logo

కలిసి చదివి... కలల సాకారం

వారు నలుగురు మిత్రులు. ఉపాధ్యాయ వృత్తి చేపట్టారు. కానీ ఏదో వెలితి.. ఉన్నతోద్యోగాలు సాధించాలనేది వారి కల. పట్టుదలతో కృషి చేశారు. ఖమ్మంలో ఓ గది అద్దెకు తీసుకొని కలిసి చదివారు. బృంద చర్చలతో అవగాహన పెంచుకున్నారు

Updated : 07 Oct 2022 10:35 IST

ఉన్నతోద్యోగాలు సాధించిన ఉపాధ్యాయులు

ఎర్రుపాలెం, న్యూస్‌టుడే

వారు నలుగురు మిత్రులు. ఉపాధ్యాయ వృత్తి చేపట్టారు. కానీ ఏదో వెలితి.. ఉన్నతోద్యోగాలు సాధించాలనేది వారి కల. పట్టుదలతో కృషి చేశారు. ఖమ్మంలో ఓ గది అద్దెకు తీసుకొని కలిసి చదివారు. బృంద చర్చలతో అవగాహన పెంచుకున్నారు. పట్టువదలని విక్రమార్కుల్లా శ్రమించి గ్రూపు-2 ఉద్యోగాలు సాధించి ఎంతోమందికి స్ఫూర్తిదాయకంగా నిలుస్తున్నారు. ఉన్నత ఉద్యోగాలు సాధించిన నలుగురు ఉపాధ్యాయుల ప్రస్థానంపై ‘న్యూస్‌టుడే’ ప్రత్యేక కథనం..


ఉపాధ్యాయుడి నుంచి ఉప తహసీల్దార్‌గా..

ఎర్రుపాలెం మండలంలోని భీమవరం గ్రామానికి చెందిన మందడపు రామారావు 2006 డీఎస్సీలో ఉపాధ్యాయుడిగా ఎంపికయ్యాడు. తిరుమలాయపాలెం మండలంలోని పడమటి తండా పాఠశాలలో పనిచేస్తూ గ్రూప్‌-2కు సిద్ధమయ్యారు. మిత్రులతో కలిసి ఖమ్మం నగరంలో ఓ గది అద్దెకు తీసుకుని పాఠశాల నుంచి వచ్చిన తరువాత పరీక్షలకు సమాయత్తమయ్యారు. తొలి ప్రయత్నంలో 2016లో పరీక్ష రాసి ఇంటర్వ్యూలో విజయం సాధించి ఉప తహసీల్దార్‌గా ఎంపికయ్యారు. హన్మకొండ కలెక్టరేట్‌లో శిక్షణ పొంది ప్రస్తుతం జనగామ జిల్లా స్టేషన్‌ ఘన్‌పూర్‌లో విధులు నిర్వహిస్తున్నారు.

పోటీ పరీక్షలకు సిద్ధమయ్యేవారు తెలుగు అకాడమీ పుస్తకాలు, పోటీ పరీక్షల టెస్ట్‌ పేపర్స్‌ సిలబస్‌కు అనుగుణంగా చదవాలి. ‘ఈనాడు’, ఆంగ్ల దిన పత్రికలు చదవడం ద్వారా సామాజిక అంశాలు, బృంద చర్చలతో పరిజ్ఞానం పెరుగుతుంది. నిత్యం 8 గంటలు శ్రమించా.


సబ్‌ రిజిస్ట్రార్‌గా స్ఫూర్తిదాయక పయనం

ఇల్లెందు పట్టణానికి చెందిన నూకలపాటి అప్పారావు 2002 డీఎస్సీలో ఉపాధ్యాయుడిగా ఎంపికయ్యారు. చింతకాని మండలంలోని తిమ్మినేనిపాలెం ఉన్నత పాఠశాలలో పని చేస్తూ.. గ్రూపు-2కు సిద్ధమయ్యారు. తొలి ప్రయత్నంలో నాన్‌ ఎగ్జిక్యూటివ్‌ పోస్ట్‌ రావటంతో చేరకుండా రెండో ప్రయత్నం చేశారు. 2016లో గ్రూపు-2 పరీక్షలో సబ్‌ రిజిస్ట్రార్‌గా ఎంపికయ్యారు. ప్రస్తుతం కరీంనగర్‌ సుల్తానాబాద్‌లో బాధ్యతలు నిర్వహిస్తున్నారు.

పోటీ పరీక్షలకు సిద్ధమయ్యేవారు తెలుగు అకాడమీ, అంబేడ్కర్‌ సార్వత్రిక విశ్వవిద్యాలయం పుస్తకాలను ప్రామాణికంగా తీసుకోవాలి. ప్రణాళికబద్ధంగా చదవాలి. ప్రతి సబ్జెక్టుపై అవగాహన పెంచుకొని లక్ష్య సాధనకు శ్రమించాలి.


ఇల్లందకుంట ఈవోగా విధులు

నేలకొండపల్లి మండలంలోని అప్పలనర్సింహాపురం గ్రామానికి చెందిన కందుల సుధాకర్‌ 2003 డీఎస్సీ నెగ్గి ఉపాధ్యాయ వృత్తిలో ప్రవేశించారు. తిరుమలాయపాలెం మండలంలోని రావిచెట్టుతండాలో పనిచేస్తూ గ్రూపు-2కు సిద్ధమయ్యారు. తొలి ప్రయత్నంలో ఎక్సైజ్‌ ఎస్సైగా ఉద్యోగం వచ్చినా చేరలేదు. రెండో ప్రయత్నంలో 2016లో దేవాదాయ శాఖలో ఈఓగా ఉద్యోగం సాధించారు. ప్రస్తుతం కరీంనగర్‌ జిల్లాలోని ఇల్లందకుంట ఈఓగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.

పాఠశాలకు వెళ్లి వచ్చి మిత్రులతో కలిసి గదిలో చదివి పరీక్షలకు సిద్ధమయ్యా. ప్రతి సబ్జెక్టును చర్చించి అవగాహన పెంచుకున్నా.


సెలవు పెట్టి చదివి కొలువు సాధన

జూలూరుపాడు మండలంలోని కాకర్ల గ్రామానికి చెందిన లంకా ఫణికిషోర్‌ 2002 డీఎస్సీలో ఉపాధ్యాయుడిగా ఎంపికయ్యారు. చింతకాని మండలం పాతర్లపాడు పాఠశాలలో పనిచేస్తూ గ్రూపు-2కు సిద్ధమయ్యారు. తొలిసారి నాన్‌ ఎగ్జిక్యూటివ్‌ పోస్టు వస్తే చేరకుండా రెండోమారు 2016లో ఉప తహసీల్దార్‌గా ఎంపికయ్యారు. ప్రస్తుతం జనగామ జిల్లాలోని లింగాలఘన్‌పూర్‌ మండలంలో పని చేస్తున్నారు.

పాఠశాలకు రెండు నెలలు సెలవు పెట్టి సిద్ధమయ్యా. కోచింగ్‌ లేకుండా తెలుగు అకాడమీ పుస్తకాలను చదివా. ప్రతిరోజూ 10 నుంచి 15 గంటలు ప్రిపేర్‌ అయ్యా.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని