logo

నిధులు వెనక్కి.. సమస్యలు మొదటికి..

ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో చీపురు కొనుగోలు చేయడానికీ సమస్యే. కనీసం ఫ్యాను మరమ్మతుకూ నెలలు గడపాల్సిన దుస్థితి. జిల్లాలో 5 యూపీహెచ్‌సీలు, ఒక జిల్లా ఆసుపత్రి, ఒక ఏరియా ఆసుపత్రి, 4 సీహెచ్‌సీలు, 29 పీహెచ్‌సీలు ఉన్నాయి. ప్రతి పీహెచ్‌సీకి ఆసుపత్రి

Updated : 19 Aug 2022 05:41 IST
హెచ్‌డీఎస్‌, నాన్‌ హెచ్‌డీఎస్‌ కోటాలో రూ.1.24 కోట్లు అంతేనా?
పాల్వంచ గ్రామీణం, న్యూస్‌టుడే

ఇదీ పాల్వంచ మండలం ఉల్వనూరు పీహెచ్‌సీలో ఇన్వర్టర్లు. ఇవి మరమ్మతులకు గురయ్యాయి.  రూ.2 వేలు వెచ్చించి చిన్నపాటి మరమ్మతులు చేస్తే వినియోగంలోకి వస్తాయి. కానీ నిధుల కొరతతో వీటన్నింటిని పట్టించుకోవడం మానేశారు.

ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో చీపురు కొనుగోలు చేయడానికీ సమస్యే. కనీసం ఫ్యాను మరమ్మతుకూ నెలలు గడపాల్సిన దుస్థితి. జిల్లాలో 5 యూపీహెచ్‌సీలు, ఒక జిల్లా ఆసుపత్రి, ఒక ఏరియా ఆసుపత్రి, 4 సీహెచ్‌సీలు, 29 పీహెచ్‌సీలు ఉన్నాయి. ప్రతి పీహెచ్‌సీకి ఆసుపత్రి అభివృద్ధి నిధులు (హెచ్‌.డీ.ఎస్‌.), అన్‌టైడ్‌ నిధులు ప్రతి ఏటా రూ.87 వేల చొప్పున నిధులు విడుదలయ్యేవి. కరోనా కారణంగా రెండేళ్ల నుంచి ఆ నిధులు సైతం రావట్లేదు. పోనీ.. అంతకు ముందు విడుదలైన డబ్బుల్ని సద్వినియోగం చేసుకున్నారా అంటే అదీ లేదు. ఫలితంగా జిల్లాలోని ఆస్పత్రులకు సంబంధించిన నిధుల్ని ప్రభుత్వం మూణ్నెల్ల క్రితమే వెనక్కు తీసుకుంది. కానీ తీర్మానాలు చేసి అందజేస్తే కావాల్సిన నిధులు అందిస్తామన్నది జిల్లా అధికారుల భరోసా.

ఇదీ.. సంగతి..

జిల్లా కేంద్రం నుంచి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల వరకు బ్యాంకుల ఖాతాల్లో రెండేళ్ల క్రితం వరకు మొత్తం రూ.1,24,31,724 నిధులు ఉన్నాయి. వాటిని వినియోగించుకోకపోవడం వల్ల మూణ్నెల్ల క్రితం ప్రభుత్వం వెనక్కు తీసుకుంది. ఆ నిధుల్లో ఆసుపత్రి అభివృద్ధి నిధులు (హెచ్‌.డి.ఎస్‌.) రూ.22,30,455, అన్‌టైడ్‌ (నాన్‌ హెచ్‌డీఎస్‌) 1,02,01,269 ఉన్నాయి. సమస్యలున్నా వైద్యాధికారులు తమ ఆస్పత్రులకు సంబంధించిన బ్యాంకు ఖాతాల్లో నిల్వలను వినియోగించకపోవడం గమనార్హం. నిధుల ఖర్చు ప్రక్రియతో పాటు బిల్లులు, ఆడిట్‌, ఏమైనా తప్పులుదొర్లితే శాఖాపరమైన చర్యలు తప్పవన్న ధోరణే వాటిని వదిలేయడానికి కారణమనే వాదన వినిపిస్తోంది.  

మంగపేటలో అధ్వానంగా ఉన్న మరుగుదొడ్లు

ఇలా వినియోగించవచ్చు

* హెచ్‌డీఎస్‌ నిధులతో పీహెచ్‌సీలో వసతులు సమకూర్చుకోవచ్చు. మరమ్మతులు చేయించుకోవచ్చు. అత్యవసర వైద్యానికి మందులు కొనుగోలు చేయొచ్చు. కానీ ఇందుకోసం సమావేశం నిర్వహించాలి. హెచ్‌డీఎస్‌ కమిటీలో జడ్పీటీసీ, ఎంపీపీ, సర్పంచులు, ఎంపీటీటీ ఎంపీడీవో, ఎమ్మార్వో, డిప్యూటీ డీఎంహెచ్‌వో, స్థానిక వైద్యుడు తదితరులుంటారు. తీర్మానం జిల్లా అధికారులకు పంపించాలి. అక్కడ ఆమోదం లభిస్తే నిధులొస్తాయి. వైద్యుడు తొలుత ఖర్చు పెడితే ఆ తర్వాత ఉన్నతాధికారులు చెల్లిస్తారు. ఈ క్రమంలో కొంత కోత పడే అవకాశం ఉండటంతో ఎవరూ ముందస్తుగా వ్యయం చేయడానికి సాహసించట్లేదు. ఒక్కో పీహెచ్‌సీలో కనీసం రూ.10 వేల నుంచి రూ.30 వేలు అవసరం ఉండటంతో చాలా మంది వెనుకంజ వేస్తున్నారు.

* ఉపకేంద్రాలలో గర్భిణులకు పరీక్షలు చేయడానికి కనీసం సామగ్రి ఉండటంలేదు. అన్‌టైడ్‌ నిధులు వెనక్కి వెళ్లడంతో సమస్యలు పరిష్కరించుకునే అవకాశం లేకుండా పోయింది.

డీఎంహెచ్‌వో దయానంద స్వామి ఏమన్నారంటే.. ‘నిధులు ప్రభుత్వం తిరిగి తీసుకున్న మాట వాస్తవమే. కానీ ఎవరైనా ఆస్పత్రి సిబ్బంది తీర్మానం చేసి పంపితే నిధులు వెంటనే మంజూరు చేస్తాం’.


వేధించే సమస్యలెన్నో...

* పాల్వంచ మండలం ఉల్వనూరు, జగన్నాథపురంలోని పీహెచ్‌సీలలో ఇన్వర్టర్లు, ఆర్వో ప్లాంటు పనిచేయట్లేదు.  

* జగన్నాథపురంలో భవనం కురిసి ఫ్యాన్లు కాలిపోయాయి. కంప్యూటర్‌ పనిచేయడం లేదు. కిన్నెరసాని ప్రాథమిక ఆరోగ్య ఉపకేంద్రాలకు గేట్లు లేవు.  

* రేగళ్లలో సోలార్‌ సమస్యలు ఉన్నాయి. వీటిని డబ్బుల్లేక పనిచేయట్లేదు.

* ఆళ్లపల్లిలో ఆర్వోప్లాంట్‌ పనిచేయట్లేదు. బాటిళ్లు తెప్పించి రోగులకు అందిస్తున్నారు. ఇటీవల వైరింగ్‌ పనులు చేయించారు. ఇందుకోసం వైద్యసిబ్బంది నిధులు వెచ్చించినట్లు తెలుస్తోంది.

* ములకలపల్లి మండలం మంగపేట ఆస్పత్రిలో మరుగుదొడ్లు అధ్వానంగా ఉన్నాయి. కిచెన్‌షెడ్డు అధ్వానంగా ఉండటంతో కూల్చారు. తాగునీటి సమస్య కూడా ఉంది. స్థానిక వైద్యులు కొన్ని పనులకు సొంత డబ్బులు వెచ్చించారు.

* చర్ల మండలం కొయ్యూరులో పీహెచ్‌సీకి ప్రహరీ లేదు.

* పినపాక పీహెచ్‌సీ 24 గంటల ఆసుపత్రి. ఏడాదికి 100 కాన్పులు చేస్తారు. ఇక్కడ తాగునీటి సమస్య ఉంది. మరుగుదొడ్లు లేవు. పాత బిల్డింగ్‌ కురుస్తోంది.  

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు