logo

2014 తర్వాతే అక్కడ అటవీ ఆక్రమణలు

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చంద్రుగొండ అటవీ రేంజ్‌ అధికారి శ్రీనివాసరావు దారుణహత్య నేపథ్యంలో వివాదానికి కారణమైన బెండాలపాడు అటవీ ప్రాంతాన్ని అటవీశాఖ మరోసారి నూతన సాంకేతిక పద్ధతుల్లో విశ్లేషించింది.

Published : 27 Nov 2022 05:07 IST

బెండాలపాడు అటవీ ప్రాంతంపై అటవీశాఖ శాస్త్రీయ విశ్లేషణ

2014లో ఆక్రమణలు, ఆవాసాలు లేకుండా పచ్చదనంతో కళకళలాడుతున్న ప్రదేశం

ఈనాడు, హైదరాబాద్‌: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చంద్రుగొండ అటవీ రేంజ్‌ అధికారి శ్రీనివాసరావు దారుణహత్య నేపథ్యంలో వివాదానికి కారణమైన బెండాలపాడు అటవీ ప్రాంతాన్ని అటవీశాఖ మరోసారి నూతన సాంకేతిక పద్ధతుల్లో విశ్లేషించింది. బెండాలపాడు అటవీ ప్రాంతంలో గొత్తికోయలు అడవిని నరికేసి పోడు సాగును మొదలుపెట్టింది, అక్కడ నివాసాలు ఏర్పాటుచేసుకుంది 2014 తర్వాతేనని అటవీశాఖ ప్రధాన కార్యాలయం అరణ్యభవన్‌లోని జియోగ్రాఫికల్‌ ఇన్ఫర్మేషన్‌ సిస్టమ్‌ (జీఐఎస్‌) సెల్‌ నిర్ధారించింది. బెండాలపాడులో అక్కడి అటవీ ప్రాంతం 2010లో ఎలా ఉంది? 2014లో, 2002లో ఇలా వేర్వేరు సంవత్సరాల్లో అక్కడి క్షేత్రస్థాయి పరిస్థితుల్ని ఉపగ్రహ ఛాయాచిత్రాలతో విశ్లేషించింది. 2010లో అక్కడ గొత్తికొయల నివాసాలు ఏమీ లేవు. 2014 నుంచి క్రమక్రమంగా పోడు సాగు, ఇళ్ల ఏర్పాటుచేసుకున్నట్లు జీఐఎస్‌ సెల్‌ గుర్తించింది. 2022 నాటికి అక్కడ పెద్దమొత్తంలో అటవీ ప్రాంతాన్ని నరికేసి నివాసాలు ఏర్పాటుచేసుకున్నట్లు ఛాయాచిత్రాలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో ఎఫ్‌ఆర్వో శ్రీనివాసరావు ఆధ్వర్యంలో పోడు సాగులో 25 ఎకరాల్ని స్వాధీనపరచుకుని మొక్కలు నాటడంతో ఆయనపై కక్ష పెంచుకున్న గొత్తికోయలు హత్య చేశారు.

గొత్తికోయలను బహిష్కరించాలని తీర్మానం

చంద్రుగొండ: భారత రాజ్యాంగ దినోత్సవం రోజు గొత్తికోయలను గ్రామం నుంచి బహిష్కరిస్తూ తీర్మానించిన ఘటన బెండాలపాడులో చోటుచేసుకుంది. అటవీ రేంజర్‌ శ్రీనివాసరావుని గొత్తికోయలు హత్య చేసిన నేపథ్యంలో శుక్రవారం గ్రామసభలో ఈమేరకు తీరానించారు. బెండాలపాడు సమీపంలోని అటవీప్రాంతంలోని ఎర్రబోడులో నివసిస్తున్న గొత్తికోయల వల్ల ఇబ్బందికరంగా ఉందని, వారంతా గంజాయి, విప్పసారా తాగుతున్నారని గ్రామస్థులు ఆరోపించారు. మారణాయుధాలతో సంచరిస్తున్నారని, విచక్షణ కోల్పోయి ప్రవర్తిస్తున్నారని, ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని బతుకుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. సొంత రాష్ట్రం ఛత్తీస్‌గఢ్‌కు గొత్తికోయలను పంపించాలన్నారు. తీర్మాన పత్రాన్ని కార్యదర్శి సతీష్‌కు సర్పంచి పూసం వెంకటేశ్వర్లు అందజేశారు. ఈ అంశంపై తహసీల్దారు రవికుమార్‌ ‘న్యూస్‌టుడే’తో మాట్లాడుతూ గ్రామం నుంచి బహిష్కరించే హక్కు లేదన్నారు. ఉన్నతాధికారుల సూచనల మేరకు చర్యలు తీసుకుంటామన్నారు.
 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని