logo

ఐఏఎస్‌ చూపిన బాటలో..సర్కారీ కొలువుల్లో

ఆమెకు మొత్తం 9 మంది సంతానం. ఒక్కరు మినహా అందరూ ఆడవాళ్లే. ఒక్కగానొక్క కుమారుడు కలెక్టర్‌ కావాలన్నది ఆ తల్లి ఆశ. ఐఏఎస్‌ కావాలన్న కన్నతల్లి ఆశయాన్ని సాధించేందుకు ఆ కుమారుడు ఎంతో కష్టపడ్డారు. ఏకంగా 8 కొలువులు దక్కించుకున్నారు.

Published : 18 Aug 2022 02:31 IST

ప్రభుత్వ ఉద్యోగులకు కేరాఫ్‌.. సర్వారం

ఆమెకు మొత్తం 9 మంది సంతానం. ఒక్కరు మినహా అందరూ ఆడవాళ్లే. ఒక్కగానొక్క కుమారుడు కలెక్టర్‌ కావాలన్నది ఆ తల్లి ఆశ. ఐఏఎస్‌ కావాలన్న కన్నతల్లి ఆశయాన్ని సాధించేందుకు ఆ కుమారుడు ఎంతో కష్టపడ్డారు. ఏకంగా 8 కొలువులు దక్కించుకున్నారు. చివరకు ఐఏఎస్‌గా ఎంపికై తల్లి నమ్మకాన్ని నిలబెట్టారు.  ఆయన పట్టుదల ఆ ఊరికే స్ఫూర్తిగా నిలిచింది. ఒకటా.. రెండా.. ఏకంగా 260కిపైగా సర్కారీ కొలువులు సాధించారు. ప్రైవేటు ఉద్యోగాలు వీటికి అదనం. ప్రభుత్వ కొలువులకు కేరాఫ్‌గా నిలిచిన సర్వాద్రి తండా అలియాస్‌ సర్వారం విజయబావుటాపై ‘న్యూస్‌టుడే’ ప్రత్యేక కథనం.
మన్యం ప్రాంతమైన భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో అత్యధిక ప్రభుత్వ కొలువులు సాధించిన తండాలో సర్వారం ముందువరుసలో నిలుస్తుంది. సుజాతనగర్‌ మండలంలోని ఈ గ్రామంలో 960 గృహాలు, 3,505 జనాభా ఉన్నారు. అక్షరాస్యత శాతం 95 శాతం. అన్ని కుటుంబాల నేపథ్యం వ్యవసాయమే. కనాకష్టం చేసి పిల్లలను ఉన్నత చదువులు చదివించిన వారెందరో ఉన్నారు. తమలా కాయకష్టం చేయలేని పిల్లలు ప్రభుత్వ ఉద్యోగాలు సాధించేలా వారెంతో ప్రోత్సహించారు. ఇలా సుమారు 260 మంది సర్కారీ కొలువుల్లో చేరడం విశేషం. వీరిలో ఐఏఎస్‌ నుంచి అటెండర్‌ స్థాయి వారు ఉండగా... ఇస్రో శాస్త్రవేత్త, నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఎనర్జీ, ఆర్మీ, బ్యాంకింగ్‌, టెలీ కమ్యూనికేషన్స్‌, కమర్షియల్‌ ట్యాక్స్‌ ఆఫీసర్‌, చార్టెడ్‌ అకౌంటెంట్లు వంటి పోస్టుల్లో రాణిస్తున్నవారు చాలా మంది ఉన్నారు.  

ఊరి కోసం కలసికట్టుగా..
కేవలం జీవితాల్లో స్థిరపడటమే కాదు.. పుట్టిన ఊరు కన్నతల్లితో సమానమని ప్రభుత్వ ఉద్యోగులంతా భావించారు. తమ గ్రామం అభివృద్ధి కోసం ఓ కమిటీగా ఏర్పడ్డారు. అభివృద్ధి, ఇతర కార్యక్రమాలకు అండగా నిలుస్తున్నారు. తమలాగే యువత కొలువులు దక్కించుకునేందుకు మార్గనిర్దేశనం చేస్తున్నారు. వారికి కావాల్సిన సహకారాన్ని అందజేస్తున్నారు. 20 వేల పోటీ పుస్తకాలతో ప్రత్యేక గ్రంథాలయం ఏర్పాటు చేశారు. శుద్ధజలాలు అందించే ప్లాంటు నిర్మించారు. రోడ్లు, ఇతర వసతుల కల్పనకు ఆర్థికసాయం చేస్తున్నారు. కోదండ రామాలయం అభివృద్ధికి విరాళాలు విరివిగా అందించారు. ఎక్కడ ఉద్యోగం చేస్తున్నా..   ఎన్ని ఒత్తిళల్లో ఉన్నా.. శ్రీరామ నవమి రోజు స్వామివారి కల్యాణానికి ఉద్యోగులంతా హాజరుకావడం ఆనవాయితీగా వస్తోంది. ఆ రోజు ఊరంతా పండుగ వాతావరణం కనిపిస్తుంది.
అమ్మ కలను నిజం చేసేందుకు ఐఏఎస్‌ అయ్యా: - మాలోతు చంపాలాల్‌, రాష్ట్ర హోం కార్యదర్శి (సైనిక్‌ వెల్ఫేర్‌)
అమ్మకోరిక తీర్చాలని ఐఏఎస్‌ సాధించా. మాది గిరిజన తండా. అమ్మ పేరు మంగమ్మ. మొత్తం 9 మంది సంతానం. అందరూ ఆడవారు కాగా.. నేనొక్కడినే మగ సంతానం. అందరికన్నా పెద్దవాణ్ని. ఎలాగైనా కలెక్టర్‌ కావాలన్నది అమ్మ కోరిక. విద్యాభ్యాసం మొత్తం ప్రభుత్వ విద్యాలయాల్లో సాగింది. ఆ తర్వాత 8 ప్రభుత్వ ఉద్యోగాలు సాధించా. తొలుత ఆర్డీవో కొలువులో చేరా. చివరగా 1994లో ఐఏఎస్‌గా ఎంపికయ్యా. కలెక్టర్‌ ఉద్యోగం సాధించినప్పటి నుంచి ఎంతో మంది నిరుద్యోగ యువతకు ప్రేరణగా నిలిచా. వారు సైతం ఆసక్తి ఉన్న ఉద్యోగాలు సాధించేలా ప్రోత్సహించా. పలు అభివృద్ధి పనులకు సహకారం అందిస్తున్నాను. గ్రామ ప్రజల కష్టసుఖాల్లో పాలుపంచుకోవడం ఆనందంగా ఉంది. రాష్ట్ర హోం కార్యదర్శిగా (సైనిక్‌ వెల్ఫేర్‌) విధులు నిర్వహిస్తున్న నేను ఈ నెల 31న పదవీ విరమణ పొందుతున్నా. విరమణ పదవికే.. ప్రోత్సాహం, సేవా కార్యక్రమాలకు మాత్రం కాదు.


గిరిజన బిడ్డగా గర్విస్తున్నా..
- భూక్యా జైత్రాం, సింగరేణి వైద్యుడు

పేదలకు నా వంతుగా సేవ చేయాలని తల్లిదండ్రుల కోరిక మేరకు ఎంబీబీఎస్‌ చదివా. ప్రభుత్వ పాఠశాలల్లోనే విద్యాభ్యాసం కొనసాగింది. ఒక గిరిజన బిడ్డగా కొత్తగూడెం సింగరేణి వైద్యశాలలో సేవలందిస్తుండటం.. ఈ వృత్తిలోకి చేరిన మన్యం ప్రాంత తొలి వ్యక్తిని నేనే కావడం గర్వంగా ఉంది. వైద్యుడిగా ఎంతో మందిని ప్రాణాపాయ స్థితి నుంచి కాపాడగలగడం దేవుడు నాకిచ్చిన వరంగా భావిస్తున్నాను.


అన్న ప్రోత్సాహంతోనే ఈ స్థాయికి
- మాలోతు సుజాత, తహసీల్దార్‌

ఐఏఎస్‌ అధికారి చంపాలాల్‌ నా సోదరుడు. ఆయన ప్రోత్సాహంతో చదువుల్లో రాణించి సచివాలయంలో ఉద్యోగం సాధించాను. తాను ఉద్యోగం చేస్తూనే 8 మంది సోదరీమణులను ఎంతో ప్రోత్సహించేవారు. మరో సోదరి ఉపాధ్యాయురాలుగా పనిచేస్తున్నారు. ప్రస్తుతం నేను పదోన్నతిపై సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల మండల తహసీల్దార్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. మారుమూల గిరిజన గ్రామమే అయినా.. అత్యధిక మంది ప్రభుత్వ ఉద్యోగులుగా విజయం సాధించడం గర్వంగా ఉంది. ఒకరిని చూసి మరొకరు స్ఫూర్తిపొందుతూ విజయం సాధించడం సంతోషంగా ఉంది.  


ఉపాధ్యాయులే స్ఫూర్తిగా ఈ వృత్తిలోకి
శారద, ప్రభుత్వ టీచర్‌

మా ఉపాధ్యాయుల్ని స్ఫూర్తిగా తీసుకుని ఈ వృత్తిలోకి రావాలని లక్ష్యంగా పెట్టుకున్నా. చివరకు అమ్మానాన్నల ప్రోత్సాహంతో 1999 డీఎస్సీలో టీచర్‌ కొలువు సాధించా. నా కంటే ముందు ఎంతో మంది గ్రామస్థులు ఉన్నత స్థానంలో నిలిచారు. సందర్భోచితంగా వారిని కలిసినప్పుడు చెప్పలేనంత ఆనందం కలుగుతుంది. ఓ తండా నుంచి అత్యధిక మంది సర్కారీ కొలువులు సాధించిన జిల్లాలోనే గుర్తింపు దక్కించుకోవండం సంతోషంగా ఉంది. మా గ్రామం మాదిరిగా మిగతా వారూ విజయం సాధించాలని ఆకాంక్షిస్తున్నా.


ఏఏ శాఖలో ఎంతమంది
ఉపాధ్యాయులు: 105
సింగరేణి: 52
అటవీశాఖ: 35
వైద్యశాఖ: 20
పోలీసు విభాగం: 10
విద్యుత్తు రంగం: 10
రెవెన్యూ, పీఆర్‌
ఇతర శాఖల్లో: 28

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని