logo

శ్రీమహాలక్ష్మి అవతారంలో దర్శనం

భద్రాచలం శ్రీసీతారామచంద్రస్వామి వారి ఆలయంలో గత నెల 26న ప్రారంభమైన విజయ దశమి శరన్నవరాత్రి మహోత్సవాలు భక్తులను మంత్రముగ్ధులను చేస్తున్నాయి. ఈ వేడుకలలో తొమ్మిదో రోజైన మంగళవారం లక్ష్మీతాయారు అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు.

Published : 05 Oct 2022 04:16 IST

నేడు దసరా మండపంలో శమీ పూజ

భద్రాచలం, న్యూస్‌టుడే: భద్రాచలం శ్రీసీతారామచంద్రస్వామి వారి ఆలయంలో గత నెల 26న ప్రారంభమైన విజయ దశమి శరన్నవరాత్రి మహోత్సవాలు భక్తులను మంత్రముగ్ధులను చేస్తున్నాయి. ఈ వేడుకలలో తొమ్మిదో రోజైన మంగళవారం లక్ష్మీతాయారు అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. ఉత్సవ మూర్తులను శ్రీమహాలక్ష్మి రూపంలో అలంకరించారు. ధూపదీప నైవేద్యాలను సమర్పించారు. భక్తులు విశేష సంఖ్యలో దర్శనాలు చేసుకుని సామూహిక కుంకుమార్చన నిర్వహించారు. పూజలు చేసి తమకు కలిగిన భాగ్యానికి ఆనంద పరవశులయ్యారు. శ్రీరామాయణ పారాయణం భక్తిభావాలను చాటింది. సంక్షేప రామాయణ హోమం ఆధ్యాత్మికంగా వైభవాన్ని పెంచింది. నేడు దసరాను పురస్కరించుకుని సీతారామలు వారికి మహా పట్టాభిషేకం నిర్వహిస్తారు. రాములవారు ఊరేగింపుగా ఆలయం నుంచి దసరా మండపానికి వేంచేస్తారు. అక్కడ ఆయుధ పూజ నిర్వహించి శమీ పూజ చేస్తారు. శమీ చెట్టు నుంచి ఆకులను సేకరించి భక్తులకు అందిస్తారు. శమీ సకల విజయాలను సిద్ధిస్తుందన్న నమ్మకంతో ఈ ఆకులను అందుకునేందుకు అమితాసక్తి కనబరుస్తారు. ఇదే ప్రాంగణంలో శ్రీరామలీలా మహోత్సవం నిర్వహిస్తారు. ఇందులో భాగంగా రావణ వధను నిర్వహించేందుకు బొమ్మను ప్రత్యేకంగా తయారు చేశారు. ఈ ఏర్పాట్లను ఈవో శివాజీ, ఈఈ రవీంద్రనాథ్‌ పర్యవేక్షించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని