logo

Passport: పాస్‌పోర్టు విచారణ నాలుగు రోజులే!

పాస్‌పోర్టుకు దరఖాస్తు చేసుకుంటే నెలల తరబడి నిరీక్షించాల్సి వచ్చేది. పోలీసు విచారణ ఎప్పుడు జరుగుతుందో, వారు ఎప్పుడు వస్తారో తెలియక దరఖాస్తుదారులు ఆందోళనకు గురయ్యేవారు.

Updated : 24 Nov 2022 11:43 IST

ఖమ్మం నేరవిభాగం, న్యూస్‌టుడే

పాస్‌పోర్టుకు దరఖాస్తు చేసుకుంటే నెలల తరబడి నిరీక్షించాల్సి వచ్చేది. పోలీసు విచారణ ఎప్పుడు జరుగుతుందో, వారు ఎప్పుడు వస్తారో తెలియక దరఖాస్తుదారులు ఆందోళనకు గురయ్యేవారు. వారు వచ్చినపుడు అందుబాటులో లేకుంటే పరిస్థితి ఏంటి? పాస్‌పోర్టు ఇస్తారా, తిరస్కరిస్తారా అనే సందేహాలు ప్రజలను వేధించేవి. వీటిని అధిగమించేందుకు తెలంగాణ పోలీసు శాఖ వెరీఫాస్ట్‌ అనే సాప్ట్‌వేర్‌ను ప్రవేశపెట్టింది. దీంతో పాస్‌పోర్టు జారీ ప్రక్రియ మరింత వేగవంతమైంది. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే తెలంగాణలో వేగంగా పాస్‌పోర్టు జారీకి వెరిఫికేషన్‌ను పూర్తి చేస్తున్నారు. దేశస్థాయిలో తెలంగాణ పోలీసు శాఖ పాస్‌పోర్టుల జారీలో మూడుసార్లు ది బెస్ట్‌ వెరిఫికేషన్‌ అవార్డును కేంద్ర విదేశాంగ శాఖ నుంచి అందుకుంది. ఉమ్మడి జిల్లాలోని ఖమ్మం పాస్‌పోర్టు కేంద్రానికి అందిన దరఖాస్తులను ఆధునిక సాంకేతిక విధానంలో విచారణ వేగవంతంగా సాగిస్తున్నారు.


అందివచ్చిన ‘వెరీఫాస్ట్‌’ సాంకేతికత  

రాష్ట్ర పోలీసు శాఖ ప్రవేశపెట్టిన వెరీఫాస్ట్‌ అప్లికేషన్‌తో ప్రజలకు పాస్‌పోర్టు అందించేందుకు విచారణను వేగవంతం చేస్తున్నారు. దరఖాస్తు చేసిన నాలుగురోజుల్లోనే వెరిఫికేషన్‌ను పోలీసులు పూర్తి చేస్తున్నారు. ఇతర రాష్ట్రాలతో పోల్చినప్పుడు ఇది రికార్డు సమయం కావడం విశేషం. ప్రస్తుతం పాస్‌పోర్టు కోసం దరఖాస్తు చేసిన వారి ఇంటికి వెళ్లి విచారణ చేసి వారు చెప్పిన వివరాల్లో వాస్తవాలను నిర్ధారించి పాస్‌పోర్టు కార్యాలయానికి పోలీసులు నివేదిక అందిస్తున్నారు. ఇంటరాక్టివ్‌ వాయిస్‌ రెస్పాన్స్‌ సిస్టమ్‌ ద్వారా దరఖాస్తుదారులు విచారణ ప్రక్రియను తెలుసుకునేలా చర్యలు తీసుకుంటున్నారు. దీంతోపాటు కాల్‌ సెంటర్‌ ద్వారా విచారణకు వెళ్లిన పోలీసుల పనితీరు, ప్రవర్తనను అధికారులు ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్నారు. విచారణకు వెళ్లిన వారు ఎవరైనా డబ్బులు తీసుకుంటున్నట్లు తెలిస్తే వారిపై కఠినంగా చర్యలు తీసుకుంటారు. ఈ విషయంలో జిల్లా పోలీసులు ఇప్పటివరకు ఎటువంటి ఆరోపణలు ఎదుర్కోలేదు.


పాస్‌పోర్టు దరఖాస్తుల విచారణకు అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకుంటున్నాం. నాలుగు రోజుల్లోనే ప్రక్రియ పూర్తి చేస్తున్నాం. ఇది ఎంతో పారదర్శకంగా జరుగుతుంది. ఎలాంటి ఆరోపణలు వచ్చినా సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకుంటాం. 

-విష్ణు ఎస్‌ వారియర్‌, సీపీ, ఖమ్మం

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని