logo

మలివయస్సుకు చట్టమే అండ

ఖమ్మం నగరానికి చెందిన వృద్ధ దంపతులకు ఇద్దరు కూతుళ్లు, కుమారుడున్నారు. వారికి పక్కా ఇల్లు ఉంది. కిరాణ దుకాణం పెట్టుకుని జీవిస్తున్నారు. కుమారుడు చనిపోయాడు. దీంతో కోడలు ఉన్న ఇల్లు అమ్మాలని వృద్ధులపై ఒత్తిడి తీసుకు వచ్చి అనేక రకాలుగా హింసించేది. పెద్ద మనుషుల్లో పంచాయితీ పెట్టినా

Updated : 01 Oct 2022 05:54 IST

నేడు అంతర్జాతీయ వయోవృద్ధుల దినోత్సవం

ఖమ్మం ఖానాపురం హవేలి, న్యూస్‌టుడే

* ఖమ్మం నగరానికి చెందిన వృద్ధ దంపతులకు ఇద్దరు కూతుళ్లు, కుమారుడున్నారు. వారికి పక్కా ఇల్లు ఉంది. కిరాణ దుకాణం పెట్టుకుని జీవిస్తున్నారు. కుమారుడు చనిపోయాడు. దీంతో కోడలు ఉన్న ఇల్లు అమ్మాలని వృద్ధులపై ఒత్తిడి తీసుకు వచ్చి అనేక రకాలుగా హింసించేది. పెద్ద మనుషుల్లో పంచాయితీ పెట్టినా వేధింపులకు ఆపలేదు. దీంతో ఆ వృద్ధులు ఖమ్మం న్యాయసేవా సంస్థకు ఫిర్యాదు చేశారు. న్యాయమూర్తి వారి కుటుంబ సభ్యులను పిలిపించి కౌన్సెలింగ్‌ ఇచ్చారు. అత్తామామలు, కోడలుతో విడివిడిగా రాజీ కుదిర్చారు. ప్రస్తుతం ఏ సమస్య లేకుండా ఉంటున్నారు.

* పూర్వ ఖమ్మం జిల్లా గార్లకు చెందిన ఓ వృద్ధుడు(75)కి ఇద్దరు కుమారులు కాగా పెద్ద కొడుకు వ్యవసాయం చేసుకుని జీవిస్తున్నాడు. చిన్న కుమారుడ్ని ఉన్నత చదువులు చెప్పించడంతో ప్రభుత్వ ఉద్యోగం వచ్చింది. ఈ క్రమంలో భార్య చనిపోయింది. ఏ పనీ చేసుకోలేని నిస్సహాయ స్థితి. ఇద్దరు కుమారులు తండ్రిని పట్టించుకోవడం లేదు. చిన్న కుమారుడి నుంచి జీవన భృతి ఇప్పించాల్సిందిగా న్యాయసేవాధికార సంస్థను ఆశ్రయించారు. కోర్టు అతని కుమారుడితో మాట్లాడి నెల నెలా జీవన భృతి ఇచ్చేలా ఒప్పించింది. ప్రస్తుతం ఆయన భృతి పొందుతున్నారు..

* సమాజంలో కొందరు వృద్ధులు నిరాదరణకు గురవుతున్నారు. మలివయస్సులో ఆసరాగా ఉండాల్సిన తమ వారసులు పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా వదిలేస్తున్నారు. అటువంటి పండుటాకులకు మేమున్నామంటూ భరోసా అందిస్తూ.. వారికి తమ పిల్లల నుంచి భృతి కల్పిస్తోంది ‘తల్లిదండ్రులు, వయోవృద్ధుల పోషణ, సంక్షేమ చట్టం-2007’. ఆ చట్టాన్ని అమలు చేస్తూ బాధితులకు చేయూతనిస్తోంది ఖమ్మం న్యాయసేవాధికార సంస్థ. జిల్లాలో జనవరి నుంచి ఇప్పటి వరకు 20 కేసులను పరిష్కరించింది. నేడు అంతర్జాతీయ వయోవృద్ధుల దినోత్సవం సందర్భంగా ‘న్యూస్‌టుడే’ కథనం..

పోషణ బాధ్యత పిల్లలదే..

అనేక సమస్యలతో ఉన్న వృద్ధులకు సంక్షేమ చట్టం-2007, నియమావళి-2011 అండగా ఉంటున్నాయి. హిందూ దత్తత, పోషణ చట్టం-1956 ప్రకారం వృద్ధులైన తల్లిదండ్రుల పోషణ బాధ్యత పిల్లలదే. ఈ విషయంలో పిల్లలను అడిగే హక్కు తల్లిదండ్రులకు ఉంది. క్రిమినల్‌ ప్రొసీజర్‌ కోడ్‌-1973లో సెక్షన్‌ 125 ప్రకారం తల్లిదండ్రులు తమను తాము పోషించుకోలేని స్థితిలో ఉన్నప్పుడు చట్టమే వారి పోషణకయ్యే ఖర్చులను పిల్లల నుంచి ఇప్పిస్తుంది. కోర్టులతో సంబంధం లేకుండా వృద్ధుల కోసం కేంద్ర ప్రభుత్వం ఈ చట్టాన్ని(2007) తీసుకువచ్చింది. తెలంగాణ ప్రభుత్వం వారికోసం నూతనంగా వయోవృద్ధుల పోషణ, సంక్షేమ నియమావళి-2011ను రూపొందించింది.

సున్నితంగా పరిష్కరిస్తాం: మహ్మద్‌ అబ్దుల్‌ జావీద్‌ పాషా, న్యాయమూర్తి, జిల్లా న్యాయసేవాధికార సంస్థ

ఆర్డీవో కోర్టులో వయోవృద్ధుల కేసులు పరిష్కరిస్తారు. అక్కడ రాజీ కుదిర్చినా ఇరువర్గాల మధ్య సంబంధాలు దెబ్బతింటున్నాయి. కానీ, మా వద్దకు వచ్చే కేసుల్లో తల్లిదండ్రులకు, వారి పిల్లలకు విడివిడిగా కౌన్సెలింగ్‌ ఇస్తాం. వారి సమస్యను సున్నితంగా పరిష్కరిస్తాం. రాజీ అనంతరం తల్లిదండ్రులు వారి పిల్లలు సంతోషంగా ఉంటున్నారు. న్యాయసేవాధికార సంస్థ చొరవతో ఖమ్మం ప్రభుత్వ ఆస్పత్రిలో వయోవృద్ధులకు ప్రత్యేకంగా వార్డు ఏర్పాటు చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని