logo

భూపతిరావు.. రెండేళ్లు ఎమ్మెల్యేగా

అనారోగ్యంతో కన్నుమూసిన సీపీఐ మాజీ ఎమ్మెల్యే భీమపాక భూపతిరావు 1983 నుంచి 1985 వరకు పాలేరు శాసనసభ్యుడిగా పనిచేశారు. 1983లో ఎన్టీ రామారావు తెలుగుదేశం పార్టీని స్థాపించి రాష్ట్రవ్యాప్తంగా ప్రభంజనం

Published : 06 Sep 2022 03:08 IST


భీమపాక భూపతిరావు

కూసుమంచి, న్యూస్‌టుడే: అనారోగ్యంతో కన్నుమూసిన సీపీఐ మాజీ ఎమ్మెల్యే భీమపాక భూపతిరావు 1983 నుంచి 1985 వరకు పాలేరు శాసనసభ్యుడిగా పనిచేశారు. 1983లో ఎన్టీ రామారావు తెలుగుదేశం పార్టీని స్థాపించి రాష్ట్రవ్యాప్తంగా ప్రభంజనం సృష్టించినప్పటికీ పాలేరులో ఆ ప్రభావం కనిపించలేదు. సీపీఎం మద్దతుతో పోటీ చేసిన భూపతిరావు గెలుపొందారు. అప్పుడు తెదేపా అభ్యర్థిగా పోటీ చేసిన బుద్ద అన్నపూర్ణ కేవలం 6 వేల ఓట్లు సాధించగా, భూపతిరావు తన సమీప ప్రత్యర్థి కాంగ్రెస్‌ అభ్యర్థి సంభాని చంద్రశేఖర్‌పై 8,289 ఓట్ల ఆధిక్యత సాధించారు. కూసుమంచి, తిరుమలాయపాలెం, నేలకొండపల్లి, ముదిగొండ మండలాలతో కూడిన ఈ నియోజకవర్గంలో మొత్తం ఓట్లు 1,00,021 ఉండగా, 75,981 ఓట్లు పోలయ్యాయి. 74,471 ఓట్లు చెల్లుబాటు కాగా, భూపతిరావు 35,915 ఓట్లు సాధించారు. సంభాని చంద్రశేఖర్‌కు 27,626 ఓట్లు వచ్చాయి.

ఎన్‌టీఆర్‌ నిర్ణయంతో.. 1983లో గెలిచిన భూపతిరావు 1985 వరకు మాత్రమే ఎమ్మెల్యేగా పనిచేసే అవకాశం దక్కింది. ఎన్టీ రామారావుకు 85లో అసెంబ్లీని రద్దు చేయటంతో పూర్తి స్థాయి ఎమ్మెల్యేగా పనిచేయలేకపోయారు. 1985లో ఉపఎన్నికల్లో ఒప్పందం మేరకు సీపీఐ, సీపీఎంకు మద్దతు నివ్వడం, తెదేపా కూడా కమ్యునిస్టులతో కలిసిన నేపథ్యంలో ఇక్కడ సీపీఎం అభ్యర్థి బాజీ హన్మంతు విజయం సాధించారు.

ఎంపీ, ఎమ్మెల్యేల సంతాపం: భూపతిరావు మృతికి ఎంపీ నామా నాగేశ్వరరావు, పాలేరు శాసనసభ్యుడు కందాళ ఉపేందర్‌రెడ్డి సంతాపం ప్రకటించారు. సీపీఐ రాష్ట్ర నాయకుడు బాగం హేమంతరావు, పార్టీ నాయకులు జి.మల్లేశ్‌, మండల కార్యదర్శి నర్సింహా, పార్టీ సీనియర్‌ నాయకుడు సంగబత్తుల వెంకటరెడ్డి తదితరులు సంతాపం తెలిపిన వారిలో ఉన్నారు.


పలువురి నివాళి


తండ్రి పార్ధివదేహం వద్ద హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ భీమపాక నగేశ్‌

భద్రాచలం పట్టణం, న్యూస్‌టుడే: పాలేరు మాజీ ఎమ్మెల్యే భీమపాక భూపతిరావు పార్థివదేహానికి సోమవారం భద్రాచలంలోని ఆయన స్వగృహంలో పలువురు నివాళులర్పించారు. భూపతిరావు కాలనీలో ఆయన నివాసానికి వచ్చి సంతాపం తెలిపారు.
* భూపతిరావు కుమారుడు, హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ భీమపాక నగేశ్‌ తండ్రి పార్థివ దేహానికి నివాళులు అర్పించారు. ఆయన వెంట పట్టణ న్యాయవాదుల సంఘం నాయకులు సీనియర్‌ న్యాయవాదులు రమణారావు, కొడాలి శ్రీనివాసన్‌, మాజీ ఏపీపీ కోటా దేవదానం, న్యాయవాదులు సాల్మన్‌రాజు, అక్తర్‌, ఎంవీ ప్రసాద్‌, కుంచాల రమేశ్‌, పడిసిరి శ్రీనివాసరావు, శివశంకర్‌ పాల్గొన్నారు. భద్రాచలం శాసన సభ్యుడు పొదెం వీరయ్య ఓ ప్రకటనలో తీవ్ర సంతాపం తెలిపారు. పీసీసీ నాయకుడు భట్టి విక్రమార్క సతీమణి మల్లు నందిని... సోమవారం భూపతిరావు పార్థివ దేహాన్ని సందర్శించి నివాళులు అర్పించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని