధారలకు నిలయమైన ఖమ్మం ప్రాంతాన్ని అవకాశం వచ్చినప్పుడల్లా ప్రశాంతంగా ఉంచేందుకు కృషి చేశానన్నారు. అభివృద్ధిలో సమాజం ముందుకెళ్లాలంటే హత్యా రాజకీయాలు తగవన్నారు. హత్యా రాజకీయాలతో కుటుంబాలు, ప్రాంతాలు అభివృద్ధి సాధించలేవన్నారు.

నేతల నివాళి: ఖమ్మం ఆస్పత్రి శవాగారం వద్ద కృష్ణయ్య మృతదేహానికి ఎమ్మెల్యేలు కందాల ఉపేందర్‌రెడ్డి, సండ్ర వెంకటవీరయ్య, ఎమ్మెల్సీ తాతా మధుసూదన్‌, మాజీ ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ, నాయకుడు సాధు రమేశ్‌రెడ్డి, కాంగ్రెస్‌ నాయకుడు రాయల నాగేశ్వరరావు నివాళులు అర్పించారు.

ఎంపీ నామా నాగేశ్వరరావు చరవాణిలో కృష్ణయ్య కుటుంబ సభ్యులతో మాట్లాడి ప్రగాఢ సానుభూతి తెలిపారు.

కేసు నమోదు

ఈ ఘటనపై ఖమ్మం గ్రామీణ ఠాణాలో సోమవారం కేసు నమోదైంది. తెల్దారుపల్లికి చెందిన రంజాన్‌, కృష్ణస్వామి, లింగయ్య, కృష్ణ, నాగేశ్వరరావు, శ్రీను, నాగయ్య, మరికొంత మంది కలిసి కత్తులు, వేటకొడవళ్లు, గొడ్డళ్లతో విచక్షణా రహితంగా తన తండ్రిని నరికి చంపారని, తమ్మినేని కోటేశ్వరరావు కుట్రపన్ని పథకం ప్రకారం హత్య చేయించారని కృష్ణయ్య కుమారుడు నవీన్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని