logo

ప్రజా ప్రతినిధులకే దళితబంధు వరం

వెనుకబడిన దళిత కుటుంబాలను ఆర్థికంగా నిలబెట్టాలనే లక్ష్యంతో ప్రభుత్వం ‘దళిత బంధు’ పథకం అమలు చేస్తోంది. ఈ పథకం కొందరు ప్రజాప్రతినిధులు, దళారులకు వరంగా మారిందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. అధికారుల సమీక్షలు, ఆదేశాలు, ప్రభుత్వ సూచనలన్నీ

Updated : 27 Sep 2022 05:57 IST

కొత్తగూడెం పట్టణం, న్యూస్‌టుడే

వెనుకబడిన దళిత కుటుంబాలను ఆర్థికంగా నిలబెట్టాలనే లక్ష్యంతో ప్రభుత్వం ‘దళిత బంధు’ పథకం అమలు చేస్తోంది. ఈ పథకం కొందరు ప్రజాప్రతినిధులు, దళారులకు వరంగా మారిందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. అధికారుల సమీక్షలు, ఆదేశాలు, ప్రభుత్వ సూచనలన్నీ కేవలం కాగితాలకే పరిమితం కాగా... వాస్తవ పరిస్థితుల్లో యూనిట్‌ మొత్తంలో సగానికి సగం కూడా లబ్ధిదారుల దరికి చేరడం లేదని తెలుస్తోంది. ఆర్థికంగా నిలబడటం మాటేమో కానీ, అదనంగా ఆర్థిక కష్టాలను కొనితెచ్చుకునే పరిస్థితులను పలువురు ఎదుర్కొంటున్నారు.
ఇదీ.. సంగతి
కొత్తగూడెం నియోజకవర్గంలో మొదటి విడత 100 యూనిట్లు మంజూరయ్యాయి. ఒక్కో యూనిట్‌కు రూ.10 వేల సంక్షేమి నిధి మినహాయించుకుని మిగిలిన రూ.9.90 లక్షలను లబ్ధిదారుల ఖాతాల్లోకి ఎస్సీ అభివృద్ధి శాఖ ఆధ్వర్యాన జమ చేస్తున్నారు. ఈ మొత్తంలోంచి దళారులు రూ.5 లక్షలు వసూలు చేసి వాటాలు పంచుకుంటున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. దళారీ క్రతువులో ప్రధాన పాత్రధారులతో అంటకాగే కొందరు కిందిస్థాయి అధికార సిబ్బంది, అధికార పార్టీకి చెందిన ఛోటామోటా నాయకులు సైతం రూ.10 వేలకు తగ్గకుండా జేబుల్లో వేసుకుంటున్నారు. మరీ ఇంత దందా అయితే మాకు మిగిలేదమిటని ఎవరైనా లబ్ధిదారు అడిగితే.. ‘పైసా తిరిగి కట్టేది లేదుకదా?’ అని దబాయిస్తున్నారట. వాటా ఇవ్వకుంటే వేరొకరి పేరు జాబితాలో వస్తుందని బెదిరిస్తున్నారట. ఇదీ.. నియోజకవర్గంలో ‘దళితబంధు’ లబ్ధిదారుల దయనీయ స్థితి. త్వరలో రెండో జాబితాగా జిల్లాకు 500.. ఇందులో కొత్తగూడెం నియోజకవర్గానికి 100 యూనిట్లు మంజూరు చేసేందుకు సిద్ధం చేయాలని సమీక్షల్లో కలెక్టర్‌ సైతం ఆదేశాలు జారీ చేస్తున్నారు. ఇదే సమయంలో నిజమైన అర్హులను ఎంపిక చేసి.. ఎక్కడా వసూళ్ల దందా జరగకుండా చూడాలని దళితులు కోరుతున్నారు.
* ‘గూడెం’లో ఓ వార్డుకు చెందిన ప్రజాప్రతినిధి భర్త స్థానిక దళితుడికి మొదటి విడత దళితబంధు పథకం ఇప్పిస్తానన్నాడు. వచ్చే మొత్తంలో సగం ఇవ్వాలని తేల్చి చెప్పాడు. లేకపోతే వేరొకరు రెడీగా ఉన్నారనడంతో ఆ వ్యక్తి సరేనన్నాడు. ఇటీవల యూనిట్‌ కింద తొలి దఫా రూ.5 లక్షలు రాగా అందులో సగం కోత విధించుకుని మిగతా లబ్ధిదారుడికి అప్పగించాడు.
*  ప్రజాప్రతినిధులైన వారికే ఏకంగా దళితబంధు మంజూరవడంతో ఆయా వార్డుల్లో పేదలైన దళితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ‘గూడెం’లో 36 మంది కౌన్సిలర్లు, నలుగురు కో ఆప్షన్‌ సభ్యులుండగా.. ఎక్కువ చోట్ల వారి కుటుంబీకులు, బంధువులే ఎంపికకావడం గమనార్హం.
* దీనికి తోడు కొందరు సంఘాల నాయకులు, గతంలో పలు రుణాలిప్పించిన అనుభవం ఉన్న కొందరు మధ్యవర్తులు పథకం పేరుతో అమాయకుల నుంచి రూ.లక్షల్లో దండుకుని మొహం చాటేస్తున్నారన్న ఆరోపణలున్నాయి. కొందరు కొత్తగా మంజూరయ్యే జాబితాలో చోటు కల్పిస్తామని మభ్యపెడుతుండటం గమనార్హం.
* ‘పథకం అమలులో దళారులను ఆశ్రయించాల్సిన అవసరం లేదు. ఎంపికలు పారదర్శకంగానే కొనసాగుతాయి. మధ్యవర్తులకు డబ్బులిచ్చి నష్టపోవద్దన్నది’ అధికారుల మాట.

పారదర్శకత ఏదీ?
లబ్ధిదారుల ఎంపిక పూర్తిగా ఎమ్మెల్యే ఆధీనంలో కొనసాగాలని ప్రభుత్వం నిర్ణయించింది. తొలివిడత 100 యూనిట్లు మంజూరయ్యాయి. వీటిలో కొత్తగూడెం, పాల్వంచ పురపాలకాల్లోని వార్డుకు ఒక యూనిట్‌ చొప్పున, మిగతావి గ్రామాలకు సమాన ప్రాతినిధ్యంలో కేటాయించాలన్నది ప్రజాప్రతినిధి, అధికారుల నిర్ణయం. కానీ ఇదే సమయంలో రాజకీయ బలం ఉన్న కొందరు మధ్యవర్తులు ముందే లబ్ధిదారులతో 50 శాతం వాటాతో ఒప్పందం చేసుకోగా, ఎక్కువ యూనిట్లు వారికే దక్కినట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి. సంఘాల పేరుతో హడావుడి చేస్తూ కొందరు నాయకుల మెప్పుపొందే వారి తరఫున కూడా కొన్ని యూనిట్లు మంజూరు చేశారన్న విమర్శలున్నాయి. సగం వాటా దళారులకే చెందడంతో ఇక దుకాణం పెట్టడానికి పెట్టుబడే లేకుండా పోయిందని కొందరు.. రాజకీయంగా, సామాజికంగా పలుకుబడి ఉన్నవారేమో మొక్కుబడిగా యూనిట్లు ప్రారంభించి అంతా మ.మ. అనిపించడం కొసమెరుపు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని