logo

యంత్రాలు పనిచేయక పరేషన్‌

జిల్లా వ్యాప్తంగా రేషన్‌ దుకాణాల్లో ఇటీవల అమర్చిన ఇ పోస్‌ యంత్రాల పనితీరు నత్తను తలపిస్తున్నాయి. 4జి సిగ్నల్స్‌ ఆధారంగా వేగంగా యంత్రాలు పనిచేస్తాయని విజన్‌ టెక్‌ సంస్థ నిర్వాహకులు అమర్చారు. కానీ యంత్రాలు సరిగా పనిచేయక రేషన్‌ దుకాణాల

Updated : 19 Aug 2022 05:37 IST

ఖమ్మం కలెక్టరేట్‌, న్యూస్‌టుడే

ఖమ్మంలోని ఓ రేషన్‌ దుకాణంలో అమర్చిన ఇ పోస్‌ యంత్రం, యాంటెన్నా, ఎలక్ట్రానిక్‌ తూకం, ఐరిష్‌ ఫరికరం...

జిల్లా వ్యాప్తంగా రేషన్‌ దుకాణాల్లో ఇటీవల అమర్చిన ఇ పోస్‌ యంత్రాల పనితీరు నత్తను తలపిస్తున్నాయి. 4జి సిగ్నల్స్‌ ఆధారంగా వేగంగా యంత్రాలు పనిచేస్తాయని విజన్‌ టెక్‌ సంస్థ నిర్వాహకులు అమర్చారు. కానీ యంత్రాలు సరిగా పనిచేయక రేషన్‌ దుకాణాల ఎదుట కార్డుదారులు గంటల తరబడి నిరీక్షించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఆగస్టు నెలలో కార్డుదారులకు 15 కిలోలు చొప్పున ఉచిత బియ్యం పంపిణీ చేస్తున్నారు. జిల్లాలోని 748 రేషన్‌ దుకాణాల ద్వారా 4,16,812 కార్డులపై 11,68,535 మందికి 17,600 మె.ట. బియ్యం కేటాయించారు. ఈనెల 5 నుంచి పంపిణీ ప్రారంభించగా 19న ముగుస్తున్నట్లు డీలర్లు చెపుతున్నారు. కానీ గురువారం వరకు జిల్లాలో కేవలం 68 శాతం మాత్రమే బియ్యం పంపిణీ జరిగింది. చాలా మంది కార్డు దారులు రేషన్‌ దుకాణాల వద్ద నిరీక్షించి తిరిగి పోతున్నారు. దీంతో తమ రోజువారీ కూలీ పనులు కోల్పోతున్నట్లు పలువురు వాపోతున్నారు. దీంతో కార్డు దారులు, రేషన్‌ డీలర్లకు మధ్య వాగ్వాదం చోటుచేసుకుంటోంది.

పనితీరు ఇలా..

ప్రభుత్వంతో చేసుకున్న ఒప్పందం మేరకు గత జులై నుంచి విజన్‌ టెక్‌ సంస్థ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని రేషన్‌ దుకాణాల్లో ఇ పోస్‌ యంత్రాలు అమర్చింది. జియో 4 జి సిమ్‌ ఇ పోస్‌ యంత్రాల్లో అమర్చారు. బ్లూటూత్‌ డివైస్‌ ఆధారంగా 4జి సిగ్నల్స్‌తో యంత్రం పనిచేస్తుంది. దీనికి అనుసంధానంగానే ఎలక్ట్రానిక్‌ తూకం యంత్రం పనిచేస్తుంది. ఇ పోస్‌ యంత్రంలో కార్డు దారుడి వేలిముద్ర నమోదు చేయగానే డేటా బేస్‌ ఆధారంగా ఎంత మంది సభ్యులున్నారు...ఎన్ని కిలోలు జారీ చేయాలనేది యంత్రంలోనే సెకన్లలో నమోదై అనుమతి ఇస్తుంది. ఈ మేరకు ఎలక్ట్రానిక్‌ తూకం యంత్రంపై బియ్యం ఉంచాలి. ఇవ్వాల్సిన బియ్యం కచ్చితంగా ఉంటేనే యంత్రం అంగీకరిస్తుంది. పది గ్రాములు ఎక్కువ, తక్కువ ఉన్నా నిరాకరిస్తుంది. ఈ ట్రాంజాక్షన్‌ సకాలంలో అనుమతికాకుండా ఫెయిల్‌ అయితే మళ్లీ కార్డుదారుడి వివరాలు మొదటి నుంచి నమోదు చేయాల్సి ఉంటుంది. ఇదే సమయంలో కొందరి కార్డుదారుల వేలిముద్రలు యంత్రం స్వీకరించకుంటే ఐరిష్‌ పరికరం ద్వారా కార్డుదారుడి కనుపాపలను గుర్తించే ప్రక్రియ చేపడతారు. కార్డులో ఒకరిద్దరుంటేనే ఓటీపీ ద్వారా అనుమతి లభిస్తుంది. ఇ పోస్‌ యంత్రానికి 4జి సిగ్నల్స్‌ అందేలా ఒక యాంటిన్నా ఏర్పాటు చేయాల్సి ఉంది. అయినా సిగ్నల్స్‌ సరిగా అందక యంత్రాలు మొరాయిస్తున్నాయి. ఒక్కో కార్డు ట్రాంజాక్షన్‌ పూర్తికావటానికి 15 నుంచి 20 నిమిషాల సమయం పడుతోందని పలువురు డీలర్లు వాపోతున్నారు. దీంతో చాలా మంది డీలర్లు ఇ పోస్‌ యంత్రంతో సంబంధం లేకుండా ఎలక్ట్రానిక్‌ తూకం యంత్రాలు ఉపయోగిస్తున్నారు. సాంకేతిక కారణాలతో యంత్రాల పనితీరు మందగించి కార్డుదారులు ఇబ్బంది పడుతున్నారు.

ఇ పోస్‌ యంత్రాల పనితీరులో ఏర్పడిన సాంకేతిక సమస్యలు పరిష్కరిస్తున్నారు. విజన్‌ టెక్‌ సంస్థ నిర్వాహకులు నాలుగు రోజులు క్రితం అప్‌గ్రేడ్‌ చేశారు. మరో నాలుగు రోజుల్లో మిగతా సమస్యలు తీరుతాయి. బ్లూటూత్‌ సమస్య పరిశీలిస్తున్నారు. బియ్యం పంపిణీ గడువు పొడిగించే అవకాశం ఉంది.

- రాజేందర్‌, డీఎస్వో, ఖమ్మం

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని