logo

యువత విజయానికి మూడు సూత్రాలు

యువత ప్రణాళిక ప్రకారం చదివితే అనుకున్న లక్ష్యం సాధించవచ్చని, డెడికేషన్‌(అంకితభావం), డిటెర్మినేషన్‌(సంకల్పం), డిసిప్లిన్‌(క్రమశిక్షణ) అనే ‘త్రీ’డీ సూత్రం విజయానికి ఎంతో దోహదపడుతుందని ఖమ్మం నగరపాలక సంస్థ కమిషనర్‌ ఆదర్శ్‌ సురభి చెప్పారు.

Updated : 25 Nov 2022 05:11 IST

ఇంపాక్ట్‌ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్న యండమూరి వీరేంద్రనాథ్‌, పక్కనే కమిషనర్‌ ఆదర్శ్‌సురభి, కురివెళ్ల ప్రవీణ్‌కుమార్‌ తదితరులు

ఖమ్మం విద్యావిభాగం, న్యూస్‌టుడే: యువత ప్రణాళిక ప్రకారం చదివితే అనుకున్న లక్ష్యం సాధించవచ్చని, డెడికేషన్‌(అంకితభావం), డిటెర్మినేషన్‌(సంకల్పం), డిసిప్లిన్‌(క్రమశిక్షణ) అనే ‘త్రీ’డీ సూత్రం విజయానికి ఎంతో దోహదపడుతుందని ఖమ్మం నగరపాలక సంస్థ కమిషనర్‌ ఆదర్శ్‌ సురభి చెప్పారు. ఖమ్మం భక్తరామదాసు కళాక్షేత్రంలో గురువారం జరిగిన ‘ఇంపాక్ట్‌’ కార్యక్రమంలో ఆయన ముఖ్యఅతిథిగా హాజరై ప్రసంగించారు. రెండు రోజుల పాటు యువతీ, యువకుల కోసం ఉచితంగా ఏర్పాటు చేసిన శిక్షణ తరగతులను ఆయన యండమూరితో కలిసి జ్యోతి వెలిగించి ప్రారంభించారు. ఈసందర్భంగా కమిషనర్‌ మాట్లాడుతూ పది, ఇంటర్‌, డిగ్రీ సమయం ప్రతి విద్యార్థికి అత్యంత కీలకమైనది. ఈ సమయంలో అతను తీసుకునే నిర్ణయాలే తన జీవితంపై ఆధారపడి ఉంటాయి. జీవితంలో ఎదగాలనుకునే యువతకు కృషి, పట్టుదలతో పాటు క్రమశిక్షణ ఎంతో అవసరమన్నారు. ప్రముఖ వ్యక్తిత్వ వికాస నిపుణుడు యండమూరి వీరేంద్రనాథ్‌ మాట్లాడుతూ మనిషి బద్దకం వీడి నిరంతరం కష్టపడి పనిచేయటాన్ని ఆస్వాదించాలని సూచించారు. ఇష్టపడి చదివితే విజయం సాధ్యమవుతుందన్నారు. వ్యక్తిత్వ వికాస నిపుణుడు గంపా నాగేశ్వరరావు మాట్లాడుతూ యువత ఇతర వ్యాపకాలను తగ్గించుకుని జీవిత లక్ష్యాలను నిర్దేశించుకుని అందుకు అనుగుణంగా సిద్ధమవ్వాలని పిలుపునిచ్చారు. వ్యక్తిత్వ వికాస నిపుణుడు ఆకెళ్ల రాఘవేంద్ర మాట్లాడుతూ జీవితంలో ఎదిగి మరో వంద మందికి ఉపాధి కల్పించినప్పుడే విజయవంతమైనట్లని అన్నారు. సమాజంలో విలువలు నేర్చుకోవటం అవసరమని మరో వ్యక్తిత్వ వికాస నిపుణుడు జగన్‌ గురూజీ అన్నారు. ప్రముఖ క్రీడాకారిణి నైనా జైస్వాల్‌, అగస్త్య జైస్వాల్‌ మాట్లాడారు. ఈ కార్యక్రమంలో మిత్రా ఫౌండేషన్‌ ఛైర్మన్‌ కురివెళ్ల ప్రవీణ్‌కుమార్‌, విశిష్ట ఫౌండేషన్‌ ఛైర్మన్‌ గుర్రం శ్రీనివాస్‌, బాలాజీ ఎస్టేట్స్‌ అధినేత వత్సవాయి రవి, టీఎన్‌జీవో జిల్లా అధ్యక్షుడు అఫ్జల్‌ హసన్‌, రంగా శ్రీనివాస్‌, పాలవరపు శ్రీనివాస్‌, యుగేంధర్‌, రవికుమార్‌, నగేశ్‌, సీతారాంబాబు, శ్రీకర్‌, సునిల్‌, ఉపేందర్‌ తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని