logo

మంచిని ఆశిద్దాం.. విజయం సాధిద్దాం

చెడుపై మంచి సాధించిన విజయానికి సూచికే ‘దసరా’.. ఆధునిక కాలంలో మా‘నవ’ జీవనంలో వచ్చిన మార్పులే సమాజంపై మంచి చెడుల్ని నిర్దేశిస్తున్నాయి. ప్రకృతి దుర్వినియోగం, మితిమీరిన సాంకేతిక వినియోగం, అత్యాశలే మనపై దుర్మార్గ శక్తుల్ని, మనలో దుష్ట ఆలోచనల్ని తీసుకొస్తున్నాయి.. సమస్య ఉన్నచోటే పరిష్కారమూ దొరుకుతుంది.

Updated : 05 Oct 2022 06:30 IST

పాల్వంచ పట్టణం, న్యూస్‌టుడే

చెడుపై మంచి సాధించిన విజయానికి సూచికే ‘దసరా’.. ఆధునిక కాలంలో మా‘నవ’ జీవనంలో వచ్చిన మార్పులే సమాజంపై మంచి చెడుల్ని నిర్దేశిస్తున్నాయి. ప్రకృతి దుర్వినియోగం, మితిమీరిన సాంకేతిక వినియోగం, అత్యాశలే మనపై దుర్మార్గ శక్తుల్ని, మనలో దుష్ట ఆలోచనల్ని తీసుకొస్తున్నాయి.. సమస్య ఉన్నచోటే పరిష్కారమూ దొరుకుతుంది. దసరా పర్వదినం సందర్భంగా ఉభయ జిల్లాల్లో పలు సామాజిక సమస్యలు, వాటిని నియంత్రించాల్సిన ఆవశ్యకతను విశ్లేషిస్తూ కథనం..


చెత్తపై యుద్ధం

శివారులన్నీ ‘చెత్త’ దారులే.. మున్నేరు పక్కన, ముర్రేడు చెంతన నిలువెత్తు రూపం.. మనదే ఆ పాపం..! పట్నంతో పల్లెల పోటీ.. ఎవరికి వారే ‘ఘనా’పాటి చెత్తను చిత్తు చేద్దాం.. దానికి సేంద్రియ రూపమిద్దాం పునర్వినియోగమైతేనే ‘అర్థం’.. ఆరోగ్యం భద్రం

ఖమ్మం, భద్రాద్రి జిల్లాల్లో ఏడు పురపాలికలు, నగరపాలక పరిధిలో నిత్యం 300 మెట్రిక్‌ టన్నుల వ్యర్థాలు తయారవుతున్నాయి. కేవలం 65 శాతం మాత్రమే రీసైక్లింగ్‌ అవుతుండగా మిగిలిన 35 శాతం గుట్టల్లా పేరుకుపోతున్నాయి. రెండు జిల్లాల్లో 44 మండలాల పరిధిలో నిత్యం 220 మెట్రిక్‌ టన్నుల వ్యర్థాలను నివాసాల నుంచి సేకరిస్తున్నారు. 2019 వరకు గ్రామాల్లో డంపింగ్‌ యార్డులు లేవు. వ్యర్థాల పునర్వినియోగం లేకపోవటంతో వ్యర్థాలు సేకరించినా ఉపయోగం లేకుండా పోతోంది.

విజయమిలా..

అన్నిచోట్లా నివాసాల నుంచే తడి, పొడి వ్యర్థాలను వేరుగా సేకరించాలి. తడి వ్యర్థాలతో ఇంట్లోనే సేంద్రియ ఎరువు తయారు చేసుకునేలా అవగాహన కల్పించాలి. మూడు, నాలుగు వార్డులకు కలిపి ఒక తడి, పొడి వనరుల సేకరణ కేంద్రాలను ఏర్పాటుచేయాలి.


ప్లాస్టిక్‌ను పాతరేద్దాం

పాలిచ్చే గేదెలు మొదలు పరుగెత్తే నదుల దాకా పాలి‘థిన్‌’ బాధితులే.. అవనిలో కరగని, విరగని రూపం భావితరాలకదే పెద్ద శాపం అడపాదడపా దాడులు.. అవి కాదు పరిష్కారాలు ఏలికలు చెబితే చాలదు.. చూపితేనే ‘ప్రత్యామ్నాయం’ ‘దారి’పడేదాకా హలధారి రూపమెత్తాల్సిందే..!

మ్మడి జిల్లాలోని ప్రధాన పట్టణాల్లో నిత్యం 100 మెట్రిక్‌ టన్నుల ప్లాస్టిక్‌ ఉత్పత్తి అవుతున్నట్లు అధికారిక లెక్కలు చెబుతున్నాయి. వీటిలో 80 మెట్రిక్‌ టన్నులు రీసైక్లింగ్‌ యూనిట్‌కు పంపుతున్నారు. గ్రామాల్లో 65 మెట్రిక్‌ టన్నులు ఉత్పత్తి అవుతున్నా రీసైక్లింగ్‌ లేదు. పట్టణాలకు పోటీగా పల్లెల్లో పాలిథిన్‌ వినియోగం పెరగడం ఆందోళనకర అంశం.

* రీసైకిల్‌ కాని ప్లాస్టిక్‌ను విడతల వారీగా ఎత్తివేయాలి. ప్రత్యామ్నాయ వస్తువులను విరివిగా అందుబాటులోకి తేవాలి. ఉభయ జిల్లాల్లో స్థానిక మహిళా సంఘాలు, నిరుద్యోగ యువతతో వీటి తయారీని ప్రోత్సహించాలి.


పౌరస్పృహే పరమావధి!

చెప్పేందుకు కాదు.. చేసేందుకే నీతులు పొరుగువారి నుంచి ఆశించినదే నీవాచరించు.. ని‘బంధనాలు’ కావవి.. సమానత్వ సాధనకు దగ్గరి దారులు పదుగురి సౌఖ్యమే పరమావధి కావాలి.. పౌరస్పృహ పాటింపే అందుకు మార్గమన్నది గుర్తెరగాలి..

చాలామంది ప్రధానంగా పట్టణాల్లో చెత్తను కాల్వల్లో, రోడ్డుపై పారవేస్తున్నారు. రూ.లక్షలు వెచ్చించి కొన్న స్థలాల నిర్వహణను గాలికి వదిలేస్తున్నారు. ట్రాఫిక్‌ ఉల్లంఘన అయితే చెప్పే పనేలేదు.

* 2021-22లో ట్రాఫిక్‌ నిబంధనలు ఉల్లంఘించటంతో ఉభయ జిల్లాల్లో దాదాపు 11 లక్షల మంది అపరాధ రుసుం చెల్లించారు. వ్యక్తిగత క్రమశిక్షణను పాఠశాల స్థాయి నుంచి ఆచరణాత్మకంగా నేర్పటమే పరిష్కారం.


యువతా జరభద్రం

ఉరకలెత్తే వయసు.. పరుగులెత్తే మనసు అగ్నికి వాయువు తోడైనట్టు.. చేతిలో రయ్యుమనే బైక్‌ రాకెట్టు నిశా కళ్ల నీడలో మిగిలేది ప్రమాద జాడలే.. ‘దారి’ తప్పిన యువతకు మంత్రణమే దివ్యౌషధం..   గతానుభవాలే అధ్యాయాలు.. అమ్మానాన్నల ఆకాంక్షల్ని గుర్తుతేవటమే వేగ నిరోధకాలు!

మ్మడి ఖమ్మం జిల్లాలో రోడ్డు ప్రమాదాలు ఏటా పెరుగుతున్నాయి. మృతుల్లో యువత శాతం పెరగడం ఆందోళన కలిగిస్తోంది. మితిమీరిన వేగం, మద్యం మత్తు, అధ్వాన దారులు, మూలమలుపులు, స్పోర్ట్‌ బైక్‌ల వినియోగమే ఇందుకు కారణాలు.

* 2021 జనవరి నుంచి 2022 ఆగస్టు వరకు ఉమ్మడి ఖమ్మంలో 645 రోడ్డు ప్రమాదాలు చోటుచేసుకోగా 467 మంది మృత్యువాతపడ్డారు. వీరిలో 153 మంది 18-35 ఏళ్లలోపు వారుండటం బాధాకరం.

ళాశాలలు, పాఠశాలల్లో విద్యార్థులకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలి. పిల్లల్ని కోల్పోయిన తల్లిదండ్రుల వ్యథార్థ జీవితాలను కళ్లకు కట్టినట్టు ఉదహరించాలి. బ్లాక్‌ స్పాట్‌లను గుర్తించి చర్యలు చేపట్టాలి.


ఆశ్రమ విద్యార్థి..

అమ్మ అప్యాయత, నాన్న ఓదార్పును వదిలి వచ్చినవారు.. పేదరికం సేదదీరే ఇంట్లో చదువు సాగక పెట్టేబేడా సర్దుకువచ్చిన వారు.. గురువులే బాధ్యతల బరువులెత్తి భద్రమైన భవితను అందిస్తారని ఆశించి వచ్చినవారు.. మట్టిలో మాణిక్యాలు.. అనుభవాల కలబోతలు వాళ్లు! పాకురుపట్టిన నీళ్లు.. కంటనీరు తెప్పించే కూరలు చెదలు పట్టిన గదులు.. వ్యాధులు తెచ్చే శౌచాలయాలు ఇవి తొలగితేనే ‘గురు’ విద్యకు అర్థం.. పరమార్థం!

మ్మడి ఖమ్మం జిల్లాలో పాఠశాల, జిల్లా స్థాయి హాస్టళ్లు, ఆశ్రమాలు, గురుకులాలు మొత్తం 360 వరకు ఉన్నాయి. వీటిల్లో 50 వేలకు పైగా విద్యార్థులు చదువుకుంటున్నారు. హాస్టళ్లలో సరిపడా మరుగుదొడ్లు, తాగునీరు, గదులు అందుబాటులో లేక అమ్మాయిల అవస్థలు చెప్పనలవి కావు. ఒక్కో గదిలో 30-50 మంది ఉండాల్సి వస్తోంది. సీజనల్‌ వ్యాధుల సమయంలో ఒకరికి వస్తే అంతా జ్వరం బారినపడుతున్నారు.

కప్పటితో పోల్చితే వసతి గృహాల నిర్వహణలో అభిలషణీయమైన మార్పులు చాలా వచ్చాయి. మౌలిక వసతులను పూర్తి స్థాయిలో ఏర్పాటు చేస్తేనే పూర్తి స్థాయి లక్ష్య సాధన సాధ్యమవుతుంది. నిధులు వచ్చేలా, సకాలంలో పనులు పూర్తయ్యేలా చూడాల్సిన బాధ్యత జిల్లా ఉన్నతాధికారులదే.


కామపిశాచి..

కామం కళ్లు మూసేస్తోంది.. విలువల వలువల్ని ఊడదీస్తోంది.. పసిప్రాయాన్ని, పచ్చని కాపురాన్ని చిదిమేస్తోంది.. ప్రియుని మోజులో భార్య.. ప్రియురాలి మోజులో భర్త కడుపున పుట్టిన పిల్లల్నీ గుట్టుగా కాలరాయిస్తోంది..! ‘నెట్టింట అశ్లీలత’ నట్టింటే నర్తిస్తోంది.. కర్రుకాల్చే చట్టాలే కాదు.. కాటేసే శక్తులకూ అడ్డుకట్ట వేయాలి నివారణ కంటే నిరోధమే ఉత్తమం!

ఉమ్మడి ఖమ్మంలో 2019 జనవరి నుంచి 2022 ఆగస్టు వరకు 680 పోక్సో కేసులు నమోదయ్యాయి. 2021 జనవరి నుంచి 2022 ఆగస్టు వరకు 427 అత్యాచార కేసులు నమోదయ్యాయి. ఏటా ఈ కేసుల తీవ్రత పెరుగుతుండటం ఆందోళనకర పరిణామం.  

శ్లీల వెబ్‌సైట్లు, మాదక ద్రవ్యాల వినియోగం.. ఇలాంటి వాటికి బానిసైన వారే ఎక్కువగా లైంగిక దాడులకు పాల్పడుతున్నారు. వారికి మానసిక నిపుణులతో కౌన్సెలింగ్‌ ఇప్పించాలి. సైట్లను, మాదక ద్రవ్యాలను నిరోధించాలి.

Read latest Khammam News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts